Begin typing your search above and press return to search.

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో ట్విస్ట్.. భర్తకు రిలీఫ్, మధ్యప్రదేశ్ పోలీసులకు షాక్

దీనిపై మోనాలిసా భర్తను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, మోనాలిసా సమర్పించిన పత్రాలు ఆధారంగా ఆమె మేజర్ గానే భావించవచ్చునని కేరళం హైకోర్టు అభిప్రాయపడింది.

By:  Tupaki Gallery Desk   |   4 Jun 2026 12:00 PM IST
కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా కేసులో ట్విస్ట్.. భర్తకు రిలీఫ్, మధ్యప్రదేశ్ పోలీసులకు షాక్
X

సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. మధ్యప్రదేశ్‌లో నమోదైన కిడ్నాప్, పోక్సో కేసులపై మోనాలిసా, ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్ కేరళం హైకోర్టును ఆశ్రయించారు. మోనాలిసా మైనర్ అని, ఆమె వివాహం చెల్లదని తల్లిదండ్రులు సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ లో కేసు పెట్టారు. దీనిపై మోనాలిసా భర్తను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, మోనాలిసా సమర్పించిన పత్రాలు ఆధారంగా ఆమె మేజర్ గానే భావించవచ్చునని కేరళం హైకోర్టు అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు నుంచి ఫర్మాన్ కు రక్షణ కల్పిస్తూ ట్రాన్సిట్ బెయిలు మంజూరు చేసింది.

కుంభమేళా సమయంలో ఒక సాధారణ వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది మోనాలిసా. ఆ తర్వాత ఆమె కేరళకు చెందిన ఫర్మాన్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఈ కథ అనూహ్య మలుపు తిరిగింది. మోనాలిసా తల్లిదండ్రులు తమ కుమార్తె ఇంకా మైనర్ అని, ఆమెను ఫర్మాన్ కిడ్నాప్ చేశాడంటూ మధ్యప్రదేశ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్‌పై కిడ్నాప్ తోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఈ జంట రక్షణ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించింది.

కేరళ హైకోర్టులో వాడీవేడీ వాదనలు

ఈ కేసు కేరళ హైకోర్టు ముందుకు వచ్చినప్పుడు ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. మధ్యప్రదేశ్ పోలీసుల తరఫున హాజరైన అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ రాజు కోర్టులో గట్టిగా వాదించారు. మోనాలిసా సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ నకిలీదని, ఆమె ఇంకా మైనరేనని, అందువల్ల ఫర్మాన్‌కు బెయిల్ ఇవ్వకూడదని కోరారు. అయితే అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ రాజు వాదనలను కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. మోనాలిసా సమర్పించిన విద్యార్హతలు, ఇతర అధికారిక సర్టిఫికెట్లను ప్రాథమికంగా పరిశీలిస్తే ఆమె మేజర్ అని స్పష్టమవుతోందని కోర్టు పేర్కొంది.

భర్త ఫర్మాన్‌కు లభించిన ఊరట

సర్టిఫికెట్ల ప్రకారం మోనాలిసా మేజర్ అనే నిర్ధారణకు వచ్చిన హైకోర్టు, ఆమె భర్త ఫర్మాన్‌కు నెల రోజుల పాటు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు, అలాగే ఈ లోగా వారు మధ్యప్రదేశ్‌లోని సంబంధిత కోర్టును ఆశ్రయించి రెగ్యులర్ బెయిల్ పొందేందుకు ఈ నెల రోజుల సమయం ఉపయోగపడనుందని చెబుతున్నారు. కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశం తాత్కాలిక ఉపశమనం మాత్రమే అయినప్పటికీ, మోనాలిసా 'మేజర్' అనే కోర్టు ప్రాథమిక అభిప్రాయం ఈ కేసులో ఫర్మాన్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.