Begin typing your search above and press return to search.

కూటమిలో సైడ్...ఓపలేని బాధ ఆయనదే !

రాజకీయాల్లో ఆట కరెక్ట్ గా ఆడాలి. ఎందుకంటే ఇది చదరంగం అనుకుంటారు, కానీ వైకుంఠపాళి కూడా.

By:  Satya P   |   19 Oct 2025 9:08 AM IST
కూటమిలో సైడ్...ఓపలేని బాధ ఆయనదే !
X

రాజకీయాల్లో ఆట కరెక్ట్ గా ఆడాలి. ఎందుకంటే ఇది చదరంగం అనుకుంటారు, కానీ వైకుంఠపాళి కూడా. నిచ్చెనలు ఉంటాయో లేవో తెలియదు కానీ పాములు మాత్రం పక్కాగా ఉంటాయి. వాటికి చిక్కితే మళ్లీ కధ మొదటికి వచ్చినట్లే. ఇపుడు ఇలాంటి పరిస్థితిని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అనుభవిస్తున్నారు అని అంటున్నారు. ఒక మాట లేదు ఊసు లేదు అంతలా సైడ్ ఐపోయారు ఆయన. రేపల్లె నాది అని వైసీపీలో దర్జాగా చెప్పుకునే వారు. రాజకీయంగా రీ సౌండ్ చేసేవారు. అలాంటి పెద్ద మనిషి ఇపుడు ఏ పిలుపూ లేక మౌనంగా అన్నీ చూస్తున్నారు.

ఏడాది పదవీ కాలం :

రాజ్యసభ సభ్యత్వం అంటే ఎంతో డిమాండ్ ఉంటుంది. కావాలీ అంటే అది దక్కని వారిని అడిగితే చెబుతారు. అలాంటి రాజ్యసభకు జగన్ మోపిదేవి వెంకటరమణను పంపించారు. అంతే కాదు ఆయన 2014, 2019లలో కూడా ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ఇక శాసనమండలి రద్దు చేద్దామని భావించి తన మనుషులు వైఎస్సార్ కి నేస్తాలు అని తలచి వారు ఇబ్బంది పడరాదు అని రాజ్యసభకు పంపించారు. అయితే 2024 లో వైసీపీ ఓటమి పాలు అయ్యాక నెల కూడా తిరగకుండానే మోపిదేవి వెంకటరమణ తన పదవికి రాజీనామా చేసి కూటమి వాకిట నిలిచారు. ఏడాది పదవీ కాలం ఉండగానే ఆయన పెద్దల సభ నుంచి తప్పుకుని త్యాగం చేశారా లేక వ్యూహం అనుకుని ఇలా చేశారా అన్నది అభిమానులకే అర్ధం కావడం లేదుట.

ఎమ్మెల్సీ హామీతో :

ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఈ మేరకు హామీ ఉందని అప్పట్లో ప్రచారం సాగింది. అంతే కాదు ఆయన కుమారుడికి రాజకీయంగా తగిన అవకాశం ఇస్తారని కూడా చెప్పుకున్నారు. అన్నీ మాట్లాడుకునే ఆయన వైసీపీ గూటి నుంచి బయటపడి సైకిలెక్కారు తీరా ఎమ్మెల్సీ పదవులు అనేకం ఖాళీ అయినా మోపిదేవి పేరు ఎక్కడా వినిపించలేదు. మరో వైపు చూస్తే ఆయనకు రేపల్లె నియోజకవర్గంలో కూడా అనుకున్నంత గుర్తింపు లేదని అనుచరులు బాధ పడుతున్నారు. అక్కడ రెవిన్యూ మత్రిగా అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన హవా ముందు మోపిదేవి తేలిపోతున్నారు అని అంటున్నారు.

పదవీయోగం ఉందా :

ఇక ఆయనకు సమీప భవిష్యత్తులో పదవీ యోగం ఉందా లేదా అంటే అదే డౌట్ అని అనుచరులు అభిమానులే చెబుతున్నారు. పేరుకు అధికార పార్టీ అన్న పేరే కానీ ఆయనను ఇంకా వైసీపీ నేతగానే చూస్తున్నారుట. అంతే కాదు టీడీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా గట్టిగా పోరాడిన మోపిదేవి ఇపుడు తెల్ల జెండా చూపించి కూటమిలో చేరినా ఆయనతో కలిసేందుకు ఎవరూ సుముఖంగా లేకపోవడం కూడా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. ఇక పదవీ యోగం ఇప్పట్లో లేదని కూడా అంటున్నారు.

రెండేళ్ళ తరువాత :

ఎమ్మెల్సీ ఖాళీలు పెద్ద ఎత్తున 2027లో అవుతాయి. అయితే వాటికి అనేక రెట్లు ఆశావహులు కూటమి పార్టీలలో ఉన్నారు. వీరిలో త్యాగరాజులు ఉన్నారు. ఒరిజినల్ లీడర్స్ కూడా ఉన్నారు. వారిని అందరినీ దాటుకుని మోపిదేవికి రెండేళ్ళ తరువాత అయినా ఎమ్మెల్సీ దక్కుతుందా అన్నది పెద్ద ప్రశ్న అని అంటున్నారు. అంతే కాదు ఒక వేళ ఎమ్మెల్సీ ఇచ్చినా ఆయనకు మంత్రి యోగం అన్నది అసలు ఉండదని ఇక అనగాని సత్యప్రసాద్ ఇలాకాగా ఉన్న రేపెల్లెలో మోపిదేవి వారసుడికి చోటు దక్కడం కూడా కలగానే భావించాలని అంటున్నారు. మొత్తం మీద పెద్దాయన మోపిదేవి వైసీపీ నుంచి కూటమిలో చేరి ఏమి సాధించారు అంటే మౌనం అని అంటున్నారుట.