పని గంటలు తీసికట్టు...ముగిసిన పార్లమెంట్ మీట్ !
నానాటికీ పార్లమెంట్ లో చర్చలు జరిగే సమయం తీసికట్టుగా మారుతోంది. దానికి గురువారంతో ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక ఉదాహరణ
By: Satya P | 22 Aug 2025 9:25 AM ISTనానాటికీ పార్లమెంట్ లో చర్చలు జరిగే సమయం తీసికట్టుగా మారుతోంది. దానికి గురువారంతో ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక ఉదాహరణ. మొత్తం సభ జరగాల్సిన పని గంటలు 120 గా ఉంటే అందులో నాలుగవ వంతు అంటే కేవలం 37 గంటలు మాత్రమే పార్లమెంట్ సమావేశం జరిగింది. ఈసారి సమావేశాలు అత్యధిక కాలం వర్షార్పణం అయ్యాయని అంటున్నారు. ప్రతీ రోజూ సభ మొదలవుతూనే గందరగోళం వరస వాయిదాలు చివరికి మరుసటి రోజుకు వాయిదా పడడం పరిపాటిగా మారింది అని విశ్లేషిస్తున్నారు
అదే హైలెట్ గా :
ఈసారి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో హైలెట్ ఏమిటి అంటే జూలై 21న సభ మొదలవుతూనే రాజ్యసభ చైర్ పర్సన్ గా అధ్యక్ష స్థానం అధిరోహించిన జగదీప్ ధంఖర్ అదే రోజు రాత్రి కల్లా రాజీనామా చేసి మాజీ అయిపోయారు. ఇది అందరికీ ఆశ్చర్యపరచింది. ఆ తర్వాత ఒక వైపు అంతా ఉప రాష్ట్రపతి ఎన్నికల మీదనే అధికార విపక్షాలు సమాలోచనలు జరపడం ఆ విధంగానే ఎత్తులు పై ఎత్తులు వేయడం జరుగుతూ వచ్చింది.
ఆపరేషన్ సింధూర్ పైన చర్చ :
ఈసారి సమావేశాలలో అత్యధిక సమయం జరిగిన చర్చ ఏదైనా ఉంది అనుకుంటే అది ఆపరేషన్ సింధూర్ మీదనే అని చెప్పాలి. ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్ సహా విపక్షాలు అధికార బీజేపీ మీద విమర్శలు చేశాయి. నడి మధ్యలో భారత సైనికులను యుద్ధం నుంచి వెనక్కి వచ్చేలా చేశాయని తప్పుపట్టాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్ష నేత రాహుల్ గాంధీల మధ్య కూడా వాడీ వేడిగా చర్చ సాగింది. పాకిస్తాన్ ని గుడ్డిగా కాంగ్రెస్ నమ్ముతోంది అని మోడీ డైరెక్ట్ ఎటాక్ చేస్తే భారత పైలట్లు సామర్థ్యం మీద కేంద్ర ప్రభుత్వం తక్కువ అంచనాతో ఉందని రాహుల్ గాంధీ గట్టిగానే విమర్శలు గుప్పించారు
ప్రతీ రోజూ అదే ఇష్యూ :
ఇక బీహార్ లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ మీద ప్రతీ రోజూ లోక్ సభ రాజ్యసభలలో విపక్షాలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ అంశం మీద చర్చించాలని వారు డిమాండ్ చేయడం అలా కుదరదని సభాపతులు తిరస్కరించడంతో సభలో గందరగోళం జరగడం ఒక విధానంగా మారిపోయింది అని అంటున్నారు. ఓట్ల చోరీ అన్న అంశం కూడా పార్లమెంట్ ని బాగా కుదిపేసింది. ఇక పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీసు దాకా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి ఎంపీలు అంతా ప్రదర్శనగా వెళ్లడం కూడా ఈసారి సమావేశాలలో జరిగిన మరో రాజకీయ అంశం.
ఉప రాష్ట్రపతి ఎన్నిక :
ఒక వైపు సభ సాగుతుండగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరి వ్యూహాలను వారు రూపొందించారు. దక్షిణాది నుంచే ఎన్డీయే ఇండియా కూటమి తమ అభ్యర్ధులను నిలబెట్టాయి. తమిళనాడుకు చెందిన సీపీ రాధాక్రిష్ణన్ ని ఎన్డీయే తమ అభ్యర్ధిగా ప్రకటిస్తే ఇండియా కూటమి తెలంగాణాకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ముందు పెట్టింది దాంతో జాతీయ కూటముల పోరు ఈసారి సౌత్ ఫోకస్ తీసుకుంది. ఈ పార్లమెంట్ సెషన్ సందర్భంగా కూడా ఇది మరో విశేషం అని అంటున్నారు.
చర్చలు లేకుండానే :
ఈసారి సభలలో పెద్దగా చర్చలు లేకుండానే అనేక బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభ ఈసారి ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025కి ఆమోదం తెలిపింది. అలాగే, తీవ్రమైన నేరారోపణలపై 30 రోజుల పాటు జైల్లో ఉంటే కనుక ప్రధానులు అయినా ముఖ్యమంత్రులు, మంత్రులు అయినా తప్పనిసరిగా రాజీనామా చేయాలని నిర్దేశిస్తూ రూపొందించిన ఒక కీలక బిల్లుని లోక్ సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టడం ఈసారి సభలో ఒక హైలెట్. అదే విధంగా చూస్తే లోక్ సభ 12 రాజ్యసభ 14 దాకా బిల్లులను ఈసారి ఆమోదించాయి. సభ సరిగ్గా ఈసారి సాగలేదని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. బొత్తిగా 37గంటల పాటు సభా కార్యక్రమాలు జరిగాయంటే సభ్యులు ఆలోచించాలని ఆయన కోరారు. మొత్తానికి వర్షాకాలం సభలో అధిక సమయం వృధా అయింది అని మేధావులు కూడా అంగీకరిస్తున్నారు.
