ఇరాన్ సుప్రీంలీడర్ స్వలింగ సంపర్కుడా? ఇజ్రాయెల్ దాడిలో గాయపడి రష్యాలో తలదాచుకున్నారా?
ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న కొన్ని సంచలన ఆరోపణలు ఇరాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
By: A.N.Kumar | 17 March 2026 11:56 AM ISTఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం, ఆయన ప్రస్తుత నివాసం.. వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలోనూ, కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థల్లోనూ వస్తున్న కథనాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ అగ్రనేత మొజ్తబా ఖమేనీ అదృశ్యం కావడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇజ్రాయెల్ , అమెరికా జరిపిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న కొన్ని సంచలన ఆరోపణలు ఇరాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
చావు నుంచి క్షణాల్లో తప్పించుకున్న మొజ్తబా ఖమేనీ
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ఉన్నతాధికారులు మరణించినట్టు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సుప్రీం లీడర్‌గా భావిస్తున్న మొజ్తబా ఖమేనీ మాత్రం త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తాజా సమాచారం చెబుతోంది. బ్రిటన్‌కు చెందిన ‘టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం ఖమేనీ నివాసంపై మిస్సైల్ దాడి జరగడానికి కేవలం కొన్ని సెకన్ల ముందు మొజ్తబా బయట గార్డెన్ వైపు నడుచుకుంటూ వెళ్లారు. అదే సమయంలో భారీ పేలుడు సంభవించగా, ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి ఇరాన్ అధికారుల మధ్య చర్చల రూపంలో లీకైనట్లు తెలుస్తోంది. ఆ ఆడియోలో దాడి తీవ్రత, తృటిలో తప్పించుకున్న పరిణామాలపై వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రష్యాలో చికిత్స పొందుతున్నారా?
ఇటీవల జరిగిన దాడుల సమయంలో మొజ్తబా ఖమేనీకి తీవ్ర గాయాలయ్యాయని, ఇరాన్‌లో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను రహస్యంగా మాస్కోకు తరలించారని వార్తలు వస్తున్నాయి. రష్యాకు చెందిన ఒక ప్రత్యేక సైనిక విమానం ద్వారా ఆయనను తరలించారని, అక్కడ ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే రష్యా గానీ, ఇరాన్ గానీ ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఆయన క్షేమంగా ఉన్నారని చెబుతున్నప్పటికీ, ఆయన ఎక్కడ ఉన్నారో వెల్లడించకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.
వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద ఆరోపణలు
మరోవైపు మొజ్తబా ఖమేనీ వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అమెరికా నిఘా సంస్థల విశ్లేషణల ప్రకారం ఖమేనీ స్వలింగ సంపర్కుడని కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. ఆయన తన చిన్ననాటి గురువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు నివేదికలు అందుతున్నాయని.. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా చేరవేసినట్లు సమాచారం. ఇరాన్ వంటి కఠినమైన ఇస్లామిక్ చట్టాలు ఉన్న దేశంలో స్వలింగ సంపర్కం నేరం. అక్కడ సామాన్య పౌరులకు ఈ విషయంలో కఠిన శిక్షలు అమలు చేస్తారు. అటువంటి దేశానికి అత్యున్నత నాయకుడిగా ఉన్న వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం రాజకీయంగానూ, సామాజికంగానూ పెద్ద వివాదానికి కారణమవుతోంది. వికీలీక్స్ గతంలో లీక్ చేసిన పత్రాల్లో కూడా ఒక ప్రముఖ ఇరాన్ నేత వైద్య చికిత్స కోసం యూకే వెళ్లినట్లు ప్రస్తావన ఉంది, అది ఖమేనీ గురించేనని ఇప్పుడు కొందరు విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామాలు
ప్రస్తుతం ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో సుప్రీం లీడర్ అందుబాటులో లేకపోవడం ఇరాన్ సైనిక వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన అనారోగ్యం లేదా వ్యక్తిగత ఆరోపణలు నిజమని తేలితే, అది ఇరాన్ అంతర్గత భద్రతకు, పాలకుల విశ్వసనీయతకు పెద్ద దెబ్బ అవుతుంది.
