మీడియాపై 100 కోట్ల పరువు నష్టం..ఎం.ఎస్.ధోని గెలుపు?
2013 ఐపిఎల్‌లో బెట్టింగ్ - మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని ప్రముఖ మీడియా సంస్థలు క్రికెటర్ ఎం.ఎస్.ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 18 Aug 2025 1:14 PM IST2013 ఐపిఎల్‌లో బెట్టింగ్ - మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని ప్రముఖ మీడియా సంస్థలు క్రికెటర్ ఎం.ఎస్.ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎం.ఎస్.ధోనీకి చెన్నై పోలీసులు సమన్లు కూడా పంపారు. అయితే ఈ పరిణామాన్ని ధోని అంత తేలిగ్గా తీసుకోలేదు. ఆ ఆరోపణ అతడిని మానసికంగా కుంగదీసింది. అభిమానుల్లో కల్లోలానికి కారణమైంది. అదే క్రమంలో తనపై తప్పుడు ప్రచారం సాగించారంటూ.. చెన్నై- జీ మీడియా కార్పొరేషన్, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి, న్యూస్ నేషన్ నెట్‌వర్క్ - రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జి సంపత్ కుమార్‌లపై రూ.100 కోట్ల మేర పరువు నష్టం దావా వేసారు ధోనీ.
ఈ కేసులో విచారణ ప్రారంభించాలని మద్రాస్ హైకోర్టు తాజాగా ఆదేశించింది. 2014లో తాను బెట్టింగ్ పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేసారని, దీని కారణంగా పెద్ద ఎత్తున పరువు నష్టాన్ని ఎదుర్కొన్నానని ఎం.ఎస్. ధోని తన దావాలో పేర్కొన్నారు. పూర్తిగా నిరాధార ఆరోపణలు అయినా ధోనీకి చెన్నై పోలీసులు సమన్లు పంపడం ఆశ్చర్యపరిచిందని ఆయన న్యాయ బృందం చెబుతోంది. ఈ ఆరోపణలు ధోని ప్రతిష్ఠకు భంగం కలిగించాయి. కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయని లాయర్ల టీమ్ పేర్కొంది.
ప్రస్తుతం కోర్టు విచారణను ప్రారంభించింది. ధోని సెలబ్రిటీ హోదా కారణంగా కోర్టు ప్రాంగణంలో అంతరాయం కలగకుండా ఉండటానికి అక్టోబర్ 20 నుంచి డిసెంబర్ 10 మధ్య (2025)లో ఇరువర్గాల పరస్పర అంగీకారంతో చెన్నైలోని ఏదో ఒక ప్రదేశంలో ధోని వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించారు. ఎం.ఎస్.ధోనీకి ఉన్న అసాధారణ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ పరువు నష్టం కేసు సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది. ఈ కేసులో దోషులు ఎవరు? ఎవరిది తప్పు అన్నది తేలాల్సి ఉంది.
