Begin typing your search above and press return to search.

షాజహాన్ కోటలో కోతుల 'సామ్రాజ్యం'.. తాజ్ మహల్ ను ఆక్రమించేశాయి..

ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్ పరిసరాల్లో కోతుల బెడద పెరిగింది. ఈస్ట్, వెస్ట్, రాయల్ గేట్ల వద్ద గుంపులుగా సంచరిస్తున్న కోతుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్యాటకుల బ్యాగులు, కళ్లద్దాలు వంటి వస్తువులను లాక్కెళ్తాయనే భయంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతుల బెడదను నియంత్రించాలని నెటిజన్లు కోరుతున్నారు.

By:  A.N.Kumar   |   27 Nov 2026 11:11 AM IST
షాజహాన్ కోటలో కోతుల సామ్రాజ్యం.. తాజ్ మహల్ ను ఆక్రమించేశాయి..
X

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను చూడాలని ఎవరికి ఉండదు? మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రేయసి ముంతాజ్ కోసం నిర్మించిన ఆ పాలరాతి కట్టడం ముందు నిలబడి ప్రేమగా ఓ సెల్ఫీ దిగాలని దేశవిదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు ఆగ్రాకు క్యూ కడుతుంటారు. అయితే ఈ మధ్య తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లే వారికి ఒక సరికొత్త అద్భుతమైన అదనపు ఆకర్షణ స్వాగతం పలుకుతోంది. అది మరేదో కాదు.. సాక్షాత్తూ వానర సైన్యం..

ఇప్పటివరకు తాజ్‌మహల్ పరిసరాల్లో ప్రేమజంటలు.. కెమెరామెన్లు.. గైడ్ల హడావుడి మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఈస్ట్ గేట్, వెస్ట్ గేట్, రాయల్ గేట్.. ఇలా ఎటు చూసినా కోతుల మందలు దర్జాగా విహరిస్తున్నాయి. పక్కనే ఉన్న గార్డెన్లలో ఓ భారీ వానర సేన కవాతు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. అసలు పర్యాటకులు తాజ్‌మహల్ అందాలను చూడటానికి వెళ్తున్నారా? లేక కోతుల విన్యాసాలను తిలకించడానికి వెళ్తున్నారా? అంటూ తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తున్నారు.

వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో ఆశలతో ఆగ్రా చేరుకుంటున్న విదేశీ పర్యాటకులకు ఈ వానరాల హంగామా చుక్కలు చూపిస్తోంది. పాలరాతి సౌధం ముందు రొమాంటిక్‌గా ఫోజులిద్దామని కెమెరా ముందు నిలబడేలోపే వెనుక నుంచి ఏ కోతి వచ్చి చేతిలోని బ్యాగునో.. కళ్లద్దాలనో ఎత్తుకెళ్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. పర్యాటకులు తాజ్‌మహల్‌ను ఆస్వాదించడం పక్కన పెట్టి తమ వస్తువులను కాపాడుకోవడానికి కోతి కొమ్మచ్చి ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రేమకు చిహ్నమైన చోట ఇప్పుడు భయం కూడా తోడైందన్నమాట.. ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో మీమ్స్.. కామెంట్ల వర్షం కురుస్తోంది.

వానరాలను గట్టిగా కొట్టలేం.. అలాగనే అందాలు చూడకుండా ఉండలేం.. వానరాలను హనుమంతుడి స్వరూపంగా మనం చూస్తాం కాబట్టి చాలా మంది కోతులకు దూరంగా వెళతారు. కానీ చాలా ఖర్చు పెట్టుకొని వచ్చి తాజ్ మహల్ అందాలు చూద్దామనే వారికి ఈ కోతుల బెడద నిజంగానే ఆశానిపాతంగా మారుతోంది. అధికారులు ఏ కొండెంగలను తీసుకొస్తారో.. కోతులను పట్టుకునే వారిని పట్టుకొస్తారో కానీ తాజ్ మహల్ అందాలను చూడడానికి వీలు కల్పించాలని కోరుతున్నారు.

ఆగ్రాలో ఇప్పుడు ప్రేమ పావురాల కంటే వానర వీరుల హవానే ఎక్కువగా నడుస్తోంది. మీరు కూడా త్వరలో తాజ్‌మహల్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే పాలరాతి అందాలను చూడటానికి కళ్లు.. మీ వస్తువులను కాపాడుకోవడానికి చేతులు.. రెండూ ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచుకోండి మరీ..