ముద్రగడ సంతాప సభ...ఆ పార్టీల పైనే ఫోకస్ !
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత నెల 14న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
By: Satya P | 8 Aug 2026 9:20 AM ISTకాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత నెల 14న కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన సంస్మరణ సభలను రాష్ట్రంలో పలు కీలక ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇవి కాపు నాడు పేరు మీదనే జరుగుతున్నాయి. ఒక రాజకీయ పార్టీ నిర్వహిస్తే మరో పార్టీ నేతలు రావడం కష్టం కాబట్టి కాపునాడు వేదికగానే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కిర్లంపూడి వంటి చోట్ల ముద్రగడ సంస్మరణ సభలు జరిగాయి. ఇక గుంటూరులో జరిగిన సభకు వెళ్ళి వచ్చిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమ అక్కడ చేసిన వ్యాఖ్యలు ఆ మీదట రాజకీయ రచ్చగా మారిన వైనం అందరికీ తెలిసిందే. దీంతో కిర్లంపూడి సభకు ఎక్కువగా వైసీపీ కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన నాయకులే హాజరయ్యారు.
జాతీయ స్థాయి నేతలు :
ఇక విశాఖలో ఈ నెల 9వ తేదీ ఆదివారం నిర్వహించే ముద్రగడ సంస్మరణ సభకు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు హాజరవుతారని కాపు నాడు నేతలు చెబుతున్నారు. అంతె కాదు అనేక పార్టీల నుంచి కాపు నేతలు రాజకీయ ప్రతినిధులు హాజరవుతున్నారని కూడా వెల్లడించారు. పార్టీలకు అతీతతంగా అందరికీ ఆహ్వానాలు పంపాలని కాపు జాతికి ఎంతో సేవ చేసిన ముద్రగడ కోసం అందరూ రావాలని కోరుతున్నారు.
బలమైన రీజియన్ గా :
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా కాపులకు బలమైన రీజియన్ గా ఉంది. ఓసీ కాపులు బీసీ కాపులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో తూర్పు కాపులు బీసీలుగా చలామణి అవుతున్నారు. విశాఖ జిల్లాలో ఓసీ కాపులు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవరాలలో సగానికి పైగా సీట్లను ప్రభావితం చేయగల సామర్థ్యం ఈ జనాభాకు ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఇక పదవుల విషయంలో రాజకీయాలలో కీలక పాత్ర పోషించే విషయంలో కూడా ఈ మూడు జిల్లాలలో కాపులు గణనీయమైన పాత్రను పోషిస్తూ వస్తున్నారు. దీంతో విశాఖలో ముద్రగడ సంస్మరణ సభకు ఇపుడు విశేష ప్రాధాన్యత ఏర్పడింది.
అన్ని పార్టీలు సిద్ధమేనా :
విశాఖలో వివిధ పార్టీలలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు కీలక స్థానాలలో పార్టీలలో ఉన్న నేతలు కనిపిస్తారు. అందరికీ ఆహ్వానం అంటూ కాపునాడు పేర్కొన్న నేపథ్యంలో కాపు నేతలు ఏ పార్టీల నుంచి ఎంత మంది వస్తారు అన్న చర్చ అయితే మొదలైంది. టీడీపీ వారికి అయితే కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ నేతలతో కలసి సమావేశాలలో పాల్గొనవద్దని కూడా గట్టిగానే సూచనలు కూడా ఇచ్చి ఉన్నారు. దాంతో ఆ పార్టీ నుంచి ఎవరైనా వస్తారా అన్న చర్చ మొదలైంది. అలాగే వైసీపీ నుంచి ఎవరు హాజరవుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది. జనసేన నుంచి కూడా ఎంతో మంది ప్రజా ప్రతినిధులు కీలక నేతలు ఉన్నారు కాబట్టి వారి నుంచి స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా విశాఖలో జరిగే కాపు నాడు సభ రాజకీయ సామాజిక అంశాల మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా ఈ సభకు వచ్చే పార్టీలు ఆయా నేతలు మాట్లాడే విధానం చేసే ప్రకటనలు బట్టి ఎలాంటి చర్చ జరుగుతుంది అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది.
