60 రోజులు నిద్రపోతే చాలు.. బ్యాంక్ ఖాతాలో రూ.9.6 లక్షలు!
ముంబైకి చెందిన జినియా ఛటర్జీకి నిద్రపోతూ రూ.9.6 లక్షలు గెలుచుకునే అవకాశం వచ్చింది. వేక్‌ఫిట్ సంస్థ నిర్వహించిన 60 రోజుల స్లీప్ ఇంటర్న్‌షిప్ పోటీలో ఆమె విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 10 మందికి మాత్రమే అవకాశం లభించింది. నిద్ర సమయం, నాణ్యతతో పాటు పలు టాస్కుల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. నగదు బహుమతితో పాటు ఉచిత విదేశీ పర్యటన కూడా ఆమెకు దక్కింది.
By: Priya Chowdhary Nuthalapti | 7 Nov 2026 11:24 AM ISTసాధారణంగా ఉద్యోగం చేయాలంటే రోజూ ఎన్నో గంటలు కష్టపడాలి. కొంతమంది అయితే ఇంటి నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. కానీ నిద్రపోతూ లక్షల రూపాయలు సంపాదించడం గురించి ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. ముంబైకి చెందిన ఓ మహిళ కేవలం 60 రోజుల పాటు జరిగిన ఒక పోటీలో పాల్గొని.. ఏకంగా రూ.9.6 లక్షలు గెలుచుకుంది. అంతేకాదు ఆమెకు ఉచితంగా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం కూడా లభించింది.
ముంబైకి చెందిన జినియా ఛటర్జీ అనే మహిళ ఈ అరుదైన పోటీలో విజేతగా నిలిచింది. వేక్‌ఫిట్ అనే హోమ్ ఫర్నిషింగ్ సంస్థ ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్ పోటీని నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా.. దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివిధ దశల్లో సెలెక్ట్ అయినా.. 10 మందికి మాత్రమే ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు.
ఈ పోటీ దాదాపు రెండు నెలల పాటు కొనసాగింది. ఇందులో పాల్గొన్నవారు ప్రతిరోజూ కరెక్ట్ టైం కి నిద్రపోవాలి. వారి నిద్ర సమయాన్ని, నిద్ర నాణ్యతను పరిశీలిస్తూ రోజువారీ స్కోర్లు ఇచ్చేవారు. ఈ స్కోర్ల ఆధారంగా లీడర్‌బోర్డ్‌లో వారి స్థానాలను నిర్ణయించేవారు.
ఈ పోటీలో కేవలం నిద్రపోతే సరిపోదు. ప్రతి వారం కొన్ని.. ఆసక్తికరమైన టాస్కులు కూడా ఇచ్చేవారు. ప్రముఖ సినిమాల్లోని సన్నివేశాలను నిద్రకు సంబంధించిన అంశాలతో మళ్లీ చేయడం ఒక టాస్క్. అలాగే ఒక వారం పాటు తమ నిద్ర అలవాట్లను పరిశీలించి వివరాలు నమోదు చేయాల్సి వచ్చేది.
రెండు నెలల తర్వాత జినియా ఛటర్జీతో పాటు మరికొందరు ఫైనల్‌కు చేరుకున్నారు. చివరి దశలో జ్ఞాపకశక్తి, పరిశీలన సామర్థ్యం పరీక్షించే టాస్కులు నిర్వహించారు. చివరకు నిద్ర స్కోర్ల ఆధారంగా జినియా విజేతగా నిలిచింది.
ఆమెకు రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు వేక్‌ఫిట్ సంస్థ తరఫున ఉచిత విహారయాత్ర బహుమతిగా లభించింది.
