Begin typing your search above and press return to search.

మోడీ ప్రభుత్వం మీద బీజేపీ అగ్ర నేత సంచలన వ్యాఖ్యలు !

ఒక వైపు పార్లమెంట్ లో విపక్షాలు ఆందోళనలు బయట చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి

By:  Satya P   |   24 July 2026 9:06 AM IST
మోడీ ప్రభుత్వం మీద బీజేపీ అగ్ర నేత సంచలన వ్యాఖ్యలు !
X

కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇపుడు అన్ని విధాలుగా సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక వైపు పార్లమెంట్ లో విపక్షాలు ఆందోళనలు బయట చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపక్షాల డిమాండ్లు చూసినా సీజేపీ నుంచి వస్తున్న డిమాండ్లు చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ని తప్పించాలనే ఉంటున్నాయి. ఇది తప్ప మిగిలినది ఏదైనా అని ప్రభుత్వం అంటోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ నెల 20న పార్లమెంట్ మార్చ్ కి సీజేపీ పిలుపు ఇచ్చింది కూడా కేంద్ర మంత్రి రాజీనామా కోసమే. దాని కోసం అప్పటికి ఇరవై రోజులుగా సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ అమరణ దీక్ష చేస్తూ వచ్చారు. ఆనాడే ధర్మేంద్ర ప్రధాన్ ని తప్పించి ఉంటే పార్లమెంట్ మార్చ్ అన్న సమస్యే లేదని కూడా అంటున్నారు.

సొంత పార్టీ నుంచే షాక్ :

ఇలా ఇపుడు బీజేపీ పెద్దలు అనేక విధాలుగా సమస్యలతో సతమతం అవుతున్న వేళ సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది. బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషి ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్షా వ్యవస్థపై ఆందోళన చెందుతున్న విద్యార్థుల డిమాండ్లు సమంజసమని ఆయన మద్దతు ఇవ్వడం విశేషం. అంతే కాదు విద్యార్థుల సమస్యలు ఆందోళనను కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడవద్దని ఆయన కోరడం గమనార్హం. ఇక విద్యార్థుల మీద పోలీసుల దాడులు జరగడం బాధాకరమని పేర్కొన్నారు.

సమస్యల మీద సానుభూతి అవసరం:

మురళీ మనోహర్ జోషి అయితే కేంద్ర ప్రభుత్వానికి మరో కీలక సూచన చేశారు. విద్యార్థుల ఆందోళనలను బలప్రయోగంతో కాకుండా సానుభూతితో పరిష్కరించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఇక పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. నిరసనకారులపైన ముఖ్యంగా యువతులపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమని మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరచూ చెబుతూ వస్తున్న వికసిత్ భారత్ ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావనకు తీసుకుని వచ్చారు. విద్యార్థులపై ఈ విధమైన బలప్రయోగం ప్రభుత్వ ఆశయమైన వికసిత్ భారత్ అంటే సమగ్రమైన అభివృద్ధి చెందిన భారతదేశం నినాదానికి నష్టం అన్నారు. ఈ రకమైన ధోరణి సమాజంలోని పెద్ద వర్గాలను దూరం చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దాయన హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజ్ వివాదం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మాజీ విద్యా శాఖ మంత్రిగా :

ఇదిల ఉంటే మురళీ మనోహర్ జోషి వ్యాఖ్యలను తక్కువగా అంచనా వేయరాదు అని అంటున్నారు. ఆయన బీజేపీ పునాదులలో ఒకరుగా ఉన్నారు. అంతే కాదు ఆయన బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా విశేష సేవలు అందించారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన కూడా విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. మోడీ ప్రధాని అయ్యాక 75 ఏళ్ళు దాటిన సీనియర్లు అంతా ఎన్నికా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న బీజేపీ కొత్త సూత్రానికి కట్టుబడి ఆయన 2019 నుంచి ఎన్నికలకూ పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే అపుడపుడు మాత్రం ప్రభుత్వ తీరు మీద ఆయన నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన విమర్శలు చేస్తున్నారు. తాజాగా మురళీ మనోహర్ జోషి విమర్శలు మాత్రం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.