సౌత్ సినిమాలో కుంభమేళా బ్యూటీ
ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఓవర్‌నైట్ సెన్సేషన్ గా మారింది పూసలమ్మే అమ్మాయి మోనాలిసా.
By: Sivaji Kontham | 27 Aug 2025 11:41 PM ISTప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఓవర్‌నైట్ సెన్సేషన్ గా మారింది పూసలమ్మే అమ్మాయి మోనాలిసా. మధ్య ప్రదేశ్‌లోని ఒక గ్రామానికి చెందిన ఈ యువతి అందచందాలు, ఆకర్షణకు యువతరం ఫిదా అయిపోయింది. ఆరంభం తన అందం, సొగసుతో మతులు చెడగొట్టిన ఈ బ్యూటీ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో మోనాలిసా పేరుతో ఇవన్నీ వెబ్ లోకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు మోనాలిసాకు అవకాశాలిస్తామంటూ ముందుకు వచ్చారు.
కానీ మోనాలిసా నటనారంగేట్రం అంత సులువుగా జరగలేదు. తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఒక వివాదం కారణంగా పూర్తిగా చిక్కుల్లో పడ్డాడు. దీంతో మోనాలిసా మొదటి సినిమా అర్థాంతరంగా మధ్యలోనే నిలిచిపోయింది. ఇంతలోనే ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మోనాలిసా సౌత్ లో అడుగుపెడుతోంది. ముందుగా మలయాళంలో కైలాష్ లాంటి సీనియర్ హీరో సరసన మోనాలిసా అవకాశం అందుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మనోరమ ఆన్ లైన్ వివరాల ప్రకారం.. మోనాలిసా తన మొదటి మలయాళ చిత్రం 'నాగమ్మ' కోసం సంతకం చేసింది. కైలాష్ ఈ చిత్రంలో కథానాయకుడు. కొచ్చిలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. హిముచ్రి ఫేం పి. బిను వర్గీస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. కొత్త ఫేస్ మోనాలిసాతో అనుభవజ్ఞుడైన నటుడు కైలాష్ కలయిక రీఫ్రెషింగ్ గా ఉంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి షూటింగ్ ప్రారంభం కానుంది. నీల తామర చిత్రంతో కైలాష్ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నటుడిగా అతడు కెరీర్ పరంగా బిజీగా మారారు. ప్రస్తుతం మోనాలిసాతో కలిసి నటించడం ఆసక్తిని పెంచుతోంది.
మోనాలిసా భోంస్లే మధ్య ప్రదేశ్ కి చెందిన అమ్మాయి. అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. మహా కుంభమేళా సమయంలో గంగా నది ఒడ్డున పూసల దండలు అమ్ముతుండగా ఫోటోగ్రాఫర్లు గమనించారు. మోనాలిసా సహజ అందానికి ముగ్దులై తన ఫోటోలు, వీడియోలు తీసి వైరల్ చేసారు.ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా `ది డైరీ ఆఫ్ మణిపూర్` అనే చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. కానీ మిశ్రా వివాదంలో చిక్కుకోవడంతో ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత సంగీత వీడియో సాద్గిలో కనిపించింది. సింగర్ ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి ఈ పాటలో కనిపించింది. ఇప్పుడు నాగమ్మతో మోనాలిసా దక్షిణాది సినీపరిశ్రమలోప్రవేశించింది. తొందర్లోనే టాలీవుడ్ లోను ఈ లక్కీ గాళ్ అడుగుపెడుతుందని అంచనా వేస్తున్నారు.
