Begin typing your search above and press return to search.

మద్యం స్కాంపై లేటెస్ట్ అప్టేడ్.. మోహిత్ రెడ్డికి సుప్రీం రక్షణ

సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమనాథ్ ధర్మాసనం ఎదుట శుక్రవారం మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి.

By:  Tupaki Political Desk   |   10 Oct 2025 6:05 PM IST
మద్యం స్కాంపై లేటెస్ట్ అప్టేడ్.. మోహిత్ రెడ్డికి సుప్రీం రక్షణ
X

ఏపీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ యువనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఈ కేసులో ఆయన అరెస్టుకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు సీఐడీ సిట్ ను ఆదేశించింది. మోహిత్ రెడ్డి ముందస్తు బెయిలును హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగగా, నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతవరకు అరెస్టు చేయకుండా మధ్యాంతర రక్షణ కల్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో వైసీపీ నేత మోహిత్ రెడ్డి నాలుగు వారాల పాటు అరెస్టు నుంచి తప్పించుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో మోహిత్ రెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టు అయ్యారు. జూన్ నుంచి ఆయన విజయవాడ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఇదే కేసులో మోహిత్ రెడ్డిపై అభియోగాలు రావడంతో ఐదుసార్లు విచారణకు రమ్మంటూ సిట్ నోటీసులిచ్చింది. అయితే అరెస్టు భయంతో ఆయన మందస్తు బెయిలు కోసం తొలుత ట్రైల్ కోర్టులో ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు చోట్ల ఊరట దక్కకపోవడంతో చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమనాథ్ ధర్మాసనం ఎదుట శుక్రవారం మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేవలం మోహిత్ రెడ్డి పేరుతో ఉన్న కారులో డబ్బులు పట్టుబడ్డాయనే కారణంతో కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు. ఇదే కేసులో మోహిత్ రెడ్డి తండ్రిని జైలులో పెట్టారని, మోహిత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలని చూస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే నిందితుడి తరపు లాయర్ వాదనలను సిట్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఖండించారు.

కారు పట్టుకున్నందుకు అరెస్టు చేయాలని చూడటం లేదని, కారులో డబ్బు కట్టలను అక్రమంగా తరలించినందుకే కేసు పెట్టినట్లు కోర్టుకు తెలిపారు. ఎన్నికల సమయంలోనే మోహిత్ రెడ్డిపై కేసు నమోదైందని, అప్పట్లో నిందితుడితోపాటు ఆయన తండ్రి కూడా ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. అంతేకాకుండా ఇది మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం. అక్కడ కిక్ బ్యాగ్స్ రూపంలో తీసుకున్న డబ్బులు ఎన్నికల్లో ఖర్చుచేయడానికి తరలించారు. ఇలాంటి కుంభకోణాన్ని తన సర్వీసులో చూడలేదని ముకుల్ రోహత్గీ వాదించారు.

అయితే ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం వాదనలను కౌంటర్ లో చెప్పాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. అప్పటివరకు నిందితుడికి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల తరువాత కేసు విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, మద్యం కేసులో ఏ4 వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సైతం ముందస్తు బెయిలు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. విచారణ తరువాత ముందస్తు బెయిలు తిరస్కరించడంతో ఎంపీ అరెస్టు కావలసివచ్చింది. ఇప్పుడు మోహిత్ రెడ్డి విషయంలో కోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ప్రస్తుతానికి ఉపశమనం దక్కినట్లైంది. అయితే ధర్మాసనం తుది తీర్పు ఎలా ఉంటుందనేది మాత్రం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది.