పొలిటికల్ పద్మనాభం: మనసు పరిగెడుతోంది.. పార్టీ వెనక్కి నెడుతోంది..!
ఆయన మనసు పరిగెడుతోంది. కానీ, వయసు చూస్తే.. నెమ్మదిస్తోంది. ఈ ప్రభావంతో పార్టీ కూడా ఆయన ను పక్కన పెడుతోంది.
By: Garuda Media | 22 March 2026 7:00 AM ISTఆయన మనసు పరిగెడుతోంది. కానీ, వయసు చూస్తే.. నెమ్మదిస్తోంది. ఈ ప్రభావంతో పార్టీ కూడా ఆయన ను పక్కన పెడుతోంది. ఇదీ.. ఇతమిత్థంగా మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పాలిటి క్స్!. దీనిలో ఆశ్చర్యం ఏమీలేదు. ఆయన ఉరుకులు పెట్టాలని ప్రయత్నిస్తున్నమాట వాస్తవం. అందుకే.. పార్టీపరంగా ఆయనకు ఇచ్చిన పదవిని `చిన్నది`గా చూస్తున్నారు. తనకు జిల్లాల బాధ్యత అప్పగించాల ని కోరుతున్నారు. పార్టీని పరుగులు పెట్టిస్తానని అంటున్నారు.
కానీ.. 80 + వయసు కావడంతోపాటు తరచుగా ఆయన అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఆయనకు బలమైన బాధ్యతలు అప్పగించేందుకు వెనుకాడుతోంది. అంతేకాదు.. ముద్రగడ వైఖరికి.. పార్టీలో ఉన్న నాయకులకు మధ్య పొసగడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పార్టీ ఆయన సలహా మండలికి (పీఏసీ-పార్టీ అడ్వైజరీ కమిటీ) పరిమితం చేసింది. కానీ, తాను సలహాలు ఇస్తు న్నా.. ఎవరూ వినిపించుకోవడం లేదన్నది ముద్రగడ మాట.
ఇక, ప్రస్తుతం పీఏసీలో చాలా మంది నాయకులు ఉన్నారు. నిజానికి వారికి ఎలాంటి బాధ్యతలులేవు. అలానే.. పార్టీపరంగా కూడా ఎలాంటి అధికారాలు కూడా లేవు. ఇదే ఇప్పుడు కొంత మంది నాయకులకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల ముద్రగడ పార్టీకి లేఖ రాశారు. తనకు జిల్లాను అప్పగించాలని.. ఏ జిల్లా అయినా ఫర్వాలేదని కూడా ఆయన పార్టీకి విన్నవించారు. జిల్లాలో ఉంటే.. పార్టీ పరంగా నాయకులను ముందుకు నడిపిస్తానని కూడా చెబుతున్నారు.
ఏంటి సమస్య..?
ముద్రగడ రాజకీయాలను గమనిస్తే.. ఆయన నేటి తరం పాలిటిక్స్‌కు పెద్దగా సూటవరన్న ఆలోచన ఉంది. ప్రస్తుతం ఫైర్ బ్రాండ్లకే ప్రాధాన్యం ఉంది. విమర్శలు-ప్రతి విమర్శలు.. దూకుడు తత్వం వంటివాటికి పార్టీలు.. ప్రజలు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ముద్రగడ రాజకీయాలు సోసోగానే ఉంటు న్నాయి. పైగా కాపు సామాజిక వర్గంలోనూ ఆయనపై గతంలో ఉన్నంత హవా ఇప్పుడు కనిపించడం లేదు. ఈ పరిణామాలను అంచనా వేసుకునే.. ముద్రగడను పార్టీ పీఏసీకి పరిమితం చేసింది. కానీ, ఆయన మాత్రం జిల్లా బాధ్యతల కోసం తపిస్తున్నారు.
