ఇరాన్ పగ్గాలు చేపట్టనున్న రహస్య వారసుడు...తండ్రి వారసత్వాన్ని ముజ్తబా ఎలా నిలబెడతారు?
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది.
By: Tupaki Political Desk | 4 March 2026 7:00 PM ISTఅమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఇప్పుడు పాలనా పగ్గాలను ఖమేనీ కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీకి అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవమేదీ లేని ముజ్తబా.. త్వరలోనే సుప్రీంలీడర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు అక్కడి వార్తా పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.
ఆయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే ముజ్తబా. 1969లో ఇరాన్‌లోని మషాద్‌లో జన్మించారు. ముజ్తబా పదేళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా 1979లో ఇస్లామిక్ విప్లవం జరిగింది. ఆ సమయంలో ఖమేనీ కుటుంబం రాజకీయంగా ఎదిగింది. ఆ తర్వాత వీరి కుటుంబం టెహ్రాన్‌లో స్థిరపడింది. కోమ్‌లోని సెమినరీస్‌లో మత విద్యను అభ్యసించిన ముజ్తబా క్లెరికల్ ర్యాంక్‌కు చేరుకున్నారు. కానీ, అత్యున్నత ర్యాంక్ అయిన ఆయతుల్లాను అందుకోలేకపోయారు. అయినా సుప్రీంలీడర్ కార్యాలయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు.
ఐఆర్‌జీసీతో బలమైన సంబంధాలు..
1980ల్లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ముజ్తబా పాల్గొన్నారు. ఆ అనుభవమే ఇరాన్ సైన్యానికి ఆయనను దగ్గర చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ)తో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ముజ్తబాకు సుప్రీం పదవి దక్కడానికి ఇదీ ఓ కారణం కావచ్చని విశ్లేషకులు చెప్తుంటారు. సాధారణంగా సుప్రీంలీడర్ నియామకాన్ని చేపట్టేందుకు 88 మంది షియా మత పెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్) ఉంటుంది. ఇందులో సభ్యులను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని ఈ కమిటీ భావిస్తుంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ముజ్తబా నియామకానికి ఈ కమిటీలోని కొందరు సుముఖంగా లేరని, కానీ ఐఆర్‌జీసీ ఒత్తిడితోనే ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముజ్తబా ఇప్పటి వరకు ఇరాన్‌లో అధికారిక పదవులేవీ చేపట్టలేదు. బహిరంగ ప్రసంగాల్లోనూ అరుదుగా కనిపించేవారు. అయినా రాజకీయ నియామకాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో తెర వెనుక కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
ఆంక్షలు ఉన్నా సంపన్న సామ్రాజ్యం
ముజ్తబా ఖమేనీపై 2019లో అమెరికా ఆంక్షలు విధించింది. అయినా ఆయన ప్రపంచ వ్యాప్తంగా సంపన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే గాక.. పశ్చిమ మార్కెట్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు గతంలో పలు కథనాలు వెలువడ్డాయి. ముజ్తబా నికర సంపద ఎంతనే దానిపై స్పష్టత లేదు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయని పలు పత్రికల్లో కథనాలు ఉన్నాయి. స్విస్ బ్యాంకు ఖాతాల్లో పెద్దఎత్తున డిపాజిట్లతో పాటు.. బ్రిటన్‌లో 138 మిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీ ఉన్నట్లు సమాచారం.
దాడుల్లో భార్య మృతి..?
ఇరాన్ సంప్రదాయ వాద రాజకీయ నాయకుడు ఘోలమ్ అలీ కుమార్తె జహ్రాను ముజ్తబా 2004లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. వీరి కుటుంబం గురించి బయటి ప్రపంచానికి తెలియదు. అయితే, ఇటీవల ఇజ్రాయెల్-అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ముజ్తబా భార్య కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేదు. ఈ దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మరణించినట్లు సమాచారం.
