టెక్కీల సంపాదన కన్నా ఆటో డ్రైవర్ల సంపాదనే ఎక్కువ.. ఉత్కర్ష్ సర్వేలో ఆసక్తి కర విషయాలు..
ఒకప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం లేదా కార్పొరేట్ కొలువు ఉంటేనే సమాజంలో గౌరవం, భారీ సంపాదన అనుకునేవాళ్లం.
By: Tupaki Political Desk | 31 March 2026 10:51 AM ISTఒకప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం లేదా కార్పొరేట్ కొలువు ఉంటేనే సమాజంలో గౌరవం, భారీ సంపాదన అనుకునేవాళ్లం. కానీ, ముంబై లాంటి మహానగరాల్లో ఒక ఆటో డ్రైవర్ సంపాదన ఇప్పుడు బీటెక్ పూర్తి చేసిన ఫ్రెషర్స్ కంటే రెండింతలు ఎక్కువగా ఉండడం వింటుంటే మనకు తెలియని ఒక కొత్త ‘ఆర్థిక వాస్తవం’ బయటపడుతోంది. మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఉత్కర్ష్ వర్మ సోషల్ మీడియాలో పంచుకున్న వివరాలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. వైట్ కాలర్ ఉద్యోగాల గ్లామర్ వెనుక ఉన్న తక్కువ జీతాలు, బ్లూకాలర్ వృత్తుల్లో ఉన్న భారీ ఆదాయ మార్గాలపై లోతుగా విశ్లేషిస్తే..
టెక్కీల కంటే ట్రిప్పులే మిన్న
ఉత్కర్ష్ వర్మ ఒక ఆటో డ్రైవర్‌తో జరిపిన సంభాషణ ప్రకారం.. ముంబైలో ఆటో నడపడం అనేది ఇప్పుడు అత్యంత లాభదాయకమైన వృత్తిగా మారినట్లు డ్రైవర్ చెప్పారు. అన్ని ఖర్చులు పోను ఒక డ్రైవర్ రోజుకు సగటున రూ. 2,500 సంపాదిస్తున్నారు. కష్టపడి పనిచేసే డ్రైవర్ నెలకు రూ. 75,000 వరకు ఇంటికి తీసుకెళ్లగలడు. కొంతమంది చురుకైన డ్రైవర్లు నెలకు ఏకంగా రూ. లక్ష మార్కును కూడా అందుకుంటుండగా, కనీస సంపాదన రూ. 60,000 తక్కువ కాకుండా ఉంటోందని ఆయన చెప్పారు.
గ్రాడ్యుయేట్స్ vs ఆటో డ్రైవర్స్!
ముంబైలో ఒక ఫ్రెషర్ (తాజా గ్రాడ్యుయేట్) సగటు ప్రారంభ జీతం సుమారు రూ. 30,000 మాత్రమే ఉంటుంది. అంటే ఒక ఇంజినీర్ సంపాదన కంటే ఆటో డ్రైవర్ సంపాదన రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. వర్మ తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, తాను బీటెక్ పూర్తి చేశాక చేసిన మొదటి ఉద్యోగం జీతం.. నేటి ఆటో డ్రైవర్ల సంపాదన కంటే తక్కువేనని ఒప్పుకోవడం గమనార్హం. ఇది చదువుకున్న వారికి దక్కుతున్న జీతాలపై ఆందోళన కలిగిస్తోంది.
నెట్‌వర్కింగ్ లో కింగ్!
ఆటో డ్రైవింగ్ అనేది కేవలం డ్రైవింగ్ కే పరిమితం అంటే పొరబాటే.. అది ఒక సామాజిక అనుభవం అని వర్మ విశ్లేషించారు. క్యూబికల్స్ (ఆఫీస్ గదుల) లో బందీ అయి ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే, ఆటో డ్రైవర్లు ప్రతిరోజూ వందలాది మంది కొత్త వ్యక్తులను కలుస్తారు. ఇది వారికి గొప్ప నెట్‌వర్కింగ్ అవకాశాలను కల్పిస్తుంది. బాస్ కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా, తమకు నచ్చిన సమయంలో పని చేసుకునే స్వేచ్ఛ వారికి ఉంటుంది.
నాణేనికి మరోవైపు
అయితే, ఈ భారీ ఆదాయం వెనుక ఉన్న కష్టాన్ని కూడా మనం విస్మరించడానికి లేదు. ముంబైలోని ఎండ, వర్షం, ట్రాఫిక్ మధ్య గంటల తరబడి ఆటోలో కూర్చోవడం ఆరోగ్యానికి పెను సవాల్ గా మారే అవకాశం ఉంది. ఏసీ ఆఫీసుల్లో ఉండే సౌకర్యం ఇక్కడ ఉండదు. కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు ఆటో డ్రైవర్లకు ఉండవు. రేపు పనిలోకి వెళ్లలేకపోతే ఆ రోజు సంపాదన సున్నా అనే అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఉద్యోగి ఒక రోజు సెలవు పెట్టినా జీతం వస్తుంది.
ముంబై ఆటో డ్రైవర్ల ఆదాయం టెక్కీల కంటే ఎక్కువగా ఉండడం అనేది ఉపాధి రంగంలోని లోపాలకు ఒక సంకేతం. అయితే ప్రతి వృత్తికి దాని సొంత లాభనష్టాలు ఉంటాయి. కేవలం అంకెలను చూసి ఆకర్షితులు కాకుండా, అందులో ఉన్న శారీరక శ్రమను కూడా గుర్తించాలి. ఒకరికి ఆఫీస్ ఏసీలో కూర్చుని పని చేయడం నచ్చవచ్చు, మరొకరికి రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ సంపాదించడం ఇష్టం ఉండవచ్చు. చివరికి ఏ వృత్తిలో ఉన్నా సంతృప్తికరమైన ఆదాయం ఉండటమే ముఖ్యం.
