ఒకరికి పైగా రిలేషన్‌లు.. కొత్త తరం ప్రేమకు కొత్త నిర్వచనం
ప్రేమ అంటే ఒక బంధం మాత్రమే కాదు.. అది ఇద్దరి మనసుల మధ్య రాసుకునే ఒక రహస్య ఒప్పందం. కానీ కాలం మారుతోంది..
By: A.N.Kumar | 28 March 2026 3:02 PM ISTప్రేమ అంటే ఒక బంధం మాత్రమే కాదు.. అది ఇద్దరి మనసుల మధ్య రాసుకునే ఒక రహస్య ఒప్పందం. కానీ కాలం మారుతోంది.. ఆ ఒప్పందపు రాతలు మారుతున్నాయి. నిన్నటి వరకు 'నువ్వు-నేను' అన్న ఏకాంతంలో వెతుక్కున్న సంతోషం.. నేడు 'మనం-మరెందరో' అన్న సరికొత్త నిర్వచనాల వైపు అడుగులు వేస్తోంది. గుండె లోతుల్లో దాచుకున్న అసూయను చంపుకుని పారదర్శకమైన నిజాయితీతో పంచుకునే 'పాలియామరీ' ఒకవైపైతే.. గుండె రగులుతున్నా భాగస్వామి సంతోషం కోసం మౌనంగా అంగీకరించే 'టోలియామరీ' మరోవైపు. కేవలం శరీరాల కలయికే కాదు.. మారుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో మనసుల మధ్య చిక్కుముడులు విడిపోతున్నాయా? లేక కొత్త ముడులు పడుతున్నాయా? అంతుచిక్కని ఈ బంధాల మాయాజాలంపై ఒక ప్రత్యేక కథనం...
మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, భావోద్వేగాలు... బంధాల నిర్వచనాలు కూడా సమూలంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు 'ప్రేమ' అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఒక పవిత్రమైన ఏకాంత బంధం. కానీ నేటి ఆధునిక యుగంలో ముఖ్యంగా యువతలో వ్యక్తిగత స్వేచ్ఛ భిన్నమైన జీవనశైలి పట్ల పెరుగుతున్న ఆసక్తి కారణంగా సరికొత్త డేటింగ్ పోకడలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో డేటింగ్ ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తున్న రెండు పదాలు “పాలియామరీ” , “టోలియామరీ”. ఈ ఆధునిక బంధాల వెనుక ఉన్న లోతు, భావోద్వేగ సంఘర్షణలు.. సామాజిక కోణాలు చర్చనీయాంశమవుతున్నాయి.
పాలియామరీ.. పారదర్శకమైన బహుళ బంధాల ప్రయాణం
పాలియామరీ అంటే కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు.. ఇది ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మందితో లోతైన భావోద్వేగ, ప్రేమపూర్వక సంబంధాలను కలిగి ఉండటం. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం 'నిజాయితీ'. ఇందులో పాల్గొనే ప్రతి భాగస్వామికి తన పార్ట్‌నర్ ఇతర వ్యక్తులతో కలిగి ఉన్న సంబంధాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఇది రహస్యంగా చేసే 'చీటింగ్' కాదు. అందరి సమ్మతితో సాగే ప్రయాణం. ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడం అనేది వినడానికి వింతగా ఉన్నా పాలియామరీని అనుసరించేవారు దీనిని ఒక కళగా భావిస్తారు. మానవ సహజమైన అసూయ ఈ బంధంలో పెద్ద అడ్డంకి.. తన వ్యక్తిని వేరొకరితో పంచుకోవడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు.
టోలియామరీ.. మౌనంగా భరించే ప్రేమ
పాలియామరీలో అందరి అంగీకారం ఉంటే టోలియామరీలో ఒక రకమైన 'సర్దుబాటు' కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన భాగస్వామికి బయట సంబంధాలు ఉన్నాయని తెలిసినా బంధాన్ని తెంచుకోలేక లేదా ఇతర కారణాల వల్ల దానిని మౌనంగా అంగీకరించడాన్ని టోలియామరీగా పిలుస్తున్నారు. ఇది ఒక రకమైన 'సహనం' మీద ఆధారపడి ఉంటుంది. "నా భాగస్వామి వేరే చోట సంతోషాన్ని వెతుక్కుంటున్నా చివరికి నా దగ్గరకే వస్తున్నారు కదా" అనే భావన లేదా సామాజిక గౌరవం కోసం బంధాన్ని కాపాడుకోవాలనే తపన ఇందులో కనిపిస్తుంది. ఇది పాలియామరీ అంత ఆరోగ్యకరమైనది కాకపోవచ్చు, ఎందుకంటే ఇందులో ఒక భాగస్వామి మానసిక వేదనను అనుభవించే అవకాశం మెండుగా ఉంది.
సామాజిక మార్పు.. డిజిటల్ ప్రభావం
భారతీయ సమాజంలో ఇవి కొత్త విషయాలేమీ కావు. చరిత్రలో రాజుల కాలం నుండి వివిధ రూపాల్లో ఇవి ఉనికిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటికి ప్రత్యేక పేర్లు రావడం.. ఇంటర్నెట్ వేదికగా వీటిపై చర్చలు జరగడం వల్ల ఇవి "ట్రెండ్స్"గా మారుతున్నాయి. యువత ఇప్పుడు తమ కోరికలను, భావాలను దాచుకోకుండా బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. ఒకే వ్యక్తితో జీవితాంతం ఉండటం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చనే వాదనను వారు ముందుకు తెస్తున్నారు. "సంబంధం ఏదైనా సరే.. అది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య ఉండే ఒక 'అగ్రిమెంట్'. అందులో మోసం లేనంత వరకు అది వారి వ్యక్తిగతం " అనేది నేటి యువత అభిప్రాయం.
నిపుణులు ఏమంటున్నారు?
మనస్తత్వవేత్తలు.. సంబంధ నిపుణులు ఈ మార్పులను జాగ్రత్తగా గమనిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం పార్ట్‌నర్స్ మధ్య స్పష్టమైన మాటలు లేకపోతే ఇటువంటి బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. అందరూ పాలియామరీని స్వీకరించలేరు. కొందరు వ్యక్తులు భావోద్వేగ పరంగా కేవలం ఒకరికే అంకితం కావాలని కోరుకుంటారు . బలవంతంగా అంగీకరించే టోలియామరీ వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ప్రేమకు కొత్త గమ్యం ఎక్కడ?
ప్రేమ అనేది ఒక మహా సముద్రం. దాని లోతును కొలవడానికి ఏ ఒక్క నిర్వచనమూ సరిపోదు. పాలియామరీ అయినా, టోలియామరీ అయినా.. చివరికి ప్రతి మనిషి వెతుక్కునేది మనశ్శాంతిని.. తోడుని మాత్రమే. సంప్రదాయ బంధాలు ఇచ్చే భద్రత కావాలా? లేక ఆధునిక పోకడలు ఇచ్చే స్వేచ్ఛ కావాలా? అనేది వ్యక్తుల ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. సమాజం వీటిని ఎలా చూసినా, మనుషుల మధ్య ఉండాల్సిన ప్రాథమిక సూత్రం మాత్రం 'గౌరవం'.
ఈ మారుతున్న సమీకరణాలు మన కుటుంబ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రేమలోని పవిత్రతను ఎలా మారుస్తాయో వేచి చూడాలి.
