Begin typing your search above and press return to search.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం… పైలెట్ రోహిత్ రెడ్డికి భారీ షాక్

ఈ కేసు కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రాల రాజకీయ నాయకులను కూడా చుట్టుముట్టడం సంచలనం కలిగిస్తోంది.

By:  A.N.Kumar   |   22 March 2026 4:52 PM IST
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం… పైలెట్ రోహిత్ రెడ్డికి భారీ షాక్
X

తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్న మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన ఫామ్‌హౌస్‌ను అధికారులు శనివారం సీజ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసైన్డ్ భూమిలో నిర్మాణం.. రెవెన్యూ శాఖ కొరడా!

కేవలం డ్రగ్స్ పార్టీ ఆరోపణలే కాకుండా ఆ ఫామ్‌హౌస్ నిర్మాణంలో జరిగిన అక్రమాలు కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. సదరు ఫామ్‌హౌస్‌ను ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూమిలో నిర్మించినట్లు రెవెన్యూ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడంపై రెవెన్యూ , పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, భూమిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో చిక్కుకుని ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రోహిత్ రెడ్డికి ఈ ఆస్తుల జప్తు కోలుకోలేని దెబ్బగా మారింది.

దర్యాప్తులో బయటపడ్డ ప్రముఖుల పేర్లు

ఈ కేసు కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా పొరుగు రాష్ట్రాల రాజకీయ నాయకులను కూడా చుట్టుముట్టడం సంచలనం కలిగిస్తోంది. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో రాజకీయంగా కలకలం రేగింది. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రంగంలోకి దించింది. డ్రగ్స్ నెట్‌వర్క్ ఎంత లోతుగా ఉందో వెలికి తీసేందుకు అధికారులు నిందితుల వాహనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

డ్రగ్స్ మాఫియా లింకులు.. పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్

ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడంలో పోలీసులు కీలక విజయం సాధించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ముసుగు వేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న అభిషేక్ సింగ్‌ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు కౌశిక్ రవి ఇచ్చిన పక్కా సమాచారంతోనే అభిషేక్ సింగ్ పట్టుబడినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సమీపంలో రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ద్వారా డ్రగ్స్ చేతులు మారినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. విదేశాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఈ డ్రగ్స్ ఎలా దిగుమతి అయ్యాయనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ముందున్నది మరిన్ని అరెస్టులేనా?

ప్రస్తుతం పైలెట్ రోహిత్ రెడ్డి రిమాండ్‌లో ఉండగా ఆయన విచారణలో మరిన్ని సంచలన నిజాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న ఇతర ప్రముఖులు, సినీ రంగ వ్యక్తులు , రాజకీయ నేతల జాబితా కూడా సిట్ వద్ద ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ కాల్ డేటా ఆధారంగా ఈ గొలుసుకట్టు దందాలో ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగిన ఈ చీకటి వ్యాపారం ఇంకెంతమంది పెద్ద తలకాయలను చుట్టుముడుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాబోయే 48 గంటల్లో సిట్ మరిన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.