అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!
ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా విశాఖ ఉంది. మొత్తం 120 వార్డులతో జీవీఎంసీ ఉంది. దేశంలో టాప్ టెన్ కార్పొరేషన్లలో ఓటి విశాఖ.
By: Satya P | 3 Nov 2026 11:54 PM ISTఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా విశాఖ ఉంది. మొత్తం 120 వార్డులతో జీవీఎంసీ ఉంది. దేశంలో టాప్ టెన్ కార్పొరేషన్లలో ఓటి విశాఖ. దాదాపుగా అయిదు వేల కోట్ల వార్షిక బడ్జెట్ తో బృహత్ కార్పొరేషన్ గా ఉంది. సిటీ ఆఫ్ డెస్టినీ, ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు ప్రధమ పౌరురాలిగా మేయర్ గా నిలిచి గెలిచిన ఘనత టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి దక్కించుకున్నారు. ఎందరో సీనియర్లు ఉద్ధండుల వారసులు విశాఖ మేయర్ రేసులోకి వచ్చినా జనరల్ సీటులో బీసీ మహిళను ఎంచి మరీ టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. దానికి కారణం శ్రావణి రాజకీయ కుటుంబ నేపధ్యంతో పాటు ఆమె 2021లో గెలిచి టీడీపీ తరఫున ప్రతిపక్ష పాత్ర పోషించిన తీరు. ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని నిధుల విషయంలో నిలదీసిన విధానం. ఆమె పోరాడే తత్వం. ప్రజలతో కలసి మమేకం అయిన పద్ధతికి ఈ ఉన్నత స్థానం దక్కింది.
భారీ ఆధిక్యతతో :
విశాఖ మేయర్ గా ముక్కా శ్రావణి రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆమెతో పాటు 98 దాకా కూటమి నుంచి కార్పోరేటర్లు నెగ్గారు. దాంతో జీవీఎంసీ మొత్తం కూటమి మయం గా మారింది. ఇక శ్రావణి ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆమె విద్యాధికురాలిగా ఉన్నారు. దాంతో ఆమె యువ నాయకురాలిగా జీవీఎంసీని ఎలా తీర్చిదిద్దుతారో అన్నది అంతా ఆసక్తిగా ఇపుడు చర్చించుకుంటున్నారు.
రెండోసారి టీడీపీ :
ఇక తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పదవిని అందుకోవడం ఇది రెండవ సారి. సరిగ్గా ఇప్పటికి 40 ఏళ్ళ క్రితం 1987లో ప్రత్యక్ష ఎన్నికల్లో నాడు ప్రముఖ న్యాయవాదిగా ఉన్న డీవీ సుబ్బారావుని అప్పటి సీఎం ఎన్టీఆర్ కోరి మరీ ఎంపిక చేశారు. అలా ఆయన విశాఖ ప్రజల మద్దతుతో మేయర్ అయ్యారు. తిరిగి ఇన్నాళ్ళకు ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ గా ముక్కా శ్రావణి ఆ చాన్స్ దక్కించుకుంది. అలా టీడీపీకి ఇన్నేళ్ళ తరువాత ఈ అత్యున్నత పీఠం దక్కింది అని అంటున్నారు.
కీలక బాధ్యతలు :
ఇక ముక్కా శ్రావణికి చిన్న వయసులోనే ఈ కీలకమైన పదవి లభించింది. రాష్ట్రంలో నెగ్గిన ఇతర మేయర్ల కంటే ఆమె యంగెస్ట్ అని కూడా అంటున్నారు. ఇంకా అవివాహితగా ఉన్న శ్రావణి ఎన్నికల వేళ ప్రచారంలో తనకు పుట్టిల్లూ మెట్టిల్లూ అన్నీ విశాఖే అని శ్రావణి చెప్పారు. అందువల్ల తాను ప్రజలకు బాధ్యతగా ఉంటాను అని చెప్పారు. ఇక విశాఖ జిల్లా ప్లస్ అనకాపల్లి జిల్లా కలిపితే జీవీఎంసీ. ఎంతో మంది సీనియర్ నేత, మాజీ మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. అందరితో కలసి ఆమె పనిచేయాల్సి ఉంది. అలాగే యువ నాయకత్వాన్ని టీడీపీ ఇటీవల కాలంలో ప్రోత్సహిస్తోంది. దాంతోనే ఆమెకు ఈ చాన్స్ దక్కింది అని అంటున్నారు. విశాఖ మీద ఏపీలో కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన నేపధ్యంలో మొత్తానికి మొత్తం సీట్లు కట్టబెడుతూ విశాఖ వాసులు అతి పెద్ద బాధ్యతను అందించారు. దాంతో రానున్న కాలంలో విశాఖ అభివృద్ధికి మేయర్ పాత్ర ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
