కాపు నేతల పోలరైజేషన్...వైసీపీకి దెబ్బేనా ?
నెల క్రితం కాపు నేత ముద్రగడ పద్మనాభం మరణించారు. ఆయన నమ్మిన సిద్ధాంతం పట్ల రాజీ లేని నాయకుడు.
By: Satya P | 30 Aug 2026 9:10 AM ISTనెల క్రితం కాపు నేత ముద్రగడ పద్మనాభం మరణించారు. ఆయన నమ్మిన సిద్ధాంతం పట్ల రాజీ లేని నాయకుడు. కేవలం తన సామాజిక వర్గం కోసం ఆయన రాజకీయంగా తన అవకాశాలను సైతం వదులుకున్నారు. లేకపోతే ఆయన మిగిలిన వారి మాదిరిగా ఉన్నత శిఖరాలు అధిరోహించేవారు అని అంటారు. ఇదిలా ఉంటే ముద్రగడ మాదిరిగా కులం కోసం పోరాడే నాయకులు ఈ రోజులలో ఎవరూ ఉండరని కూడా అంటారు. ఇక ముద్రగడ తన జీవితంలో ఎన్నో పార్టీలు మారు. అయితే ఆయన చివరి అంకంలో ఉన్న పార్టీ వైసీపీ. వైసీపీలో ఆయన చేరిన తర్వాత ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ 2024 ఎన్నికలు కూటమి ప్రభంజనాన్ని చూపించాయి. దాంతో ముద్రగడ ప్రభావం గోదావరి జిల్లాలలోనే కాదు సొంత నియోజకవర్గం గా భావించే పిఠాపురంలోనూ పనిచేయలేదు. ఇక తన పేరుని కూడా ముద్రగడ మార్చుకుంటాను అని ఛాలెంజ్ చేసినా పిఠాపురం ఓటర్లు జనసేనకు పట్టం కట్టారు. ఆ పంతంతో ఆయన తమ పేరుని మార్చుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఆయన నిబద్ధత గానే చూడాల్సి ఉంటుంది.
ముద్రగడ లేని లోటు :
ఇదిలా ఉంటే ముద్రగడ లేని లోటు అయితే వైసీపీలో స్పష్టంగా ఉంది. ముద్రగడ యాంటీ టీడీపీ పొలిటికల్ స్టాండ్ వైసీపీకి కలసి వస్తుందని అంతా అనుకున్నారు. ఆ పార్టీ కూడా ఆశపడింది. 2029 ఎన్నికల్లో కచ్చితంగా కాపులను తమ వైపునకు తిప్పే సామర్ధ్యం ముద్రగడకు ఉందని కూడా వైసీపీ భావించింది. ఆయనకు పార్టీలో పీఏసీ మెంబర్ గా పదవి ఇచ్చింది. అయితే మధ్యలోనే ముద్రగడ మరణించడంతో వైసీపీకి గోదావరి జిల్లాలలో ఇపుడు పెద్ద దిక్కు బలమైన సామాజిక వర్గంలో లేకుండా పోయింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ముద్రగడకు కాపు సామాజిక వర్గంలో మంచి అనుచర గణం ఉంది. వారంతా ఆయన ఏది చెబితే అదే అన్నట్లుగా ఉంటారు. అలాంటిది ముద్రగడ మరణం తరువాత వారికి కూడా సరైన దిశా నిర్దేశం చేసే వారు లేకుండా పోయారు అని అంటున్నారు. దాంతో కాపు నేతలలో కూడా పునరాలోచన మొదలైంది అని అంటున్నారు.
జనసేనకు ప్లస్ గా :
ఇక ముద్రగడ మృతి తరువాత గోదావరి జిల్లాలే కాదు కాపులు బలంగా ఉన్న ఉత్తరాంధ్రా సహా కీలక జిల్లాలలో రాజకీయం జనసేనకు అనుకూలంగా మారుతోంది అని అంటున్నారు. ఇక సరైన సమయం చూసి జనసేన కూడా తన వ్యూహాలను అమలు చేస్తోంది. సొంతంగా బలపడాలని ఆలోచిస్తోంది. దాంతో కాపు నేతలలో కూడా కొత్త ఆలోచనలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటిదాకా వేరు వేరు పార్టీలలో ఉన్న కాపు నేతలు అంతా ఇపుడు పోలరైజ్ అవుతున్నారని అంటున్నారు. ఏపీలో టీడీపీకి ఒక కులం వైసీపీకి మరో కులం అండగా ఉంది అన్నది బహిరంగ రహస్యమే. అలా జనసేనకు కాపులు అండగా ఉండాల్సిన అవసరాన్ని కాపు నేతలు గుర్తిస్తున్నారు అని అంటున్నారు. దాని వల్ల ఈ రోజు కాకపోయినా రేపు అయినా తమ సామాజిక వర్గం వారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దాంతో రాజకీయాలకు అతీతంగా కాపులలో బిగ్ షాట్స్ ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు.
భారీ చేరికలు :
ఈ క్రమంలో రానున్న కాలంలో అనూహ్యంగా జనసేనలో భారీ చేరికలు ఉంటాయని అంటున్నారు. ప్రధానంగా కాపులలో పేరు గడించిన నాయకులు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేతలు అందులో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇది కచ్చితంగా జరిగితే వైసీపీకి భారీ షాక్ అని అంటున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికల్లో బలమైన సామాజిక వర్గం తమకు దూరం కావడంతో ఓటమిని మూటకట్టుకుని ఈ జిల్లాలలో ఒక్క సీటు కూడా గెలుచుకోని వైసీపీ 2029 నాటికి పరిస్థితి మారుతుందని భావిస్తోంది. అయితే సీనియర్ కాపు నేతలలో రాజకీయ పునరేకీకరణ ఆలోచనలు మొదలు కావడం అది జనసేన కేంద్రంగా ఉండడంతో వైసీపీకి ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారుతాయా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఈ ప్రచారం మేరకు ఏమి జరుగుతుందో.
