రోడ్డెక్కి నిరసన తెలిపిన మంత్రిని ఉతికిఆరేసింది.. ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్!
ప్రశ్నించడం అంటే కేవలం సందేహం వ్యక్తం చేయడం కాదు. నిలదీయడం అంటే బాధ్యతను గుర్తుచేయడం. ఈ రెండింటి మధ్య తేడా అర్థమయ్యే సందర్భమే ఇది. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలకు జవాబుదారులు.
By: A.N.Kumar | 22 April 2026 1:11 PM ISTముంబై నగరంలోని ఓ సాధారణ ట్రాఫిక్ జామ్… కానీ అక్కడ జరిగిన ఒక అసాధారణ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మహిళా రిజర్వేషన్లపై ర్యాలీ నిర్వహిస్తున్న మంత్రి గిరీష్ మహాజన్ కాన్వాయ్ వల్ల నిలిచిపోయిన ట్రాఫిక్ మధ్య ఒక మహిళ ముందుకు వచ్చి ప్రశ్నించింది. అది కేవలం అసహనం కాదు.. అది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక గంభీరమైన సందేశం.
ప్రజాస్వామ్యంలో ప్రజలే అధిపతులు అని మనం తరచూ చెబుతుంటాం. కానీ ఆ అధిపత్యం కేవలం ఓటు వేసే రోజుకే పరిమితమవుతుందా? ఎన్నికల తర్వాత ప్రజల పాత్ర ముగుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది ఆ మహిళ. “ప్రజల జీవితాలను ఇబ్బంది పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అని అడిగిన ఆమె మాటలు, ఒక వ్యక్తి గళం మాత్రమే కాదు.. నిశ్శబ్దంగా బాధపడుతున్న వేలమంది స్వరం.
ప్రశ్నించడం అంటే కేవలం సందేహం వ్యక్తం చేయడం కాదు. నిలదీయడం అంటే బాధ్యతను గుర్తుచేయడం. ఈ రెండింటి మధ్య తేడా అర్థమయ్యే సందర్భమే ఇది. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలకు జవాబుదారులు. ఆ జవాబుదారీతనాన్ని గుర్తు చేయడం ప్రజల హక్కు మాత్రమే కాదు.. అది వారి బాధ్యత కూడా.
ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఈ చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఒక దేవాలయంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించిన ఒక ఎన్ఆర్ఐ మహిళకు ఎదురైన పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆమె వీడియోను తొలగించేందుకు ఒత్తిడి, కేసుల బెదిరింపులు, సోషల్ మీడియా నియంత్రణ.. ఇవన్నీ కలిపి ఒక ప్రమాదకర సంకేతాన్ని ఇస్తున్నాయి. ప్రశ్నిస్తే శిక్ష, విమర్శిస్తే ఒత్తిడి అనే పరిస్థితి ఏర్పడితే, మరెవరైనా ముందుకు రావడానికి ధైర్యం చేస్తారా?
ప్రజాస్వామ్యం పుస్తకాలలో ఉన్న సిద్ధాంతం మాత్రమే కాదు.. అది ప్రజల ప్రవర్తనలో వ్యవస్థ స్పందనలో ప్రతిఫలించాలి. విమర్శను వ్యతిరేకతగా ప్రశ్నను దాడిగా పరిగణించే సంస్కృతి పెరిగితే, అది ప్రజాస్వామ్యానికి ముప్పు. చట్టపరమైన హక్కులు ఉన్నా, వాటిని వినియోగించడానికి భయపడే పరిస్థితి ఉంటే, ఆ స్వేచ్ఛ వాస్తవానికి అర్థం కోల్పోతుంది.
రాజకీయ ర్యాలీలు, నిరసనలు ప్రజాస్వామ్య హక్కులే. కానీ ఆ హక్కుల వినియోగం ప్రజల దైనందిన జీవితాలను అడ్డుకోవడం వరకు వెళ్లకూడదు. ఒక వైపు హక్కులు, మరోవైపు బాధ్యతలు.. ఈ రెండింటి మధ్య సమతౌల్యం తప్పనిసరి. అదే ప్రజాస్వామ్య పరిపక్వతకు సూచిక.
ముంబై మహిళ చూపించినది ఒక స్పష్టమైన నిజం. వ్యవస్థను మార్చడానికి ఎప్పుడూ పెద్ద ఉద్యమాలు అవసరం లేదు. ఒక్క వ్యక్తి ధైర్యంగా నిలబడితే చాలు.. అది చర్చను మొదలుపెడుతుంది. ఆ చర్చే మార్పుకు బాటలు వేస్తుంది.
చివరగా ఒక కీలకమైన ప్రశ్న మన ముందుంది.. “ప్రజలు ప్రశ్నించకపోతే.. ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుంది?”
ఈ ప్రశ్నకు సమాధానం మన సమాజం ఇవ్వాలి. ప్రశ్నించే హక్కును కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే. నిలదీసే ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే పాలనలో పారదర్శకత, బాధ్యత నిజంగా అమలులోకి వస్తాయి.
ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే, ప్రజల స్వరం బలంగా ఉండాలి. ఆ స్వరం వినిపించాలి… వినిపించగలగాలి. అందుకు ఈ మహిళనే గొప్ప ఉదాహరణ..
