ఎలుకలు పెంచుకోవడం ఏంట్రా బాబు?
ఆ ఎలుకల గురించి యజమానిని ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన జవాబు విని అధికారులు బిత్తరపోయారు.
By: A.N.Kumar | 15 Oct 2025 12:52 AM ISTమధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఫుడ్ ఇన్‌స్పెక్షన్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక రెస్టారెంట్ యజమాని వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* కిచెన్‌లో అపరిశుభ్రత, ఎలుకలు.. యజమాని వింత సమాధానం
మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో బుందేల్‌ఖండ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రాశి రెస్టారెంట్‌లో ఆహార శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో వంటగది దృశ్యాలు అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాయి.కిచెన్ మొత్తం మురికి, అపరిశుభ్రతతో నిండిపోయింది.ఎక్కడికక్కడ నూనె మరకలు పేరుకుపోయాయి.తెరిచి ఉంచిన ఆహారం, నిల్వ చేసిన పద్ధతుల్లో తీవ్ర లోపాలు కనిపించాయి.ఆహార పదార్థాలపై ఈగలు వాలడం, పెరుగులో కీటకాలు ఈదడం వంటి అమానవీయ దృశ్యాలు అధికారులను కదిలించాయి. అయితే, ఈ పరిశుభ్రత లేమి దృశ్యాలన్నింటిలోకెల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రీతి రాయ్కు అత్యంత ఆశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే... వంటగదిలో హాయిగా తిరుగుతున్న ఎలుకలు.
ఆ ఎలుకల గురించి యజమానిని ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన జవాబు విని అధికారులు బిత్తరపోయారు. యజమాని చాలా తేలికగా, "మేడమ్, ఈ ఎలుకలు మా పెంపుడు జంతువులు (Pets). ఇవి ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి" అని సమాధానం చెప్పాడు.
* డొమెస్టిక్ సిలిండర్ల వాడకం
వంటగదిలో ఎలుకలను పెంపుడు జంతువులు అనడం ఒక షాక్ అయితే, ఇన్‌స్పెక్టర్లు మరొక కీలక ఉల్లంఘనను కూడా గుర్తించారు. రెస్టారెంట్ అవసరాల కోసం అనుమతి లేని గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్లు తేలింది. దీని గురించి అడగ్గా యజమాని "రీఫిల్లింగ్ కోసం పక్కన పెట్టాను" అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, వాణిజ్య అవసరాలకు కేవలం వాణిజ్య సిలిండర్లను మాత్రమే వాడటం చట్టరీత్యా తప్పనిసరి.
* అధికారులు తీసుకున్న చర్యలు
ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు వెంటనే రెస్టారెంట్ నుంచి ఆహార నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. తదుపరి చర్యల కోసం రిపోర్ట్ ఆధారంగా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వంటగదిలోని అపరిశుభ్రత, లోపాలను ఏడు రోజులలోపు సరిదిద్దేలా యజమానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటన రెస్టారెంట్ పరిశ్రమలో నాణ్యతా ప్రమాణాలు, ఫుడ్ సేఫ్టీ నియమాల ఆవశ్యకతను మరోసారి ప్రజలకు గుర్తు చేసింది. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.
