Begin typing your search above and press return to search.

చందమామ ఎలా పుట్టాడు? తాజా అధ్యయనం ఏం చెప్పింది?

ఇలాంటి సందేహాల్ని తీర్చుకునేందుకు జర్మనీలోని మాక్స్ ప్లాంట్ ఇన్ స్టిట్యూట్ ఫర్ సోలార్ రీసెర్చ్.. షికాగో వర్సిటీ భారీ ప్రయోగాన్ని నిర్వహించాయి.

By:  Garuda Media   |   25 Nov 2025 1:00 PM IST
చందమామ ఎలా పుట్టాడు? తాజా అధ్యయనం ఏం చెప్పింది?
X

చందమామ పుట్టుక ఎలా సాగింది? అన్న ప్రశ్నకు సమాధానం కొత్తగా వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి బోలెడంత సమాచారం అందుబాటులో ఉంది. అయితే.. అంతకు మించిన విషయాల్ని గుర్తించేందుకు.. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతతో ఇప్పటివరకు గుర్తించని కొత్త అంశాల్ని గుర్తించే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు. దీని కోసం సాగిన అధ్యయనంలో కొత్త అంశాల్ని గుర్తించారు.

చంద్రుడి పుట్టుక.. దానికి దారి తీసిన పరిస్థితుల మీద అవగాహన ఉన్నప్పటికి.. అయితే ఇదెంత పరిమాణంలో ఉండేది? దాని మూలాలు ఏంటి? దాని కూర్పు ఎలా సాగిందన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఇలాంటి సందేహాల్ని తీర్చుకునేందుకు జర్మనీలోని మాక్స్ ప్లాంట్ ఇన్ స్టిట్యూట్ ఫర్ సోలార్ రీసెర్చ్.. షికాగో వర్సిటీ భారీ ప్రయోగాన్ని నిర్వహించాయి.

చంద్రుడి పుట్టుకపై ఇప్పటికే ఉన్న అవహగాన ఏమిటన్న విషయాన్ని ప్రస్తావించటం ద్వారా.. తాజా అధ్యయనం గుర్తించిన కొత్త అంశాలేమిటి? అన్నది ఇట్టే అర్థమవుతుంది. 450 కోట్ల ఏళ్ల క్రితం మన సౌరకుటుంబంలో అటూఇటుగా అంగారకుని సైజులో థెయో అనే భారీ గ్రహం ఉండేది. దాని సైజును లెక్కలోకి తీసుకుంటే భూమికి అక్కలాంటిదిగా చెప్పొచ్చు. అది కాస్తా అప్పటి భూమితో ఢీ కొట్టి ముక్కలు ముక్కలైంది. వాటిల్లో చిన్నా చితకా ముక్కలన్నీ నామరూపాల్లేకుండా పోతే.. మిగిలిన అతి పెద్ద భాగమే మన చందమామగా మారిందన్నది ఇప్పటివరకు ఉన్న వాదన.

ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. చంద్రుడికి జన్మనిచ్చే క్రమంలో దాని తల్లి ఏకంగా ప్రాణత్యాగం చేసిందని చెప్పొచ్చు. థెయో ఢీ కొన్న ఫలితంగా భూ అక్షం కూడా భారీ మార్పులకు లోనై.. ఇప్పుడున్న క్రమంలోకి మారింది. దీంతో జీవకోటికి అనువుగా వాతావరణం మారేందుకు వీలు కలిగినట్లుగా చెప్పాలి. అలా థెయో తాను కనుమరుగైపోతే.. ఇటు భూమికి ఎనలేని సాయం చేయటమేకాదు.. చంద్రుడికి ఉనికిని ఇచ్చింది.

ఇదంతా పాత ముచ్చటే. మరి.. తాజా అధ్యయనం ఏం చెప్పింది. ఇంతకీ ఇప్పుడు చేపట్టిన పరిశోధన ఎలా సాగింది? అన్న విషయంలోకి వెళితే.. ఇనుము.. రాళ్లు తదితరాలతో పాటు అపోలో అంతరిక్ష యాత్రంలో భాగంగా చంద్రునిపై నుంచి.. పలు సమీప ఉల్కల నుంచి వ్యోమగాములు తెచ్చిన ఆరు నమూనాల ఐసోటోపులను పరీక్షించారు. అంతేకాదు.. భూమి.. చంద్రుడు.. ఉల్కల తాలూకు ఐసోటోపుల పరస్పర నిష్పత్తిని రివర్స్ ఇంజనీరింగ్ గా పేర్కొనే ప్రక్రియ ద్వారా పోల్చారు. దీని ద్వారా కొత్త అంశాల్ని గుర్తించారు. అవేమంటే..

- థెయో మన సౌరకుటుంబం లోపలి భాగంలో ఏర్పడింది.

- అందులోనూ భూమి కంటే సూర్యునికి దగ్గరగా ఉండేది

- సౌర మండలంలో భూ గ్రహం ఉన్న అకర్బన మండల పరిధిలోనే థెయా కూడా ఉండేది.

- భూమి కంటే సూర్యునికి థెయా దగ్గరగా ఉండేది. (అంటే ఇది మరింత వేడిగా.. వాయుమయంగా ఉండేదన్న మాట)

- భూమితో పోలిస్తే చంద్రుడు చాలా పొడిగా ఉండేందుకు ఇదో ముఖ్య కారణమన్న విషయాన్ని తాజా అధ్యయనం గుర్తించింది.