Begin typing your search above and press return to search.

సముద్రుడి ఉగ్ర రూపం...మొంథాని మరిపించేలా !

మొంథా తుఫాన్ ఎట్టకేలకు ఏపీలో తీరాన్ని దాటింది. అంతర్వేదిపాలెం వద్ద అది కాస్తా మంగళవారం రాత్రి ప్రవేశించి అర్ధరాత్రి దాటిన తరువాత పూర్తిగా ల్యాండ్ అయింది.

By:  Satya P   |   29 Oct 2025 12:37 PM IST
సముద్రుడి ఉగ్ర రూపం...మొంథాని మరిపించేలా !
X

మొంథా తుఫాన్ ఎట్టకేలకు ఏపీలో తీరాన్ని దాటింది. అంతర్వేదిపాలెం వద్ద అది కాస్తా మంగళవారం రాత్రి ప్రవేశించి అర్ధరాత్రి దాటిన తరువాత పూర్తిగా ల్యాండ్ అయింది. ఇక అనంతరం మొంథా తుఫాన్ బలహీనపడిపోయింది. అయితే గత కొన్ని రోజులుగా సముద్రంలో ఉంటూ నానా విధాలుగా ఏపీని ఇబ్బంది పెట్టిన మొంథా తుఫాన్ తీవ్ర అల్ప పీడనంగా రూపాంతరం చెందినా సముద్రం మాత్రం ఇంకా శాంతించలేదు. ఏపీలో చాలా చోట్ల చూస్తే సముద్రం ముందుకు దూసుకుని వచ్చింది. తీరాన్ని భారీగా కోసేసింది. దీంతో సాగరుడి ఉగ్ర రూపం చూసి తీర ప్రాంత ప్రజలు భీతిల్లుతున్నారు

ఎందుకిలా అంటే :

సముద్రంలోనే అనేక పీడనాలు ఉంటాయి. అక్కడే మూల కేంద్రం. అందులో ఒకటి మరింతగా బలపడి ఒక తుఫానుగా అవతారం ఎత్తుతుంది. దాని ప్రభావం నాలుగైదు రోజులు ఉంటుంది. అది కాస్తా తీరం దాటి తిరిగి మెల్లగా సముద్రంలోకే వెళ్తుంది. అంటే ఈ అలజడి సముద్రంలోనే అలాగే ఉంటుంది అన్న మాట. తీరం చేరినపుడు తిరిగి సముద్రంలోకి వెళ్ళినపుడు కూడా సముద్రం తీవ్ర ఆటుపోట్లకు గురి అవుతుంది. అదే సమయంలో ఈదురు గాలులు బలంగా వీస్తాయి. మరో వైపు ఈ గాలి వేగానికి అలజడులకు సముద్రం అతలాకుతలం అయి కెరటాలు పెద్ద ఎత్తున ఎగిసిపడతాయి దాంతో పాటు వెనక ఉన్న నీళ్ళన్నీ ముందుకు తోసుకుని వస్తాయి. ఆ జోరులో సముద్రం రెండు అంగలు ముందుకు వేసి తీరాన్ని మరింతగా చొచ్చుకుని వచ్చినట్లుగా కనిపిస్తుంది. తుఫాన్ అనంతరం సముద్రం సాధారణ స్థితికి చేరుకోవడానికి కనీసం రెండు రోజులు పడుతుందని ఒక అంచనా ఉంది.

శ్రీకాకుళం నుంచి :

ఏపీకి పొడవైన తీర ప్రాంతం ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకూ తీరం అంతా ఒకే రేఖ మీద సాగుతుంది. ఇపుడు చూస్తే మొంథా తుఫాన్ తరువాత మొత్తం తొమ్మిది ఉమ్మడి జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం ఒక్కసారిగా కొన్ని అడుగులు ముందుకు జరిగి తీరాన్ని భారీగా తాకుతోంది. దాంతో సముద్రం ముందుకు వచ్చింది అని స్థానిక జనాలు భయపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో డొంకూరు నుంచి ఉమ్మడి నెల్లూఒరు జిల్లా తడ వరకూ ఇదే విధంగా సముద్రం ముందుకు వచ్చి తీరాన్ని వణికించేస్తోంది. బుధవారం ఈ రకమైన పరిస్థితిని చూసి స్థానికంగా నివాసం ఉంటున్న మత్స్యకార కుటుంబాలు తీవ్రంగా భయపడుతున్నారు.

పూజలు చేస్తూ :

తుఫాన్ ఎపుడు వచ్చినా సముద్రం అల్లకల్లోలంగానే ఉంటుంది. అయితే అదే సాగరం మీద జీవనం సాగిస్తూ దాని మీదనే ఆరుగాలం ఆధారపడిన మత్స్యకార కుటుంబాలకు ఇవన్నీ తెలుసు అందుకే సముద్రం ఆగ్రహంగా ఉందని గ్రహించి శాంతించమంటూ పూజలు చేస్తున్నారు. మత్స్యకార మహిళలు పూజలు చేస్తూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాకినాడ తీరంలో చూసినా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ తాళ్ళరేవు వద్ద సముద్రం బీభత్సంగా మారింది. తీరాన్ని పూర్తిగా తవ్వేస్తూ మొత్తం అన్ని కోస్తా జిల్లాలలో సముద్రం చేస్తున్న అలజడికి జనాలు ఉలిక్కిపడుతున్నారు. అయితే ఇదంతా మరి కొన్ని గంటల వరకూ ఉంటుందని ఆ మీదట మెల్లగా పరిస్థితిలో మార్పు కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎవరూ సముద్రం వైపు వెళ్ళవద్దని బీచ్ లకు అసలు పోవద్దని సూచిస్తున్నారు యధాతధంగా వాతావరణం వచ్చేంతవరకూ తగిన జాగ్రత్తలో ప్రజలు ఉండాలని, మత్య్సకారులు అయితే నవంబర్ నెల వచ్చెంతరవకూ ఇళ్ళ వద్దనే ఉండాలని కోరుతున్నారు.