Begin typing your search above and press return to search.

అక్కడ మొంథా విశ్వరూపం

ఏకంగా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, అలాగే సెల్ టవర్లకు తీవ్ర దెబ్బ తగిలింది. రాజోలు పరిసరర ప్రాంతాలు అన్నీ పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయాయి.

By:  Satya P   |   28 Oct 2025 9:07 PM IST
అక్కడ మొంథా విశ్వరూపం
X

మొదటి నుంచి మొంథా తుఫాన్ కాకినాడ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ వచ్చింది. ఈ మధ్యాహ్నం వరకూ అదే పరిస్థితి. దాంతో ముందస్తు ఏర్పాట్లు అన్నీ అక్కడే ఎక్కువగా చేసుకుంటూ వచ్చారు. అయితే సాయంత్రం అవుతూనే మొంథా తన దిశను మార్చుకుంటూ వచ్చింది. అది కాస్తా అమలాపురం వైపుగా సాగుతూ వెళ్ళింది. చివరికి రాత్రి పొద్దుపోయాక మొంథా మొత్తానికి కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద ల్యాండ్ అయింది. దాంతో అక్కడ తన విశ్వరూపాన్ని చూపించింది. తీరం వైపుగా అడుగు పెడుతూనే భారీ విధ్వంసానికి తెర తీసింది.

అంధకారమంతా :

ఏకంగా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, అలాగే సెల్ టవర్లకు తీవ్ర దెబ్బ తగిలింది. రాజోలు పరిసరర ప్రాంతాలు అన్నీ పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయాయి. భారీ చెట్లను సైతం నేల కూల్చుతూ మొంథా తన బలమైన ఉనికిని చాటుకుంటూ తీరం వైపు దూసుకుని వచ్చింది. గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో దూసుకుని వచ్చిన ఈ సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ తో ఇపుడు కోనసీమ జిల్లా మొత్తం చిగురుటాకులా వణుకుతోంది. తీరం తాకిన సమయంలో గంటకు తొంబై నుంచి నూటా పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచడంతో ఈ సూపర్ సైక్లోన్ తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగిస్తోంది.

నాలుగైదు రాష్ట్రాలకు :

సముద్రం వైపు నుని భూమి వైపుగా వచ్చిన మొంథా ప్రభావం ఒక్క ఏపీకే కాదు తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇక మరో ఇరవై నాలుగు గంటల పాటు ఈ ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయి. ఏపీలో చూస్తే కోస్తా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే మొంథా ప్రభావంతో విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, ప్రకాశంతో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అలాగే భారీ ఎత్తున వీస్తున్న ఈదురుగాలులకు చెట్ల నేల కూలాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అలలు ఎగిసిపడుతున్నాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి జన జీవనం పూర్తిగా స్తంభించింది.

ఏడు జిల్లాల్లో హై అలెర్ట్ :

తీరం తాకిన సూపర్ సైక్లోన్ ప్రభావం ఏకంగా ఏపీలో ఏడు జిల్లాల మీద తీవ్రంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. క్రిష్ణ, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ అల్లూరి జిల్లాలలో మొంథా ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందని వెదర్ రిపోర్ట్ తెలియచేస్తోంది. దాంతో ఈ ఏడు జిల్లాలలో జాతీయ రహదారుల మీద వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఇక్కడ తీవ్రంగా వానలు పడతాయని, మిగిలిన చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.