‘నిరసన’ను నోటికి వచ్చిన బూతులు తిట్టేస్తే హీరో అవుతారా?
తప్పును తప్పుగా ఎత్తి చూపటం తప్పు కాదు. కానీ.. వ్యక్తిగత కోణంలో విషయాల్ని పక్కదారి తీసుకెళ్లటం.. ఈ సందర్భంగా సంస్కారాన్ని పక్కన పెట్టేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం నాగరిక సమాజంలో మంచిది కాదు.
By: Garuda Media | 23 April 2026 10:38 AM ISTతప్పును తప్పుగా ఎత్తి చూపటం తప్పు కాదు. కానీ.. వ్యక్తిగత కోణంలో విషయాల్ని పక్కదారి తీసుకెళ్లటం.. ఈ సందర్భంగా సంస్కారాన్ని పక్కన పెట్టేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం నాగరిక సమాజంలో మంచిది కాదు. ఒక అంశానికి సంబంధించి వందలాది మంది రోడ్ల మీదకు వచ్చి గళం విప్పే వేళలో.. నిరసన తెలిపే అంశంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా.. ట్రాఫిక్ చిక్కులతో సామాన్యులు ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులది. అందుకు భిన్నంగా రాజకీయ నాయకుల్ని.. కీలక స్థానాల్లో ఉన్న వారిని నోటికి వచ్చినట్లుగా ఆవేశంతో.. ఇంగ్లిషులో బండ బూతును పదే పదే తిట్టటం హీరోయిజం అవుతుందా?
రోటీన్ కు భిన్నంగా జరిగే అంశాలను చూసినంతనే.. స్టీరియో టైప్ లో తర్కాన్ని పక్కన పెట్టి.. విచక్షణను వదిలేసి.. మూకస్వామ్య పద్దతిలో ఆమె గ్రేట్.. ఆమె తీరు సూపర్.. రాజకీయ నాయకుల్ని అలా కడిగేయాల్సిందే.. ఆమె తీరు ఆదర్శం లాంటి మాటలు సరైనవేనా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సంఘటనలో మంచి చెడులను తర్కబద్ధంగా చూడటం వదిలేసి.. గుడ్డిగా మద్దతు ఇవ్వటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.
ఇప్పుడు చెప్పేదంతా ముంబయిలోని వర్లీలో నిర్వహిస్తున్న నిరసన ర్యాలీపై ఒక మహిళ నోటికి వచ్చినట్లుగా తిట్టిపోయటం.. గెట్ అవుట్ అంటూ మంత్రిని మాత్రమే కాదు.. రాయలేని పదాన్ని పదే పదే అనటం.. ఆవేశంతో ఊగిపోయిన వీడియో వైరల్ అవుతోంది. దీనికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నట్లుగా మీడియా రిపోర్టులు వస్తున్నాయి. ఇలాంటి వేళ.. కొన్ని ప్రశ్నలు మదిలో మెదిలే పరిస్థితి. నాణెనికి ఒక వైపు చూసి ఒక అవగాహనకు రావటం తప్పే అవుతుంది. ఇప్పుడు నాణెనికి రెండో కోణాన్ని చూడాల్సిన అవసరం ఉంది.
అసలు ఇష్యూ ఎక్కడ మొదలైంది?
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవటానికి కారణమైన విపక్షాల తీరును తప్పు పడుతూ బీజేపీ దేశ వ్యాప్తంగా నిరసన ర్యాలీల్ని చేపట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ వర్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మంది ఈ ర్యాలీలో పాలు పంచుకుున్నారు. దీంతో.. ట్రాఫిక్ సమస్య ఎదురైంది.
వివాదం మొదలైంది ఇలా
ఈ నేపథ్యంలో ఒక మహిళ పెద్ద ఎత్తున అరుస్తూ.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. పోలీసులపైనా.. మంత్రిపైనా మండిపడ్డారు. గెట్ అవుట్ ఫ్రం ఇయర్ అంటూ అక్కడి నుంచి తక్షణమే నిష్క్రమించాలన్నారు. పోలీసుల తీరును తప్పు పడ్డారు. ఆవేశంతో ఊగిపోతూ.. ఇంగ్లిషులో రాయలేని బూతులు తిట్టారు.
వీడియో వైరల్
మహారాష్ట్ర మంత్రిపై ముంబయి మహిళ ఆగ్రహాం వ్యక్తం చేసిన వీడియో నిమిషాల్లో వైరల్ అయ్యింది. పాలకులను సామాన్యులు ప్రశ్నించే ఉదంతాలు రోటీన్ కు భిన్నంగా సాగుతుంటాయి.ఇలాంటి వాటికి నెటిజన్ల మద్దతు పెద్ద ఎత్తున ఉంటుందన్నది తెలిసిందే. అందుకు తగ్గట్లే.. ముంబయి మహిళ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
ఎక్కడ కనెక్టు అయ్యారు?
సదరు మహిళ తాను తన పిల్లల్ని పికప్ చేసుకోవటానికి కారులో వెళుతున్నానని.. ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జాం అయ్యిందని.. గంట నుంచి తాను ఇబ్బంది పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వద్దకు వెళ్లి.. ఆయన్ను ఉద్దేశించి చెడామడా తిట్టేశారు. ఆమెను పోలీసులు శాంతింపచేసే ప్రయత్నం చేశారు.మంత్రి సైతం.. ఆమె ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు.
నిరసనను నిలదీయటం సరైనదేనా?
