Begin typing your search above and press return to search.

ఐదుగురు మరణించిన విమాన ప్రమాదంలో భారత ప్రధాని ఎలా బయటపడ్డారు..!

ఈ క్రమంలో.. ఓ విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినా.. బయటపడిన మాజీ భారత ప్రధాని సంఘటన తాజా పరిణామాల నేపథ్యంలో గుర్తుకు వస్తోంది!

By:  Raja Ch   |   29 Jan 2026 5:26 PM IST
ఐదుగురు మరణించిన విమాన ప్రమాదంలో భారత ప్రధాని ఎలా బయటపడ్డారు..!
X

గగనతలంలో ప్రమాదాలు, గాల్లో ప్రాణాలు, తెరపైకి ఎన్నో ఘోరాలు, మరెన్నో విషాదాలు. టెకాఫ్ కి ల్యాండింగ్ కి మధ్య గాల్లో ప్రయాణాలు ఎంతో సౌకర్యంగా అనిపించినా.. ప్రమాదాలు జరిగిన తర్వాత మాత్రం.. ట్రైన్ కి వెళ్లుంటే బాగుండేది, బస్సు ఎక్కేసి ఉంటే అయిపోయేదు, కార్లో అయితే ఇంకా సౌకర్యంగా ఉండేది అని చెప్పుకుంటారు! ఈ క్రమంలో.. ఓ విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినా.. బయటపడిన మాజీ భారత ప్రధాని సంఘటన తాజా పరిణామాల నేపథ్యంలో గుర్తుకు వస్తోంది!

అవును... మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత, మహా రాజకీయాల్లో కీలక నేత అయిన అజిత్ పవార్ బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగానూ తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. దాదాపు 40 ఏళ్ల పాటు మహా రాజకీయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి జీవితం.. రాజకీయాలు మొదలుపెట్టిన బారామతిలోనే ముగియడం గమనార్హం. ఈ సమయంలో ఓ కీలక విషయం చర్చిద్దామ్..!

అది 1977 నవంబర్ 4 రాత్రి సమయం. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జనతాపార్టీ విజయం అనంతరం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొరార్జీ దేశాయ్ ఈశాన్య రాష్ట్రాలలో తన మొదటి పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి భారత వైమానిక దళ విమానంలో అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోబోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో.. సోవియట్ నిర్మిత టుపోలెవ్ టు 124 విమానం కుప్ప కూలిపోయింది.

ఆ ఘటనలో అందులోని ఐదుగురు మరణించారు కానీ... మొరార్జీ దేశాయ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ విమానంలో ప్రాణాలతో బయటపడిన ప్రధానితో పాటు ఆయన కుమారుడు కాంతిభాయ్ దేశాయ్, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పీకే తుంగోన్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ జాన్ లోబో తో పాటు భద్రతా అధికారులు, జర్నలిస్టులు ఉన్నారు.

అయితే.. ఆ సమయంలో ఉరుములతో కూడిన వర్షం, దాదాపు జీరో విజిబులిటీ పరిస్థితులు ఉండటంతో పాటు.. జోర్హాట్ ఎయిర్ పోర్ట్ లో ఆధునిక ల్యాండింగ్ సదుపాయాలు లేని పరిస్థితి. ఈ క్రమంలో.. మొదటి ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైన తర్వాత.. పైలట్లు మరో ప్రయత్నం ప్రారంభించారు. ఈ సమయంలోనే.. విమానం ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో.. ఆ విమానం రెక్క, కాక్ పీట్ లోని భాగాలు తెగిపోయాయి. అనంతరం.. టెక్ లాగావ్ గ్రామ సమీపంలోని వరిపొలంలో విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది.

ఈ ఘటనలో ఐదుగురు మరణించగా... 81 ఏళ్ల దేశాయ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ సమయంలో.. విమానం క్రాష్ ల్యాండ్ అయిన టెక్ లాగావ్ లోని గ్రామస్థులు టార్చిలైట్లతో ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రాణాలతో బయటపడిన వారిని సురక్షితంగా తరలించడంలో సహాయపడ్డారు. అనంతరం... ఆ రాత్రి సహాయం చేసిన గ్రామస్తులకు ప్రధాని దేశాయ్ కృతజ్ఞతా లేఖలు రాసి, తనకు చికిత్స చేసిన ఆసుపత్రికి రూ. 5,000 విరాళంగా ఇచ్చారు! దేశ చరిత్రలో ఇదో అద్భుతం!

ఈ ప్రమాదంలో మరణించినవారిలో విమానం కెప్టెన్ క్లారెన్స్ జోసెఫ్ డిలిమా, కో-పైలట్ మాథ్యూ సిరియాక్, నావిగేటర్ వింగ్ కమాండర్ జోగిందర్, ఫ్లైట్ ఇంజనీర్ వివిఎస్ సుంకర్, ఫ్లైట్ సిగ్నలర్ ఓపి అరోరా ఉన్నారు.