Begin typing your search above and press return to search.

ముద్రగడ కుమార్తెకు పదవి జస్ట్ మిస్.. ఏమైంది?

అయితే ఒక చిన్న కారణంతో క్రాంతి ఏ పదవికి పోటీ చేయలేకపోతున్నారని, బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   17 Oct 2026 2:31 PM IST
ముద్రగడ కుమార్తెకు పదవి జస్ట్ మిస్.. ఏమైంది?
X

స్థానిక ఎన్నికలలో అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే అదృష్టవశాత్తూ పదవులకు ఎంపిక అవుతుండగా, మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కాలం కలిసిరాక అవకాశాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జనసేనలో కీలక నాయకురాలిగా పనిచేస్తున్న క్రాంతి స్థానిక ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపారు. ఆమెకు పదవి ఇచ్చే విషయంలో పార్టీ అధిష్టానం సైతం సానుకూలంగా ఉందని సంకేతాలు అందాయి. అయితే ఒక చిన్న కారణంతో క్రాంతి ఏ పదవికి పోటీ చేయలేకపోతున్నారని, బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నారని అంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల నుంచి జనసేనలో కీలకంగా పనిచేస్తున్న క్రాంతి అధినేత పవన్ కల్యాణ్ కు గట్టి మద్దతుదారుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రధాన సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా నిలుపుకోవాలన్న ఆలోచనతో ఉన్న జనసేన అధిష్టానం సైతం క్రాంతిని అన్నివిధాలుగా ప్రోత్సహించింది. దీంతో ఆమె గత రెండున్నరేళ్లుగా కాకినాడ జిల్లాలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రాంతికి కీలక పదవి దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు ఎక్కువగా వినిపించాయి.

కాకినాడ మేయర్ లేదా జడ్పీ చైర్మనుగా క్రాంతికి అవకాశం ఇవ్వొచ్చు అంటూ కొన్నాళ్లుగా విస్తృత ప్రచారం జరిగింది. ఈ రెండు కీలక పదవుల్లో ఏదో ఒకటి క్రాంతికి రిజర్వు అయినట్లుగానే కార్యకర్తలు సైతం అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి క్రాంతి ఏ పదవికి అర్హత సాధించలేకపోయారని అంటున్నారు. దీనికి కారణం స్థానికంగా ఆమె ఓటు హక్కు లేకపోవడమే అంటున్నారు. క్రాంతి స్వస్థలం రాజమండ్రి కాగా, ఆమె ఓటు అక్కడే ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కాకినాడ జిల్లా పరిధిలో ఓటు లేకపోవడం వల్ల ఈ జిల్లాలో ఏ పదవికి ఆమెను పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేకపోయిందని అంటున్నారు.

స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఆ సంస్థల పరిధిలో ఓటు నమోదు చేసుకోవాల్సివుందని అంటున్నారు. ఈ ఉద్దేశంతో రాజమండ్రిలో ఉన్న తన ఓటును ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలో తన అమ్మమ్మ గారి ఊరికి బదిలీ చేసుకోడానికి క్రాంతి ప్రయత్నించారని అంటున్నారు. అయితే సమయం మించి పోవడంతో ఓటు బదిలీ జరగలేదని చెబుతున్నారు. దీంతో ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశాన్ని క్రాంతి తృటిలో చేజార్చుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు. ఇక కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడటం కూడా క్రాంతికి మైనస్ అయిందని అంటున్నారు. ఇక్కడ ఓటు నమోదు చేసుకొందామన్నా కుదరలేదని అంటున్నారు. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా క్రాంతి పరిస్థితి తయారైందని వ్యాఖ్యానిస్తున్నారు.