బాబుకే ఎందుకిలా...కష్టమంతా అలా ?
అయినా పెద్దగా ప్రాణ నష్టం లేకుండా ఈ పెను విపత్తి ముగిసింది అంటే దానికి కారణం బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న కట్టిదిట్టమైన చర్యలు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Satya P | 1 Nov 2025 8:19 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కష్టపడతారు అన్నది తెలిసిందే. ఆయన పని విషయంలో కచ్చితంగా ఉంటారు. తాను నిద్రపోరూ అవతల వారిని నిద్రపోనీయరు. దానికి నిలువెత్తు ఉదాహరణ ఈ మధ్యనే ఏపీని గడగడలాడించిన మొంథా తుఫాన్. ఆ తుఫాన్ ఏపీలోనే తీరం దాటింది. అయినా పెద్దగా ప్రాణ నష్టం లేకుండా ఈ పెను విపత్తి ముగిసింది అంటే దానికి కారణం బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న కట్టిదిట్టమైన చర్యలు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.
పాజిటివిటీకి షాక్ ఇచ్చేలా :
మొంథా తుఫాన్ సమయంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సక్రమంగా పనిచేసింది అన్నది జనాల్లోకి వెళ్ళింది. ఒక విధంగా పాజిటివిటీ సర్కార్ మీద బాగా పెరిగింది. ఈ గ్రాఫ్ ఇలా ఉండగానే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ఒక ఆలయం వద్ద తొక్కిసలాట, తొమ్మిది మంది అమాయక భక్తులు మరణం. దాంతో ఏపీలో ఇపుడు ఇది హాట్ టాపిక్ అయింది భక్తుల ప్రాణాలు ఒక పవిత్ర దినం నాడు పోయారే అని ఏపీ అంతా నిర్ఘాంత పోవాల్సి వచ్చింది. ఇది జాతీయ స్థాయిలో బిగ్ డిబేట్ గా ముందుకు వచ్చింది. కేంద్రం కూడా వెంటనే రియాక్ట్ అయి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది.
వరస ఘటనలు :
ఒకే ఏడాది లో ఆలయాల వద్ద వరస ఘటనలు చోటు చేసుకోవడం ఒక పెద్ద విషాదం. ఈ మూడు సందర్భాలలో అమాయక భక్తులే ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది జనవరి 8న ముక్కోటి ఏకాదశి టికెట్ల కోసం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు అమాయక భక్తులు దుర్మరణం పాలు అయ్యారు. ఆ తరువాత చూస్తే ఏప్రిల్ 30న విశాఖలో అప్పన్న స్వామి చందనోత్సవం వేళ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు విడిచారు. ఇపుడు చూస్తే నవంబర్ నెల మొదటి రోజునే ఒక దారుణం జరిగిపోయింది. తొమ్మిది మంది ఇప్పటికి మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఏమిటీ విషాదాలు అందునా దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఈ రకమైన మరణాలు సంభవించడం ఏమిటి అన్నదే చర్చగా ఉంది. కాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే చంద్రబాబు విభజన ఏపీకి తొలిసారి సీఎం గా ఉన్నపుడు పుష్కరాలలో జరిగిన ఘోరకలి కళ్ళ ముందు ఇంకా ఉంటుంది. ఇవన్నీ ఎవరూ కావాలని చేయరు, భారీ ఎత్తున జనాలు ఒక చోట పోగు అయినపుడు జరగరానిది జరిగిపోతూంటుంది.
శ్రమ పరిశ్రమ అంతా :
ఇక చంద్రబాబు ఏపీని ఎంతో ముందుకు తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు దాని కోసం ఆయన రాత్రీ పగలు కష్టపడుతున్నారు అయితే బాబు పడుతున్న శ్రమ పరిశ్రమని పూర్వ పక్షం చేసేలా ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం అన్నది నిజంగా ఆలోచిచాల్సిన విషయమే. ఏపీలో చూసుకుంటే ప్రభుత్వం సంక్షేమ పధకాలు కానీ జనాల్లో గ్రాఫ్ పెరుగుతున్న సందర్భాలు కానీ ఉన్నపుడు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతోంది. చంద్రబాబు విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది.
ప్రకృతితో సవాల్ :
ఇక చంద్రబాబు పాలనలో ఎపుడూ ప్రకృతి పగ పడుతూనే ఉంటుంది. 2014లో హుదూద్ తుఫాన్ వస్తే 2018లో తిత్లీ అలాగే 2024లో అధికారంలోకి వస్తూనే బుడమేరు పొంగి విజయవాడ అతలాకుతలం అవడం, ఇపుడు చూస్తే మొంథా తుఫాన్ ఇలా ఎన్నో పెద్ద భారీ తుఫాన్లు ఏపీని సవాల్ చేశాయి. సవాళ్ళు సంక్షోభాలను తాను సోపానాలుగా తీసుకుంటాను అని బాబు అంటూంటారు. అందుకే ఆయనకే సవాళ్ళు అలా ఎదురవుతున్నాయా అన్నది ఒక చర్చ. ఏది ఏమైనా తాజాగా కాశీబుగ్గ లో జరిగిన ఘటన అయితే బాబుని ఎంతగానో కలచివేసిందని చెప్పాలి. మొంథా తుఫాన్ లో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడుకున్నాం, కానీ ఇపుడు భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఇదంతా నా మనసును బాధపెడుతోంది అని అన్నారు. మొత్తం మీద చూస్తే వ్యవస్థలో తప్పిదాలు ప్రకృతి ప్రకోపాలు ఇవన్నీ కలసి బాబుకు కొత్త సవాళ్ళను తెస్తున్నాయని అంటున్నారు.
