వైసీపీ అధినేతకు తుఫాన్ ఎఫెక్ట్.. జగన్ ఎక్కడ ఉన్నారంటే..?
ఏపీలో మొంథా తుఫాన్ కల్లోలం పుట్టిస్తోంది. తీర ప్రాంతంలో వర్షాలు ధాటిగా కురుస్తున్నాయి.
By: Tupaki Political Desk | 28 Oct 2025 12:50 PM ISTఏపీలో మొంథా తుఫాన్ కల్లోలం పుట్టిస్తోంది. తీర ప్రాంతంలో వర్షాలు ధాటిగా కురుస్తున్నాయి. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ సాయంత్రం లేదా రాత్రికి తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో మరింత అల్లకల్లోలం రేగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో సాధారణ జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా తుఫాన్ ప్రభావానికి గురయ్యారు.
ప్రస్తుతం బెంగళూరులో ఉన్న మాజీ సీఎం జగన్ తుఫాన్ కారణంగా తన విజయవాడ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సివచ్చింది. మొంథా తుఫాన్ కారణంగా ఏపీ మీదుగా వెళ్లే బస్సు, రైలు సర్వీసులను రద్దు చేశారు. అదేవిధంగా విశాఖ-గన్నవరం, హైదరాబాద్-గన్నవరం, గన్నవరం-బెంగళూరు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. సుమారు వంద విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంగళవారం బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన వైసీపీ అధినేత జగన్ విమాన సర్వీసుల రద్దుతో చివరి నిమిషంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు. మళ్లీ విమాన సర్వీసులు పునరుద్ధరించేవరకు ఆయన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. అయితే తుఫానులో ప్రజలకు సహాయ సహకారాలు అందజేయాలని మాజీ సీఎం ఇప్పటికే తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తుఫాన్ కారణంగా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని జగన్ భావించారు. కానీ, ఆయన బెంగళూరులో ఉండిపోవడతో పార్టీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణకు ఈ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ప్రభుత్వ అధికారులకు కార్యకర్తలు సహకరించాలని కూడా జగన్ సూచించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
తుఫాన్ కారణంగా వైసీపీ గతంలో పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం చేస్తున్నది. అదేవిధంగా కల్తీ మద్యంపైనా వైసీపీ శ్రేణులు పోరు సాగిస్తున్నాయి. అయితే తుఫాన్ వల్ల ఈ రెండు కార్యక్రమాలను వాయిదా వేసుకుని పార్టీ శ్రేణులు పూర్తిగా తుఫాన్ బాధితులకు అండగా నిలిచేలా పనిచేయాలని జగన్ అదేశించినట్లు సమాచారం.
