కోస్తాపై మొంథా జల ఖడ్గం
రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూల్, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
By: Satya P | 27 Oct 2025 11:33 PM ISTఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన మొంథా తుఫాను ఉగ్ర రూపం దాల్చింది. ఇది మరింతగా వీర విజృంభణ చేస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని అంటున్నారు. గడిచిన ఆరు గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో మొంథా తుపాన్ కదులుతోంది. దీని ప్రభావంతో మంగళవారం అంతా ఉమ్మడి తొమ్మిది కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. ఇక ఈ మొంథా తుఫాన్ కాకినాడ సమీపంలోని మచిలీపట్నం కళింగపట్నం మధ్య రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
ఫ్లాష్ ఫ్లడ్స్ కి ఆస్కారం :
ఇక మొంథా తుపాన్ ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూల్, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే విశాఖలోనూ ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని వస్తున్న వార్తలు ఒకింత కలవరపెడుతున్నాయి. మరో వైపు చూస్తే మొంథా తుపాన్ నేపధ్యంలో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. గంటకు వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంటున్నారు. మొత్తం ఏపీలోని 26 కొత్త జిల్లాలలో 14 జిల్లాలు రెడ్ అలెర్ట్ లోకి వెళ్ళిపోయాయి అంటే కోస్తా మీదకు దూసుకొస్తున్న. జల ఖడ్గం గా భావించాలి అన్న మాట.
తీరం దాటే క్షణాలు :
ఇదిలా ఉంటే మొంథా తుఫాన్ తీరం దాటే సమయం మీద కూడా వాతావరణ శాఖ సమాచారం అందించింది. మచిలీపట్నం_ కాకినాడ మధ్య ప్రాంతంలో మంగళవారం రాత్రి మొంథా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. . తీరం దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంటున్నాన్నారు. దీని ప్రభావంతో మంగళవారం కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మోంథా తుపాను ఏకంగా రాష్ట్రంలోని 233 మండలాల్లోని 1419 గ్రామాలు అదే విధంగా 44 మున్సిపాలిటీలలో తన ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
