Begin typing your search above and press return to search.

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. ఏపీ అల్లకల్లోలం

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలిస్తున్నారు. రేపు సాయంత్రం వరకు వారికి ఆశ్రయం, భోజనం, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

By:  A.N.Kumar   |   28 Oct 2025 8:49 PM IST
అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. ఏపీ అల్లకల్లోలం
X

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర రూపం దాల్చిన ‘మొంథా’ తుపాను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. సగటున గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తీవ్ర తుపాను ప్రస్తుతం కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పూర్తిగా తీరం దాటడానికి మరో 3 నుండి 4 గంటల సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు తెల్లవారుజాముకల్లా తుపాను పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది.

* తుపాను ప్రభావం.. నష్టం

తీరం తాకిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలుల.. వర్షాల కారణంగా తీర ప్రాంతాల్లోని జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు.

* అధికారుల అప్రమత్తత, సహాయక చర్యలు

తుపాను తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పూర్తి అప్రమత్తత ప్రకటించింది. విపత్తు నిర్వహణ బృందాలను (ఎన్.డి.ఆర్.ఎఫ్ / ఎస్.డి.ఆర్.ఎఫ్) అలర్ట్‌లో ఉంచారు. కోనసీమ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు సురక్షితంగా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలిస్తున్నారు. రేపు సాయంత్రం వరకు వారికి ఆశ్రయం, భోజనం, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

సహాయం - పరిహారం

తుపాను బాధితులకు తక్షణ సహాయంగా రూ. 3,000 ఆర్థిక సహాయం. మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు..

* రాబోయే వాతావరణ అంచనాలు

విపత్తు నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. . ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత ఇది తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ వైపు కదలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

* ప్రజలకు విజ్ఞప్తి

ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. విద్యుత్ సరఫరా అంతరాయం ఎదురైన చోట్ల జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పుకార్లను నమ్మకుండా, కేవలం నమ్మదగిన ప్రభుత్వ వనరుల ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకుని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వ యంత్రాంగం.. విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.