వైసీపీలో ఆ మోపిదేవి ప్లేస్ లో ఈ మోపిదేవి !
వైసీపీ పుట్టుక నుంచి దాదాపు పదమూడేళ్ళ పాటు ఆ పార్టీలో కొనసాగారు మాజీ మంత్రి రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ.
By: Satya P | 15 May 2026 8:15 AM ISTవైసీపీ పుట్టుక నుంచి దాదాపు పదమూడేళ్ళ పాటు ఆ పార్టీలో కొనసాగారు మాజీ మంత్రి రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ. 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారి గెలిచిన మోపిదేవి వైఎస్సార్ ప్రోత్సాహంతో ఎదిగిన నేతగా చెబుతారు. ఆయన 2009 లో రెండోసారి కూడా అదే పార్టీ నుంచి గెలిచారు. వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన జగన్ పార్టీలోనూ చేరిన తరువాత 2019లో మంత్రిగా అక్కడా పనిచేశారు. 2024 లో వైసీపీ ఓటమి తరువాత ఆయన ఆ బంధాన్ని తెంచుకుని టీడీపీలోని వెళ్ళిపోయారు. ఆయనకు టీడీపీలో తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కోసం చూస్తున్నారు. ఆయన వైసీపీ వైపు తిరిగి చూస్తున్నారు అన్న చర్చ ఒక వైపు సాగుతూండగానే ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నుంచి మోపిదేవి వచ్చి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఆ మోపిదేవి ఈ మోపిదేవీ ఒకరు కాకపోవడమే రాజకీయ ట్విస్ట్.
కాంగ్రెస్ నేతగా ఉంటూ :
వైసీపీలో కొత్తగా చేరిన ఈయన పూర్తి పేరు మోపిదేవి శ్రీనివాసరావు. ఈయన కాంగ్రెస్ కి చెందిన నాయకుడు. ఆయన వైసీపీలోకి చేరేటప్పుడు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను తన వెంట తెచ్చి మరీ హడావుడి చేశారు. దాంతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం చాలా రోజుల తరువాత సందడి చేసింది. జగన్ ఆయన మెడలో కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే టికెట్ ఆయనకే :
అయితే మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరినా రేపల్లె వైసీపీ ఇంచార్జిగా ప్రస్తుతం ఉన్న మోహన క్రిష్ణకే టికెట్ అని జగన్ చెప్పేశారు. ఆయన గెలుపునకు మోపిదేవి మద్దతు ఇవ్వాలని కోరారు. మోహన క్రిష్ణ గెలుపు బాధ్యతలను పూర్తిగా మోపిదేవి తీసుకుని గట్టిగా పనిచేయాలని కూడా సూచించారు. కష్టపడితే వైసీపీలో మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా జగన్ హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ హామీతో :
మోపిదేవి శ్రీనివాసరావు పార్టీ కోసం పనిచేసి గెలిపిస్తే కనుక చట్టసభలో తెచ్చి కూర్చోబెడతాను అని జగన్ హామీ ఇచ్చారు. అంటే ఎమ్మెల్సీగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అన్న మాట. ఎవరు కష్టపడినా జగన్ గుర్తుంచుకుంటారు అని ఎప్పటికీ మరచిపోయేది ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. తనపైన నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చిన మోపిదేవికి తగిన న్యాయం చేస్తాను అని జగన్ చెప్పారు.
ఆయనకు అంతేనా :
ఇదిలా ఉంటే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా వైసీపీలోకి రావాలని చూస్తున్నారు. అయితే ఆయనకు డోర్స్ క్లోజ్ అని ఈ మోపిదేవి రాకతో చెప్పేశారు అని అంటున్నారు. అంతే కాదు ఒకసారి పార్టీని విడిచి వెళ్ళిన వారిని చేర్చుకునేది లేదని జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు అని అంటున్నారు. మొత్తానికి రేపల్లె వైసీపీకి మోపిదేవి లేని లోటు తీరింది అని అంటున్నారు. మరి ఈ కొత్త మోపిదేవి పాత మోపిదేవి మాదిరిగా పార్టీని భుజాల మీద ఎంత వరకూ పూర్తి స్థాయిలో మోస్తారు అన్నది చూడాల్సి ఉంది.
