Begin typing your search above and press return to search.

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

స్టార్‌లింక్‌కు పోటీగా ముఖేష్ అంబానీకి చెందిన జియో 2035 నాటికి 1,600 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కథనం. 2027 సెప్టెంబర్‌లో టెస్ట్ మిషన్ చేపట్టాలని ప్రణాళిక. ఈ పోటీతో శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు తగ్గి, మారుమూల ప్రాంతాలకూ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది.

By:  A.N.Kumar   |   19 Nov 2026 11:30 AM IST
ఆకాశంలో అంబానీ సిగ్నల్.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర
X

భూమి మీద ఖాళీ స్థలం దొరకడం కష్టమైందో ఏమో కానీ.. మన కుబేరుల కన్ను ఇప్పుడు ఏకంగా ఆకాశం మీద పడింది.. ఇప్పటివరకు వీధివీధినా సెల్ టవర్లు పెట్టి అన్ లిమిటెడ్ డేటా అంటూ మన జేబులకు చిల్లులు పెట్టిన టెలికాం దిగ్గజాలు.. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనే పాగా వేయడానికి రెడీ అయిపోతున్నాయి. నేను ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నా అని ఎలన్ మస్క్ తన స్టార్‌లింక్ శాటిలైట్లతో కాలర్ ఎగరేస్తుంటే.. తగ్గేదే లే అంటూ మన ముఖేష్ అంబానీ 1,600 శాటిలైట్ల భారీ స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్నారు.

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇప్పటివరకు అంతరిక్ష ఇంటర్నెట్ రంగంలో నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వేలాది శాటిలైట్లను ఆకాశంలో వదిలి.. ప్రపంచానికి సిగ్నల్ ఇస్తున్న మస్క్‌కు.. అసలైన భారతీయ వ్యాపార వ్యూహం అంటే ఏంటో జియో రుచి చూపించబోతోంది. 2016లో జియో వచ్చినప్పుడు మిగతా టెలికాం కంపెనీలు ఎలా అయితే అయ్యో దేవుడా అంటూ తలలు పట్టుకున్నాయో.. ఇప్పుడు అంతరిక్షంలో మస్క్ పరిస్థితి కూడా అలాగే మారేలా ఉంది. 2027 సెప్టెంబర్‌లో టెస్ట్ మిషన్.. 2035 నాటికి 1,600 శాటిలైట్లతో పూర్తిస్థాయి సామ్రాజ్యం.. వినడానికే గూస్‌బంప్స్ వస్తున్నాయి కదూ.. అమెరికా నుంచి 400 శాటిలైట్లు కొంటూ.. మిగతావి దేశీయంగా తయారు చేయించుకుంటూ అంబానీ వేస్తున్న ప్లాన్ చూస్తుంటే.. రాత్రిపూట ఆకాశంలో చుక్కల కంటే జియో శాటిలైట్లే ఎక్కువగా మెరుస్తాయేమో అనిపిస్తోంది.

కాకపోతే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. భూమి మీద గుంతలు తవ్వి టవర్లు పాతినంత ఈజీ కాదు ఆకాశంలో శాటిలైట్లు పెట్టడం.. మన దేశంలో ఏడాదికి తయారయ్యే శాటిలైట్ల సంఖ్య కంటే జియో వేసుకున్న టార్గెట్ ఆకాశాన్ని తాకేలా ఉంది. 2035 వరకు ఈ 1,600 శాటిలైట్లను తయారు చేసి రాకెట్లలో ఎక్కించి కక్ష్యలో కూర్చోబెట్టేలోపు మన తలల మీద జుట్టు తెల్లబడటం ఖాయం. ఒకవేళ ఆకాశంలో మస్క్ శాటిలైట్లకు.. అంబానీ శాటిలైట్లకు మధ్య ట్రాఫిక్ జామ్ అయితే ఎవరు క్లియర్ చేస్తారో మరి..

ఇంతకీ ఈ కుబేరుల స్పేస్ వార్ వల్ల సామాన్యుడికి ఒరిగేదేంటి? అంబానీ వస్తున్నాడు కదా మళ్లీ 3 నెలలు ఫ్రీ స్పేస్ ఇంటర్నెట్ ఇస్తాడేమో అని ఆశపడుతున్నారా? ఆశకు హద్దుండాలి బాస్.. శాటిలైట్ ఇంటర్నెట్ అంటే మన వీధి చివర దొరికే రూ.299 రీఛార్జ్ ప్లాన్ లాంటిది కాదు. దాని పరికరాలు.. టెక్నాలజీ ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. కాకపోతే మస్క్‌కు పోటీగా జియో దిగుతోంది కాబట్టి.. కాస్త రేట్లు తగ్గే అవకాశం లేకపోలేదు. అప్పుడు మనం అడవుల్లో ఉన్నా.. కొండల మీద ఉన్నా.. సముద్రం మధ్యలో పడవలో వెళ్తున్నా.. రీల్స్ చేసుకోవడానికి మాత్రం సిగ్నల్ ఢోకా ఉండదు..

భూమి మీద మొదలైన డేటా వార్.. ఇప్పుడు అంతరిక్షానికి చేరింది. ఈ 'స్టార్ వార్స్'లో మస్క్ గెలుస్తాడా? లేక అంబానీ తన మార్క్ చూపిస్తాడా అనేది తెలియాలంటే 2035 వరకు ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఉండాల్సిందే..