ఈ విషయాన్ని ఎలా చూడాలన్నది పెద్ద ప్రశ్న. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చని అంశాలపై నిరసన తెలిపే హక్కు అందరికి ఉంటుంది. ముంబయి మహిళ ఉదదంతాన్నే తీసుకుంటే.. ఆమెకు అసౌకర్యాన్ని కలిగించిన అంశాన్ని చూస్తే.. ఈ వైఫల్యం ఎవరిది? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. నిరసనకు సంబంధించిన సమాచారం ముందస్తుగానే అందరికి తెలియజేయటం జరిగింది. అధికారికంగా పోలీసుల నుంచి నిరసనకు అనుమతి తీసుకున్నారు. అలాంటప్పుడు ఎవరికైనా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురైతే.. దాన్ని సాకుగా తీసుకొని మర్యాద.. సభ్యతను వదిలేసి.. నోటికి వచ్చినట్లుగా తిట్టేస్తారా?
నిరసనలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు లేకపోలేదు. అందులోనూ నిరసన తెలిపే హక్కు ఉన్నట్లే.. దాని కారణంగా ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో తాను ఇబ్బందికి గురయ్యాను కాబట్టి.. నోటికి వచ్చినట్లుగా బూతులు తిట్టేసే హక్కు రాదు కదా? ఇలాంటివి హీరోయిక్ చూపించటం ద్వారా బాధ్యత వదిలేసి.. ఇష్టారాజ్యంగా మాట్లాడే సంస్క్రతిని వంట పట్టించుకుంటే అప్పుడు పరిస్థితేంటి?
ఉద్యమాలపై నోరు పారేసుకోవటమా?
నిన్నటి నిరసన ర్యాలీనే తీసుకుంటే వందలాది మంది ఇందులో పాల్గొన్నారు. కొన్ని రిపోర్టుల ప్రకారం అయితే వేలాది మంది. అలాంటప్పుడు కొన్ని చికాకులు ఎదురవుతాయి. బూతులు తిట్టిన ముంబయి మహిళకు ఎలా అయితే గళం విప్పే హక్కు ఉంటుందో.. అదే రీతిలో వేలాది మంది తమ హక్కుల కోసం.. తాము నమ్మిన దాని కోసం రోడ్ల మీదకు వచ్చే హక్కు ఉంది. ఇక్కడ.. ఈ ఇద్దరికి మధ్య ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది.
నిరసనలు.. ఆందోళనలు.. ర్యాలీలు.. ఇలా చూసినప్పుడు ఏ అంశం మీదనైనా సరే.. కొందరు చేసే కార్యక్రమాలు గుప్పెడు మందికి ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాంటప్పుడు వాటిని వేలెత్తి చూపటం తప్పు కాదు. తప్పంతా.. వాడే భాష.. వ్యవహరించాల్సిన తీరుపైనే. మరింత అర్థం అయ్యేలా చెబితే.. తెలుగు ప్రజలు ఇట్టే కనెక్టు అయ్యే తెలంగాణ ఉద్యమాన్నే తీసుకుందాం. ఏళ్లకు ఏళ్లుగా.. ఎన్నో పోరాటాలు.. మరెన్నో నిరసనలు.. ఎంతోమంది ప్రాణత్యాగాలకు ఫలితంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
ప్రాణాలు తీసుకోవటాన్నిచాలామంది వ్యతిరేకించారు. నిజానికి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది.. ఆ కలను సాకారం అయ్యేలా చేసింది వందలాది మంది ప్రాణ త్యాగంతోనే అన్నది మర్చిపోకూడదు. నిజమే.. ఒక ఆలోచన కోసం విలువైన ప్రాణాలు తీసుకోవటంపైనా పెద్ద డిబేట్ నడిచింది. కానీ.. వ్యవస్థలు కదిలేందుకు.. పాలకులకు చురుకు పుట్టించేందుకు ఉద్యమకారుల త్యాగాలు మాత్రమే నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలకమైందన్నది మర్చిపోకూడదు. అదే సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమాన్నే తీసుకుంటే.. వేలాది మంది ఇబ్బందులకు గురయ్యారు. ఢిల్లీలో బస్సు ప్రయాణంలో గ్యాంగ్ రేప్ నకు గురైన నిర్భయ ఉదంతంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు జరిగాయి. అప్పుడు కూడా పెద్ద ఎత్తున సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. అలా అని.. ఆ అంశానికి సంబంధించి నిరసనల కోసం.. తమ ఆగ్రహాన్ని.. ఆవేదనను వ్యక్తం చేయటం కోసం రోడ్ల మీదకు రావటం తప్పు అవుతుందా?
మళ్లీ ముంబయి మహిళ ఉదంతంలోకి వద్దాం. కొందరు తమ సౌకర్యాలకు కష్టం కలిగినప్పడు కోపానికి గురవుతారు. వారి కోపాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో తమ కోపంతో ఒక తప్పుడు విధానాన్ని అనుసరించటం మహా తప్పు అవుతుంది. అదే సమయంలో.. అలాంటి తీరును హీరోయిజంగా.. వీరనారిగా కీర్తించటం తప్పే. ఎందుకంటే.. ఒకరు చేసిన తప్పను ఎత్తి చూపేందుకు మరో తప్పు చేయకూడదు కదా? అలాంటి తప్పుల్ని గ్లామర్ చేసి సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ ఎలివేట్ చేయటం కూడా మహా తప్పే. చివరగా.. కొన్ని సందర్భాల్లో యావత్ దేశం కొన్ని ఉదంతాలపై ఉడికిపోతూ ఉంటుంది. ఆ సందర్భంలోనూ కొందరు తమ సౌకర్యాలకు కలిగే ఇబ్బందుల్ని ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం తప్పు కాదు. కానీ.. ఆ క్రమంలో మర్యాద మిస్ కాకూడదన్నది మర్చిపోకూడదు
