ముద్రగడ ఆరోగ్యంగా తిరిగి రావాలి.....తోట త్రిమూర్తులు
కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి ఎంతో పేరు ఉంది. ఆయన గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా చేశారు.
By: Satya P | 25 Jun 2026 9:25 AM ISTకాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి ఎంతో పేరు ఉంది. ఆయన గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ముద్రగడ పేరు వింటే కాపు పోరాట నేతగానే అందరికీ గుర్తుకు వస్తారు. అంతలా ఒక సామాజిక వర్గం కోసం తపన పడిన వారు ఈ తరంలో ఎవరూ కనిపించరు. అంతే కాదు రాజకీయాలను సైతం పక్కన పెట్టి తన కెరీర్ ని కూడా వదిలేసి ముద్రగడ కులానికి కట్టుబడిపోయారు. ముద్రగడ రాజకీయ జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్లే ఆయన ఉద్యమ దశలోనూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటే ఆయన 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. రెండేళ్ళుగా ఆయన పెద్దగా రాజకీయంగా యాక్టివ్ గా అయితే లేరు. ఆయన ఆరోగ్య సమస్యలు కూడా అందుకు మరో కారణంగా చెబుతున్నారు.
వైసీపీకి ఇరకాటం :
ఇదిలా ఉంటే తాజాగా ముద్రగడ వైద్యం కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ముద్రగడని వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోలేదని అధినేత జగన్ అయితే ఆయనను కనీసం పరామర్శించ లేదని విమర్శలు ప్రత్యర్ధుల నుంచి వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయంలో అయితే పోస్టులు పెడుతున్న వారూ ఉన్నారు. ఇదంతా వైసీపీకి ఇరకాటంగా మారింది. కాపు కులం మద్దతు కోసం వైసీపీ నేతలు అంతా ఇటీవల కాలంలో ఒక సమావేశం పెట్టి మరీ సరికొత్త వ్యూహం దిశగా సాగుతున్నారు. ఈ సమయంలో ముద్రగడ వంటి కాపుల ఐకాన్ ఆసుపత్రిలో ఉంటే పట్టించుకోరా అన్న విమర్శలు వైసీపీ నేతలను ముఖ్యంగా కాపు పెద్దలని ఇరకాటంలోకి నెడుతున్నాయని అంటున్నారు.
విజ్ఞప్తి చేస్తున్నా అంటూ :
ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు అయితే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడని పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఈ విషయంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది అని అన్నారు. వైసీపీ నేతల గురించి కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఇదే విధంగా ట్రోల్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది మంచి విధానం కాదని ఆయన అంటూ ఆ తరహా ప్రచారాలు చేయడం తప్పు అన్నారు. తామంతా ముద్రగడ వెంటనే ఉన్నామని చెప్పారు. ఆయన ఆరోగ్యం విషయంలో తాము కూడా ఫుల్ అలెర్ట్ గా ఉన్నామని ఎప్పటికపుడు అన్నీ తెలుసుకుంటున్నామని చెప్పారు. ఇక తాము పరామర్శకు వెళ్ళాలనుకుంటే అక్కడ ఆసుపత్రిలో వైద్యానికి ఇబ్బంది అవుతుందని కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఉండిపోయామని తోట త్రిమూర్తులు వివరణ ఇచ్చారు. ఇక జగన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి మోనిటరింగ్ చేస్తున్నారు అని ఈ విషయం అంతా తెలుసుకోవాల్ని అన్నారు.
క్షేమంగా రావాలని :
ముద్రగడ నిజాయితీపరుడైన నేత అని సీఎం స్థాయి నాయకుడు అని తోట కొనియాడారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నామని కూడా చెప్పారు. ఇంతకీ ముద్రగడకు ఏమైంది అన్న చర్చ అయితే సాగుతోంది. తోట త్రిమూర్తులు మీడియా ముఖంగా చేసిన విజ్ఞప్తి సంగతిని బట్టి చూస్తే ముద్రగడ ఆరోగ్యం విషయంలో మళ్లీ కొత్త ప్రచారానికి కూడా తావు ఇచ్చినట్లు అయింది అని అంటున్నారు. ఏడు పదులకు చేరువ అవుతున్న ముద్రగడ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు.
