ఏపీ మండలి ఛైర్మన్ మోషేన్ రాజు - రాజకీయ రచ్చ.. !
శాసన మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజు.. వ్యవహరిస్తున్న తీరు.. అధికార పార్టీలో గుబులు రేపుతోంది.
By: Garuda Media | 28 Aug 2025 9:08 AM ISTశాసన మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్ రాజు.. వ్యవహరిస్తున్న తీరు.. అధికార పార్టీలో గుబులు రేపుతోంది.వైసీపీకి చెందిన ఎస్సీ నేత మోసేన్ రాజును వైసీపీ అధినేత పట్టుబట్టి మండలి చైర్మన్‌ను చేశారు. దీంతో సహజంగానే ఆయన స్వామి భక్తి ప్రదర్శించ డం తప్పుకాదు. కానీ, ప్రభుత్వం మారిన తర్వాత కూడా.. ఆయన కనీసం మారలేదన్నది టీడీపీ వర్గాలు చెబుతున్న మాట. ఇప్పటికి నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు.
అదే సమయంలో మండలి పదవులకు కూడా రాజీనామాలు సమర్పించారు. దాదాపు 10 మాసాలు అవుతున్నా.. ఇప్పటి వరకు మోషేన్ రాజు పేషీలోనే ఆయా రాజీనామాల పత్రాలు మూలుగుతున్నాయి. వీటిని ఆమోదించాలని సదరు నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే రెండేసి దఫాలుగా రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలు.. మోషేన్‌రాజనుకలిశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని ఆయనకు విన్నవించారు. కానీ, మోషేన్ రాజు మాత్రం చూస్తాం-చేస్తాం.. అంటూ చెబుతున్నారే తప్ప ఆమోదించడం లేదు.
ఈ క్రమంలో వైసీపీ నుంచి సభ్యత్వం పొంది.. 8 మాసాల కిందట రాజీనామా చేసిన జయమంగళ వెంకట రమణ.. నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. తన రాజీనామాను ఆమోదించేలా మోషేన్ రాజును ఆదేశించా లని ఆయన అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. శాసన మండలి సెక్రటేరియట్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే.. ఇలా న్యాయ పోరాటం చేయడం వల్ల జయమంగళకు ఒరిగేదేమీ లేదన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే.. న్యాయస్థానాలు ఈ విషయంలో జోక్యం చేసుకున్నా.. వాటి పాత్ర కేవలం 10-20 శాతంలోపే ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఇక, ఈ పరిణామాలతో.. ఇతర నేతలు కూడా అలెర్ట్ అవుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే రాజీనామా చేసిన వారి పత్రాలను మోషేన్‌రాజు ఆమోదించి ఉంటే.. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉండేది. తద్వారా మండలిలోపై చేయి సాధించాలని టీడీపీలెక్కలు వేసుకుంది. కానీ, రాజుగారు మాత్రం వాటిని ఆమోదించకుండా పక్కన పెట్టడం, దీంతో ఎమ్మెల్సీలకు వేతనాలు కూడా రాకపోవడం, సభకు రావాలని ఆహ్వానాలు కూడా అందకపోవడంతో ఇక, తాము మాత్రం రాజీనామాలు చేసి ప్రయోజనం ఏంటని మిగిలిన వారు మౌనంగా ఉన్నారు. మొత్తంగా మోషేన్ రాజు చేస్తున్న ఈ వ్యవహారంతో టీడీపీ లక్ష్యం ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.
