Begin typing your search above and press return to search.

మళ్లీ రెచ్చిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్ కు లాగానే ఇచ్చిపడేయాల్సిందే

యూనస్‌ చర్యలను అంతర్జాతీయ విశ్లేషకులు ఒక వ్యూహం కింద భాగంగా చూస్తున్నారు. యూనస్‌ పాకిస్థాన్‌తో స్నేహపూర్వకంగా ప్రవర్తించడం... ఇండియాకు వ్యతిరేకంగా మాటలు చెప్పడం...

By:  A.N.Kumar   |   27 Oct 2025 8:14 PM IST
మళ్లీ రెచ్చిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్ కు లాగానే ఇచ్చిపడేయాల్సిందే
X

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా నోబెల్‌ విజేత మహమ్మద్ యూనస్‌ అధికారం చేపట్టిన దగ్గరి నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలు మరింతగా ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఆయన చేస్తున్న తాజా చర్యలు రెండు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై మరింత నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.

* వివాదాస్పద మ్యాప్: భారత్‌పై యూనస్ దాడి!

ఇటీవల యూనస్‌ పాకిస్థాన్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ జనరల్‌ షంషాద్‌ మీర్జాకు బహుమతిగా ఒక పుస్తకం అందజేశారు. ఆ పుస్తకం “Art of Triumph” కవర్‌పై బంగ్లాదేశ్‌ భూభాగం మ్యాప్‌ను ముద్రించారు. కానీ, ఈ మ్యాప్‌లో భారత్‌కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌ లు బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వివాదాస్పద చర్య భారత్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. భారత భూభాగ సార్వభౌమత్వంపై స్పష్టమైన దాడిగా నెటిజన్లు, విశ్లేషకులు మండిపడుతున్నారు.

ఇది తొలిసారి కాదు: అహంకారపూరిత వ్యాఖ్యలు

యూనస్‌ నుండి వచ్చిన వివాదం ఇదే మొదటిది కాదు. గతంలో ఆయన చైనాలో పర్యటించినప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేపాయి. భారత ఈశాన్య రాష్ట్రాలు సముద్రానికి చేరుకునే మార్గం లేకుండా బంగ్లాదేశ్‌తో చుట్టుముట్టబడ్డాయి కాబట్టి "మేమే ఆ ప్రాంతానికి ద్వారం, రక్షకులం" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పుడే యూనస్‌ అహంకారాన్ని, భారత్‌ పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేశాయి. ఇప్పుడు ఈ మ్యాప్‌ వివాదం ఆయన దూకుడు రాజకీయాలను మరింతగా బహిర్గతం చేసింది.

చైనా-పాక్ అక్షం వైపు మొగ్గు?

యూనస్‌ చర్యలను అంతర్జాతీయ విశ్లేషకులు ఒక వ్యూహం కింద భాగంగా చూస్తున్నారు. యూనస్‌ పాకిస్థాన్‌తో స్నేహపూర్వకంగా ప్రవర్తించడం... ఇండియాకు వ్యతిరేకంగా మాటలు చెప్పడం... చైనా పెట్టుబడులను ఆహ్వానించడం... ఈ అంశాలన్నీ బంగ్లాదేశ్‌ చైనా, పాకిస్థాన్‌ల వైపు మరింతగా మొగ్గు చూపుతోందనే అనుమానాన్ని బలపరుస్తున్నాయి. భారత్‌తో దౌత్య సంబంధాలను సవాలు చేస్తూ, ఈ మూడు దేశాల అక్షాన్ని ఆశ్రయించడానికి యూనస్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

భారత్ ఘాటు కౌంటర్: విదేశాంగ మంత్రి స్పందన

ఈ వివాదంపై భారత విదేశాంగ వర్గాలు ఇప్పటికే ఘాటుగా స్పందించాయి. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్వయంగా బంగ్లాదేశ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. “భారతదేశానికి 6,500 కి.మీ. పొడవైన తీరరేఖ ఉంది. మా ఈశాన్య ప్రాంతం BIMSTEC కనెక్టివిటీ హబ్‌గా ఎదుగుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్‌లు ఇవన్నీ పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతున్నాయి. భారత భౌగోళిక ప్రాధాన్యతను ఎవరూ తక్కువ చేయలేరు.” అంటూ కౌంటర్ ఇచ్చారు. భారత శక్తి సామర్థ్యాలను, అంతర్జాతీయంగా దాని పెరుగుతున్న అనుసంధానతను విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యల ద్వారా బంగ్లాదేశ్‌కు గట్టిగా గుర్తు చేశారు.

*గుణపాఠం తప్పదా?

యూనస్‌ నాయకత్వంలో బంగ్లాదేశ్‌ తీసుకుంటున్న ఈ రాజకీయ దూకుడు భారత సార్వభౌమత్వాన్ని తాకే ప్రయత్నమే. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయి. సోషల్ మీడియాలో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “బంగ్లాదేశ్ బుద్ధి మారలేదు, పాక్‌కు చేసినట్టే గుణపాఠం చెప్పాల్సిందే” అంటూ మండిపడుతున్నారు.

భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలను కాదని, యూనస్ ఇలా వివాదాలు సృష్టిస్తే, పాక్‌కు గతంలో ఇచ్చినట్టుగా బంగ్లాదేశ్‌కు కూడా ఒకసారి గట్టి సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చినట్టుంది. అంతిమంగా, దౌత్య మార్గంలో ఈ దూకుడు చర్యలకు తగిన విధంగా బదులివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.