గుడ్ న్యూస్... ఎయిడ్స్ పై ఆ ప్రకటన ఇకపై కనిపించకపోవచ్చు!
అవును... 'ఎంఆర్ఎన్ఏ' సాంకేతికతపై నిర్మించబడిన ప్రయోగాత్మక వ్యాక్సిన్ పై నిర్వహించిన పరీక్షల్లో చాలా సానుకూల ఫలితాలు వచ్చినట్లు చెబుతున్నారు.
By: Raja Ch | 3 Aug 2025 6:00 AM ISTమానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్) శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. రోగనిరోధక వ్యవస్థపై దాడి చేయడం మొదలు పెడుతుంది. ఇది క్రమంగా శరీరంలో అన్ని వ్యవస్థల్నీ ధ్వంసం చేస్తూ.. శరీరం సహజంగా ఎదుర్కొనే రోగాలను కూడా అడ్డుకోలేకపోతుంది. ఫలితంగా మరణం సంభవిస్తుంది!
అందుకే ఎయిడ్స్ పై రెగ్యులర్ గా ఓ ప్రకటన గట్టిగా వినిపిస్తుంటుంది. అదే... "హెచ్‌ఐవీకి చికిత్స/మందు లేదు.. నివారణ ఒక్కటే మార్గం"! అయితే... ఇకపై ఆ ప్రకటన కనిపించకపోవచ్చని అంటున్నారు. దానికి కారణం... గత కొన్ని సంవత్సరాలుగా హెచ్‌ఐవీ వంటి ప్రమాదకరమైన వ్యాధితో పోరాడటానికి సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం వెతుకుతున్న శాస్త్రవేత్తలకు ఆశ కనిపించింది!
అవును... 'ఎంఆర్ఎన్ఏ' సాంకేతికతపై నిర్మించబడిన ప్రయోగాత్మక వ్యాక్సిన్ పై నిర్వహించిన పరీక్షల్లో చాలా సానుకూల ఫలితాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ సెంటర్ డైరెక్టర్, క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీలోని బేస్ ఎంఆర్ఎన్ఏ తయారీ సౌకర్యం డిప్యూటీ డైరెక్టర్ సేథ్ చీతం స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... ఇన్ఫెక్షన్ ను నిరోధించే సురక్షితమైన, ప్రభావవంతమైన హెచ్‌ఐవీ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. తాజా ప్రయత్నంలో గణనీయమైన పురోగతి కనిపించిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ మొదటి ట్రయల్ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో నిర్వహించారని చెబుతున్నారు.
ఈ ప్రయోగం కోసం పరిశోధకులు 18 నుండి 55 సంవత్సరాల వయస్సు గల 108 మంది ఆరోగ్యవంతులైన వ్యక్తులను నియమించుకున్నారు. వారిని మూడు గ్రూపులుగా విభజించారు. ఇందులో ప్రతీ గ్రూపుకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లలో ఒకదాన్ని ఇచ్చారు. ఇందులో ఒక టీకా స్వేచ్ఛగా తేలియాడే ట్రిమర్ ను ఎన్ కోడ్ చేయగా, తరువాతి రెండు నిర్మాణం యొక్క విభిన్న బౌండ్ వెర్షన్ లను ఎన్ కోడ్ చేశాయి.
ఈ ప్రయోగంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ తమకు కేటాయించిన టీకా మూడు మోతాదులను వేసుకున్నారు. ఇందులో మొదటి ఒకటి, రెండు నెలల తర్వాత మరొకటి, మొదటి ఆరు నెలల తర్వాత చివరి మోతాదు ఇచ్చారు. ఇందులో బౌండ్-ట్రిమర్ టీకాలు 80% మందిలో ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయగా.. ఫ్రీ-ఫ్లోటింగ్-ట్రిమర్ టీకా 4% మందిలో మాత్రమే ప్రతిస్పందనను ప్రేరేపించిందని చెబుతున్నారు.
ఈ సందర్భంగా... హెచ్ఐవీ కి వ్యాక్సిన్ ను తయారు చేయడం చాలా సవాలుతో కూడుకున్నదని.. ఈ వైరస్ మారువేషాలు ధరించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను నైపుణ్యంగా తప్పించుకుంటుందని చెబుతున్నారు. దీంతో.. శాస్త్రవేత్తలు వివిధ వ్యూహాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో... ఈ వ్యాక్సిన్ లను మరింత విస్తృతమైన రక్షణాత్మక యాంటీబాడీ ప్రతిస్పందనలను ప్రేరేపించేలా మెరుగుపరచడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు!
