ఇదేం ఆరాచకం? బతికున్న భార్య ఓటును తీసేయాలని చనిపోయిన భర్త దరఖాస్తు
సర్ (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) నమోదులో బోలెడన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లుగా విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి.
By: Garuda Media | 8 Oct 2026 2:53 PM ISTసర్ (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) నమోదులో బోలెడన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లుగా విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇప్పటికే మాన్యువల్ గా దాఖలు చేసిన దరఖాస్తుల్లో అక్రమాలు చోటు చేసుకున్న వైనాలు వెలుగు చూస్తుండగా.. తాజాగా ఆన్ లైన్ లో సమర్పించిన ఫారం 7లో నకిలీలు ఉండటమే కాదు.. వాటి కారణంగా ఓట్లు తీసేసిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఆరాచకానికి పరాకాష్ఠ అన్న రీతిలో తాజాగా వెలుగు చూసిన దారుణ ఉదంతం గురించి తెలిస్తే.. సర్ పేరుతో మరెన్ని దుర్మార్గాలు చోటు చేసుకున్నాయా? అన్న సందేహం రాక మానదు.
తాజాగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఒక ఉదంతం షాక్ కు గురి చేస్తోంది. ఒక మహిళ ఓటును రద్దు చేయాలని ఆన్ లైన్ లో ఫారం 7ను దాఖలు చేసిన వైనాన్ని గుర్తించారు. అందులో షాకింగ్ నిజం ఏమంటే.. సదరు మహిళ చనిపోయినట్లుగా పేర్కొంటూ ఆమె భర్త దరఖాస్తు పెట్టినట్లుగా ఉంది. అసలు నిజం ఏమంటే.. చనిపోయినట్లుగా చెబుతున్న ఆ మహిళ చనిపోలేదు. అంతేనా.. బతికి ఉన్నట్లుగా పేర్కొన్న భర్త ఎప్పుడో చనిపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే చనిపోయిన భర్త బతికి ఉన్న భార్యను చనిపోయినట్లుగా చెబుతూ.. ఆమె ఓటును రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేయటం.
ఇంతకు మించిన ఆరాచకం ఇంకేం ఉంటుంది? మరో దారుణం ఏమంటే.. తాజాగా దరఖాస్తు చేసినట్లుగా చెబుతున్న భర్త.. దాదాపు 24 ఏళ్ల క్రితమే మరణించటం. అతడి పేరుతో ఆన్ లైన్ లో ఆమె ఓటును తొలగించాలని కోరగా.. అందుకు ఓకే చెప్పిన ఓటును తీసేశారు. తన ఓటు రద్దు అయ్యిందన్న విషయాన్ని తెలుసుకున్న బిల్కిస్ సుల్తానా తన ఓటును తిరిగి చేర్చుకోవటానికి వీలుగా ఫారం 6ను దాఖలు చేసుకోవాల్సి వచ్చింది.ఈ క్రమంలో సుల్తానా ఓటు ఎందుకు రద్దైందన్న విషయాన్ని క్రాస్ చెక్ చేయగా.. నకిలీ ఫారం 7 ఉదంతం వెలుగు చూసింది. ఈ లెక్కన ఆన్ లైన్ లో ఓట్లను తొలగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను సరిగా క్రాస్ చెక్ చేస్తే..మరెన్ని దారుణాలు వెలుగు చూస్తాయన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భోలక్ పూర్ బాకారంలో నివాసం ఉండే బిల్కిస్ సుల్తానాకు మూడు దశాబ్దాలుగా ఓటుహక్కు ఉంది. ఆమె ఎపిక్ నంబరు జీటీఆర్ 2671501. ఆమె భర్త మహ్మద్ రఫీఖుద్దీన్ 2002లో మరణించారు. అంటే.. ఇప్పటికి ఆయన కాలం చేసి 24 ఏళ్లైంది. ఇదిలా ఉంటే.. చనిపోయిన భర్త రఫీఖుద్దీన్.. బతికి ఉన్న తన భార్య బిల్కిస్ సుల్తానా పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటూ ఫారం7 ను ఆన్ లైన్ లో సమర్పించారు. దీని ఆధారంగా ఆమె ఓటును తొలగించారు.
తన ఓటు లేదన్న విషయాన్ని గుర్తించిన సుల్తానా..తిరిగి తనను ఓటరుగా నమోదు చేయాలని కోరుతు మరో ఫారం 6ను దాఖలు చేసుకోవాల్సి వచ్చింది. ఆమెను ఓటు ఎందుకు రద్దైందన్న విషయాన్ని చెక్ చేసే క్రమంలో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో.. సర్ పేరుతో మరెన్ని దుర్మార్గాలు చోటు చేసుకున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్న. కొద్దిరోజుల క్రితం ఇదే ముషీరాబాద్ నియోజవర్గంలో 31 ఓట్లను తొలగించాలని బూత్ లెవల్ ఏజెంట్ బాలచందర్ బోగస్ ఫారం7 పత్రాలు సమర్పించిన వైనం వెలుగు చూడటం.. ఎన్నికల సంఘం ఆదేశాలతో విచారణ జరిపి.. బాలచందర్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తాజా ఉదంతం నేపథ్యంలో రద్దు చేసిన ఓట్ల విషయంలో మరింత లోతుగా తనిఖీ చేయకుంటే.. ఎంతోమంది అర్హుల ఓట్లు రద్దయ్యే పరిస్థితి.
