కోస్తా జిల్లాలకు మరో భారీ తుఫాన్
మోంతా తుఫాను నిన్నటికి నిన్న ఏపీకి ఎంతగా భయపెట్టిందో అంతా చూశారు ఈ తుఫాన్ తాకిడికి భారీ పంట నష్టం సంభవించింది.
By: Satya P | 21 Nov 2025 12:48 AM ISTమోంతా తుఫాను నిన్నటికి నిన్న ఏపీకి ఎంతగా భయపెట్టిందో అంతా చూశారు ఈ తుఫాన్ తాకిడికి భారీ పంట నష్టం సంభవించింది. దీంతో పంట పొలాలు అన్నీ పెద్ద చెరువులనే తలపించాయి. ఏకంగా వారం పాటు ఈ తుఫాన్ ఏపీ మొత్తాన్ని అలజడి రేపింది. ఇపుడు మరో భారీ తుఫాన్ ఏపీ జిల్లాలను భయపెడుతోంది.
బంగాళాఖాతంలో మరొకటి :
ఇక తీర ప్రాంతాల ప్రజానీకం మోంతా తుఫాన్ చేదు అనుభవాలను మరచిపోక ముందే ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మలక్కా జలసంధి మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు ఇది ఆ తరువాత పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఈ నెల 24న దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై తుఫానుగా మరింతగా బలపడే అవకాశముందని పేర్కొంటున్నారు. ఆ మీదట మరో 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశముందని అంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఆ జిల్లాలకు అలెర్ట్ :
ఈ అల్ప పీడనం వాయుగుండంగా తుఫానుగా మారే క్రమంలో దక్షిణ కోస్తా జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు కోస్తాలోని కృష్ణ, బాపట్ల వంటి వాటి మీద కూడా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
భారీ వర్షాలు :
ఇక రానున మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే మంగళవారం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 24 తరువాత మరింత ప్రభావం చూపిస్తే మాత్రం ఇంకా హెచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మోంతా తుఫాన్ బారిన పడి ఇంకా రాష్ట్రం అయితే ఏ మాత్రం కోలుకోలేదు, ఇంతలో మరో తుఫాన్ అంటే అటు రైతాంగం ఇటు ప్రజానీకం హడలిపోతున్నారు.
