నివాళి: కొత్త తరానికి 'పాత నేస్తం'.. ముద్రగడ
గౌరవం, మర్యాదల విషయంలో ఎక్కడా ఎవరూ తగ్గించుకోలేదు. ఈ విషయంలో ముద్రగడ ముందున్నారు. ఆయన గెలిచినప్పుడు.
By: Garuda Media | 14 July 2026 10:05 PM ISTరాజకీయాల్లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు..? ఎలా వ్యవహరించాలి? ఎలా వ్యవహరించరాదు..? అనే విషయాలకు ముద్రగడ పద్మనాభం దిక్సూచి అనడంలో సందేహం లేదు. సిద్ధాంతాలు, భావాలు, ఎంచుకున్న లక్ష్యాలు వేరు కావొచ్చు. కొందరికి ముద్రగడ అంటే పడకపోనూ వచ్చు. మరికొందరికి ఆయన దేవుడు కూడా కావొచ్చు. కానీ, ఆయనలో ఉన్న కొన్ని విషయాలు మాత్రం ఆయనకే ప్రత్యేకమని చెప్పాలి. అవి నాటి తరం రాజకీయాలకు వన్నె తెస్తే.. నేటి తరం రాజకీయాలకు నేస్తంగా మారుతాయి. నేటి నేతలు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు.
గెలిచినా ఓడినా..
ప్రస్తుత రాజకీయాల్లో గెలిచిన వారే నాయకులు.. ఓడిన వారు జీరోలు అనే మాట తరచుగా వినిపిస్తోంది. అయితే.. ముద్రగడ తరంలో ఓడినా.. గెలిచినా.. నాయకులు తమ విలువలను తగ్గించుకోలేదు. గౌరవం, మర్యాదల విషయంలో ఎక్కడా ఎవరూ తగ్గించుకోలేదు. ఈ విషయంలో ముద్రగడ ముందున్నారు. ఆయన గెలిచినప్పుడు.. తన ప్రత్యర్థిని సైతం.. తన వాహనంలో ఎక్కించుకుని ప్రమాణ స్వీకార ఘట్టానికి తీసుకువచ్చి ఆదర్శరాజకీయాలకు తెరదీశారు. పరుష పదజాలంతో ఎప్పుడూ మాట్లాడకపోవడం.. మరో గొప్పవిషయం.
నాయకుల హోదా, వయసుతో సంబంధం లేకుండా.. నేడు రాజకీయాలు 'నువ్వు' 'వాడు' 'వీడు' అనే సంస్కృతి ప్రబలి పోయింది. కానీ, ముద్రగడ అప్పటి నుంచి ఇప్పటి వరకు 'మీరు' అనే సంబోధననే కొనసాగించారు. ఆయనను ఎంతగా విమర్శించినా.. ఆ గౌరవ మర్యాదల నుంచి బయటకు రాకుండా..తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నారు. ఇది నేటి తరం యువ నేతలకు ఆదర్శమనే చెప్పాలి. ఇక, కాపుల రిజర్వేషన్, రాజ్యాధికారం కోసం పట్టుబట్టి ఉద్యమించినప్పుడు కూడా ఆయన ఎక్కడా పరుషంగా ప్రవర్తించలేదు. ప్రత్యేక భాషను కూడా వాడలేదు.
మాటకు కట్టుబడి..!
మాటకు కట్టుబడే నాయకులు ప్రస్తుత తరంలో చాలా వరకు తక్కువగాఉన్నారు. కానీ.. ముద్రగడ ఈ విషయంలో రాజకీయా లకు అతీతంగా అందరూ అభిమానించే నాయకుడు అనడంలో సందేహం లేదు. తన ఇంటికి ఎవరు వచ్చినా షడ్రసోపేతమైన భోజనం, కానుకలు కామన్. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆయనది. తండ్రి వీరరాఘవరావు ను ఆదర్శంగా తీసుకుని.. ఆయన పేరు కోసమే తాను రాజకీయాల్లో కి వచ్చానని చెప్పిన ముద్రగడ.. కుటుంబంలో రాజకీయాలు జోక్యం చేసుకున్నప్పు డు కూడా చాలా గౌరవంగా వ్యవహరించారు. ఇది కొందరికి నచ్చొచ్చు..నచ్చక పోవచ్చు.కానీ, మంచి ఎప్పుడూ మంచే కదా!. ఏదేమైనా నేటి తరం నేర్చుకోదగ్గ అనేక విషయాలు ముద్రగడ రాజకీయ జీవితంలో ఉన్నాయి.
