ఆముదంతో విషం తయారు చేసి ప్రజలను చంపేందుకు.. మొయినొద్దీన్ రెక్కీ
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసిన యువ డాక్టర్ ఎస్.డి. మొయినొద్దీన్ విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి.
By: A.N.Kumar | 11 Nov 2025 4:46 PM ISTదేశాన్ని కుదిపేసే మరో భయానక ఉగ్ర కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసిన యువ డాక్టర్ ఎస్.డి. మొయినొద్దీన్ విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈ డాక్టర్, భారతదేశంలో మానవహత్యకు దారితీసే అత్యంత ప్రమాదకరమైన పథకాన్ని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.
* 'రెసిన్' విషం తయారీ & మాస్ మర్డర్ ప్లాన్
మొయినొద్దీన్ తన కుట్రలో భాగంగా స్థానిక స్థాయిలో లభించే ఆముదం, కెమికల్ వ్యర్థాలు , ఇతర విషపదార్థాలను ఉపయోగించి "రెసిన్" అనే ప్రాణాంతక విషాన్ని తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషాన్ని దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, వాటర్ ట్యాంకులు, ఫుడ్ సెంటర్లు వంటి ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో కలిపి, సామూహిక హత్యలకు (మాస్ మర్డర్) పాల్పడాలని ప్రణాళిక వేసినట్లు సమాచారం.
* రెక్కీ చేసిన నగరాలు
గుజరాత్ ATS నివేదిక ప్రకారం.. మొయినొద్దీన్ తన ప్రణాళికలో భాగంగా ఇప్పటికే కీలకమైన మూడు నగరాల్లో 'రెక్కీ' నిర్వహించినట్లు విచారణలో అంగీకరించాడు. అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ వంటి నగరాల్లోని రద్దీగా ఉండే ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, వాటర్ సప్లై కేంద్రాలు , దేవాలయాల పరిసర ప్రాంతాలను అతను విషం కలిపేందుకు అనుకూలమైన ప్రదేశాలుగా గుర్తించి, పరిశీలించినట్లు తెలిసింది.
* ఉగ్ర నెట్‌వర్క్‌తో సంబంధాలు
మొయినొద్దీన్‌కు కొన్ని ఉగ్ర గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని, వారి ప్రోత్సాహంతోనే ఈ విషం తయారీ, సామూహిక హత్యల ఆపరేషన్ కోసం ప్లాన్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ కుట్ర వెనుక మరికొందరు ఉగ్ర నెట్‌వర్క్ సభ్యులు ఉన్నారని గుజరాత్ ATS అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును వేగవంతం చేస్తూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ATS ప్రకటించింది.
* భద్రతా సంస్థల హెచ్చరిక
భారత భద్రతా సంస్థలు ఈ కుట్రను అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నాయి. ఇలాంటి చర్యలు సామాన్య ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే కాక, దేశ భద్రతకు పెద్ద ముప్పు అని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటన భారత భద్రతా వ్యవస్థల అప్రమత్తతకు మరోసారి పరీక్షగా మారింది. దేశ ప్రజల సహకారంతో భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ కుట్ర స్పష్టం చేసింది.
