చావు కోసం చెక్-ఇన్.. ఈ హోటల్‌లో రూమ్ దొరికితే... బయటకు చెక్‌అవుట్ కాదు, నేరుగా మోక్షమే!
అయితే ఇక్కడ కూడా ఒక చిన్న "రూల్ బుక్" ఉంది. గరిష్ఠంగా 14 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి. ఈ గడువులో మరణం సంభవిస్తే కుటుంబ సభ్యులు అక్కడే అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకుంటారు.
By: A.N.Kumar | 7 Aug 2026 6:39 PM ISTసాధారణంగా హోటల్ అంటే ఏముంటుంది? రూమ్ బుక్ చేసుకోవాలి.. సెల్ఫీలు దిగాలి.. ఫుడ్ ఆర్డర్ చేయాలి.. చివరికి చెక్‌అవుట్ చేసి ఇంటికి వెళ్లాలి. కానీ ఓ హోటల్ మాత్రం ఈ రూల్స్ అన్నింటినీ తలకిందులు చేస్తోంది. ఇక్కడికి వచ్చే వారు టూర్ కోసం కాదు... జీవితానికి చివరి అధ్యాయం ప్రశాంతంగా ముగించుకోవడానికి వస్తారు. మరీ విచిత్రంగా చెప్పాలంటే... ఇక్కడ చెక్‌ఇన్ చేసిన తర్వాత "చెక్‌అవుట్ ఎప్పుడు?" అని ఎవరూ అడగరు.
ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర నగరం వారణాసిలో ఉన్న 'ముక్తి భవన్' ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. పేరు భవన్ అయినా చాలామంది దీన్ని "మరణానికి చివరి అడ్రెస్"గా అభివర్ణిస్తుంటారు. కాశీలో చివరి శ్వాస విడిస్తే మోక్షం లభిస్తుందని హిందూ విశ్వాసం. అదే నమ్మకంతో దేశం నలుమూలల నుంచి వృద్ధులు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుంటారు.
అయితే ఇక్కడ కూడా ఒక చిన్న "రూల్ బుక్" ఉంది. గరిష్ఠంగా 14 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి. ఈ గడువులో మరణం సంభవిస్తే కుటుంబ సభ్యులు అక్కడే అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ 14 రోజులు పూర్తయ్యాక కూడా ఆరోగ్యం నిలకడగా ఉంటే? క్షమించాలి... రూమ్ ఖాళీ చేయాల్సిందే. ఎందుకంటే మరో కుటుంబం కూడా అదే ఆశతో క్యూలో ఉంటుంది. పరిస్థితిని బట్టి నిర్వాహకులు కొద్ది రోజుల పొడిగింపు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయని చెబుతారు.
ముక్తి భవన్‌లో భజనలు, వేదమంత్రాల పఠనం, పూజలు నిరంతరం జరుగుతుంటాయి. జీవితాంతం పరుగులు తీసిన మనిషికి చివరి రోజుల్లో ఒక ఆధ్యాత్మిక ప్రశాంతత కల్పించడమే దీని లక్ష్యం. ఇక్కడికి వచ్చినవారు తమ కుటుంబ సభ్యులతో కలిసి చివరి క్షణాలను గడుపుతారు.
ఈ సేవలో దాదాపు 40 ఏళ్లుగా ఉన్న నిర్వాహకుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు 12 వేల మందికిపైగా చివరి శ్వాస విడిచిన సందర్భాలను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే... చివరి క్షణాల్లో చాలా మంది ఒకే మాట అంటారట. "అంత కోపం ఎందుకు చేశాం? చిన్న చిన్న విషయాలకు ఎందుకు మనుషులను దూరం చేసుకున్నాం?" అని పశ్చాత్తాపపడతారట. బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు, హోదాలు కాదు... బంధాలు, ప్రేమ, క్షమించే మనసే చివరికి గుర్తుకొస్తాయని ఆయన చెబుతున్నారు.
మరి ముక్తి భవన్ చెప్పే అసలు సందేశం ఏంటంటే... కోపాన్ని ఈఎంఐల్లో దాచుకోకండి.. అదే రోజున క్లోజ్ చేయండి. మనసులో ద్వేషం, పగ, అహంకారం స్టాక్ పెట్టుకుంటే చివరికి అవే భారమవుతాయి. జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రేమగా మాట్లాడటం, క్షమించడం, బంధాలను కాపాడుకోవడమే నిజమైన "లైఫ్ లగ్జరీ" అని ఈ భవన్ నిశ్శబ్దంగా గుర్తు చేస్తోంది.
