Begin typing your search above and press return to search.

అధ్యక్ష పీఠం వైపు మహమ్మద్ యూనస్.. షాబుద్దీన్ రాజీనామా ఖాయమేనా?

బంగ్లాదేశ్‌లో ఎన్నికల హడావుడి ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ మరో సంచలన వార్త బయటకు వచ్చింది.

By:  Madhu Reddy   |   19 Feb 2026 10:09 AM IST
అధ్యక్ష పీఠం వైపు మహమ్మద్ యూనస్.. షాబుద్దీన్ రాజీనామా ఖాయమేనా?
X

బంగ్లాదేశ్‌లో ఎన్నికల హడావుడి ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వానికి సారథ్యం వహించిన నోబెల్ విజేత మహమ్మద్ యూనస్, ఇప్పుడు ఆ దేశ తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారబోతోంది. వివరాల్లోకి వెళితే..

అధ్యక్ష పీఠం వైపు మహమ్మద్ యూనస్?:

ఇక బంగ్లాదేశ్‌లో తారిఖ్ రెహమాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టడంతో, గత కొన్ని నెలలుగా దేశాన్ని నడిపించిన మహమ్మద్ యూనస్ భవితవ్యంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2028 వరకు ఉన్నప్పటికీ, కొత్త ప్రభుత్వంతో వచ్చిన కొన్ని విభేదాల వల్ల ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఖాళీ అయ్యే స్థానంలో యూనస్‌ను కూర్చోబెట్టడం ద్వారా దేశంలో రాజకీయ స్థిరత్వం వస్తుందని బీఎన్‌పీ (BNP) ప్రభుత్వం భావిస్తోంది.

యూనస్ ఎంపిక ఎందుకు?:

గతంలో పలుమార్లు మహమ్మద్ షాబుద్దీన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, అందుకే ఎన్నికల తర్వాత తప్పుకుంటానని ఆయన ముందే హింట్ ఇచ్చారు. ఇక మహమ్మద్ యూనస్ విషయానికొస్తే, ఆయనకు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు దేశానికి ప్లస్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధ్యక్షుడిగా ఆయన ఉంటే విదేశీ పెట్టుబడులు, దౌత్య సంబంధాలు మెరుగుపడతాయని కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ నమ్మకం. అందుకే యూనస్‌ను ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంచడం ద్వారా అటు ప్రజల్లోనూ, ఇటు అంతర్జాతీయ సమాజంలోనూ మంచి పేరు వస్తుందని భవిస్తున్నారు.

బంగ్లా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం:

ఇక ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ, బంగ్లాదేశ్ మీడియాలో మాత్రం యూనస్ పేరు మారుమోగిపోతోంది. త్వరలోనే అధికారికంగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే, ఒక ఆర్థికవేత్త, నోబెల్ విజేత దేశ అత్యున్నత పదవిలో ఉండటం బంగ్లాదేశ్‌కు కొత్త శక్తిని ఇస్తుంది. అయితే, పూర్తి స్థాయిలో అధికారం ఉన్న ప్రధాని పదవి నుంచి కేవలం నామమాత్రపు అధికారం ఉండే అధ్యక్ష పదవికి యూనస్ మారడం ఆయనకు ఎలా అనిపిస్తుందో చూడాలి. ఏది ఏమైనా, బంగ్లాదేశ్ భవిష్యత్తు ఇప్పుడు ఈ ఇద్దరు నేతల చేతుల్లోనే ఉంది.