జగన్ ప్రభుత్వంలోనే నకిలీ మద్యం దందా మొదలు? వెలుగులోకి కీలక విషయాలు
తొలుత హైదరాబాద్, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలోని తన సొంత బారులోనే నకిలీ మద్యం తయారు చేయించిన జనార్దనరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ములకలచెరువుకు మద్యం డెన్ మార్చినట్లు చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 12 Oct 2025 11:26 AM ISTములకలచెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు అధికారులు కీలక సమాచారం సేకరించారు. ములకలచెరువు, ఇబ్రహీపట్నం కేంద్రంగా సాగిన ఈ దందా 2022లోనే మొదలైనట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో తేలిందని చెబుతున్నారు. 2021లో ఈ అక్రమ వ్యాపరంలోకి అడుగుపెట్టిన ఏ1 అద్దేపల్లి జనార్దనరావు నెమ్మదిగా తన నకిలీ వ్యాపారాన్ని విస్తరించినట్లు చెబుతున్నారు. తొలుత హైదరాబాద్, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలోని తన సొంత బారులోనే నకిలీ మద్యం తయారు చేయించిన జనార్దనరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ములకలచెరువుకు మద్యం డెన్ మార్చినట్లు చెబుతున్నారు.
మద్యం రాకెట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 జనార్దనరావును గన్నవరం ఎయిర్పోర్టులో శుక్రవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం విజయవాడలోని ఆరో అదనపు జిల్లా కోర్టులో జనార్దనరావును హాజరుపరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక నేరాంగీకర పత్రంలో నిందితులు పలు విషయాలను తెలియజేసినట్లు ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా వాకాడులో ఇంజనీరింగ్ చదువుకున్న జనార్దనరావు తొలుత కిరాణా వ్యాపారం చేసి, 2012లో మద్యం వ్యాపారానికి మారినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్నాఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసిన జనార్దనరావు భారీ లాభాలను ఆర్జించాడు. అయితే జాతీయ రహదారుల పక్కన మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేవాలతో ఆయన తన బార్ ను మరో చోటకు మార్చుకోవాల్సివచ్చింది.
దీంతో వ్యాపారంలో నష్టాలు రావడంతో నకిలీ మద్యం తయారీపై ఆయన ద్రుష్టిపెట్టినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. తొలుత హైదరాబాదులోని నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని సమీపంలో ఉన్న మద్యం దుకాణం నుంచి హెచ్.డీ. విస్కీ కొనుగోలు చేసేవాడని, ఆ మద్యాన్ని పెద్ద కేన్సులో నింపి ఫినాయిల్ పేరుతో విజయవాడకు రవాణా చేసి ఇక్కడ తన బార్ లో విక్రయించేవాడని చెబుతున్నారు. ఆర్టీసీ కొరియర్ ద్వారా వచ్చే ఈ మద్యాన్ని బార్ లో పనిచేసే హజీ అనే వ్యక్తి విక్రయించేవాడు. 2022లో తన వ్యాపారం భాగస్వాములుగా తుంగల సుధాకర్, చింతమనేని క్రిష్ణమోహన్, మహంకాళి పూర్ణచంద్రరావు, బొర్రా కిరణ్, జనార్దన్ రావు సోదరి సుబా భారతి, షరీఫ్ ను చేర్చుకున్నారు. వీరంతా కలిసి హైదరాబాదులో ఈ7 బార్ ను ప్రారంభించారు. అక్కడి నుంచి 35 లీటర్ల క్యానులో చీప్ లిక్కర్ సరఫరా చేసి విక్రయించేవారు.
ఈ క్రమంలోనే 2023లో గోవా వెళ్లిన నిందితుడు జనార్దనరావు అక్కడ బాలాజీ అనే వ్యక్తిని కలిసి నకిలీ మద్యం వ్యాపారంపై చర్చించినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరూ కలిసి నకిలీ ఫార్ములాను సిద్ధం చేసి లిక్కర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారని, స్పిరిట్, చక్కెర, ఇతర ముడిపదార్థాలతో 2023 ఏప్రిల్ లో ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బారులో నకిలీ మద్యం తయారు చేసినట్లు గుర్తించారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి స్పిరిట్ ఇతర ముడిపదార్థాలను బాలాజీ పంపించగా, ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు సోదరుడు జగన్మోహనరావు, మరికొందరు ఉద్యోగులు నకిలీ మద్యం తయారు చేసి సీసాల్లో నింపేవారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
స్పిరిట్ సరఫరా కోసం బాలాజీకి రూ.20 లక్షలు జనార్దనరావు చెల్లించాడు. అదేవిధంగా లీటర్ బాటిల్ మద్యానికి రూ.350 నుంచి రూ.450 బాలాజీ వసూలు చేసేవాడు. లీటర్ బాటిళ్లలో మద్యాన్ని 180 ఎంఎల్ సీసాల్లోకి మార్చి ఒక్కోదానిపై రూ.30 నుంచి 40 లాభాన్ని జనార్దనరావు ఆర్జించినట్లు గుర్తించారు. 2024 ఎన్నికల్లో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్ పంపడం నిలిపివేశాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ మారడంతో కొన్నాళ్లు వీరికి పనిలేకుండా పోయిందని చెబుతున్నారు. అయితే నూతన మద్యం పాలసీలో తంబళ్లపల్లికి చెందిన టీడీపీ మాజీ నేత జయచంద్రారెడ్డి అనుచరులు సురేంద్రనాయుడు, పీఏ రాజేశ్ మద్యం షాపులను దక్కించుకున్నారు. వీరికి వ్యాపారంలో అనుభవం లేకపోవడంతో తొలుత నష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో వీరు జనార్దనరావును సంప్రదించగా, అతడు గత అనుభవంతో మళ్లీ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించడం ప్రారంభించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే బెల్టుషాపుల్లో నకిలీ బ్రాండ్లను ఎక్సైజ్ అధికారులు గుర్తించడంతో ఈ లిక్కర్ మాఫియా బయటపడిందని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు.
