Begin typing your search above and press return to search.

ట్రంప్ లో అసహనం ప్లస్ అసంతృప్తి...కఠినాత్ముడు కొత్త లీడర్

ఇరాన్ అంతర్గతంగా ఖమేనీ పాలన ఎలా ఉంది, అక్కడి పరిస్థితులు ఏమిటి అన్నది వేరే చర్చ.

By:  Satya P   |   10 March 2026 8:33 PM IST
ట్రంప్ లో అసహనం ప్లస్ అసంతృప్తి...కఠినాత్ముడు కొత్త లీడర్
X

ఇరాన్ అంతర్గతంగా ఖమేనీ పాలన ఎలా ఉంది, అక్కడి పరిస్థితులు ఏమిటి అన్నది వేరే చర్చ. కానీ ఒక దేశంగా తన మీదకు ఏకంగా అగ్ర రాజ్యమే దండెత్తి వచ్చినపుడు అది కూడా తొలి రోజు తొలి గంటలలోనే తమ సుప్రీం లీడర్ ని హత్య చేసి సేనాని లేని సైన్యంగా మార్చి కకావికలం చేసినపుడు చూపించిన పోరాట పటిమ మాత్రం ప్రపంచానికి స్పూర్తిదాయకమే అని చెప్పాలి. నిజానికి తలకాయ లేని మొండెం మాదిరిగా మారిన ఇరాన్ ఇక ఏమి చేస్తుంది అగ్ర రాజ్యం ముందు మోకరిల్లడం మాత్రమే గత్యంతరం తప్ప అని అంతా అనుకున్న నేపథ్యం అయితే ఫిబ్రవరి 28న ఉంది. కానీ గత పది రోజులుగా కసిగా ఇరాన్ పోరాడుతోంది. వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. తన మొత్తం శక్తిని కూడగట్టుకుని యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, ముగించేది మాత్రం మీరు కాదు అది మేమే అని ఇరాన్ బిగ్ సౌండ్ చేస్తోంది.

కొత్త దళపతిగా :

అక్కడితో ఇరాన్ ఏ మాత్రం ఆగడం లేదు. తమ దేశానికి కొత్త దళపతిగా సుప్రీం లీడర్ గా ఖమేనీ రెండవ కుమారుడు అయిన ఆయతుల్లా మోజ్తాబా ఖమేనీని ఎన్నుకుంది. ఆ విధంగా ఇరాన్ ఎక్కడా తగ్గేది లేదని అమెరికాకు పెను సవాల్ విసిరింది. ఇరాన్ ని తాము బాగు చేస్తామని అక్కడ కొత్త నాయకత్వాన్ని తామే ఎంపిక చేస్తామని అమెరికా ఎంతో కలలు కన్నది. ఇరాన్ లో ఖమేనీల పాలన అంతమొందించామని ఆ దేశం తమకు తలొగ్గినట్లే అని కూడా భావించింది. అయితే తాజా పరిణామాలు మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మంటెక్కించేలా ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ట్రంప్ లో తీవ్ర అసంతృప్తి అసహనం కూడా కనిపిస్తోంది అంటున్నారు.

బతుకుతాడో లేడో అంటూ :

తాము చెప్పిన వారు కాకుండా సుప్రీం లీడర్ గా ఖమేనీ వారసులను ఎన్నుకుంటే ఊరుకునేది లేదని అమెరికా చెబుతూ వస్తోంది. అంతే కాదు అలా ఎవరు సుప్రీం లీడర్ అయినా వారిని చంపేస్తామని కూడా చెప్పకనే చెబుతూ వచ్చింది. ఇపుదు చూస్తే మోజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్ అయ్యారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఇరాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఎంపికైన మోజ్తాబా ఖమేనీ ప్రశాంతంగా బతుకుతాడనే నమ్మకం తనకు లేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విధంగా ఆయన ఇరాన్ కొత్త లీడర్ ఎంపిక పట్ల తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

ఈ కామెంట్స్ దేనికోసం :

కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రశాంతంగా బతుకుతాడో లేదో అంటూ ట్రంప్ డౌట్ వ్యక్తం చేయడం దేనికి సంకేతం అన్న చర్చ వస్తోంది. అంటే ఆయనను కూడా తన తండ్రి ఖమేనీ మాదిరిగా టార్గెట్ చేసి మట్టుపెడతారా అన్నది కూడా బిగ్ డిబేట్ ఉంది. అయితే ఈ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక పట్ల తాను ఏ మాత్రం సంతోషంగా లేనని ట్రంప్ చెప్పడం విశేషం. ఖమేనీ వారసులు కాదు అమెరికా కోరిన వారు అమెరికాకు అనుకూలంగా నడచుకునే వారినే ఇరాన్ ఎన్నుకోవాలన్నది ట్రంప్ ఆలోచన. ఒక విధంగా ఆయన పెట్టిన షరతుగా ఉంది అని అంటున్నారు. కానీ ఇరాన్ మాత్రం తమ దేశం తమ అంతర్గత వ్యవహారంలో వేరే దేశానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇక మరణించిన ఖమేనీ కంటే ఆయన రెండవ కుమారుడు మోజ్తాబా ఖమేనీ రెట్టింపు తెగింపు ఉన్న వారని ఆయన నాయకత్వంలో తమను తాము రక్షించుకుంటామని ఇరాన్ ధీటుగా బదులిస్తోంది.

అమెరికా జోక్యం ఉండాల్సిందే :

ఇదే ఇపుడు అగ్ర రాజ్యం పట్టుగా ఉంది. వెనిజులాలో జరిగినట్లుగా ఇరాన్ నాయకత్వంలో విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ అంటున్నారు. అక్కడ ఎవరు సుప్రీం లీడర్ గా ఎంపిక కావాలన్న అమెరికా ఆమోదం ఉండాల్సిందే అని ఆయన అంటున్నారు అలా జరగకపోతే ఎవరూ అక్కడ నిలబడలేరని కూడా అమెరికా స్పష్టంగా చెబుతోంది. మేము ఇచ్చిన ఆఫర్లని పక్కన పెట్టి టైం ని పూర్తిగా ఇరాన్ వేస్ట్ చేసుకుంటోంది అని ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నారు మోజ్తాబా ఖమేనీ అత్యంత బలహీనుడుగా అమెరికా అభివర్ణిస్తోంది.

లొంగే రకం కాదు :

అయితే మోజ్తాబా ఖమేనీ మాత్రం తండ్రి కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివారు అని ఇరాన్ లో వారు అంటున్నారు. అతను చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునే రకంగా చెబుతున్నారు. అమెరికా బెదిరింపులకు అసలు లొంగే రకం కాదని అంటున్నారు. ఇక ఇరాన్ లోని అతి సంప్రదాయవాదులకు మోజ్తాబా ఖమేనీ ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. ఆయన ఎంపిక ద్వారా ఇరాన్ అటు అమెరికాకే కాదు ఇటు ఇజ్రాయెల్ కి పెను సవాల్ విసిరింది అని అంటున్నారు. దీంతో యుద్ధం ఆగదు, ఇరాన్ ఏ మాత్రం తగ్గదు, ఇపుడు అమెరికా ముందు ఉన్నది ఏమిటి అన్నదే అసలైన చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.