Begin typing your search above and press return to search.

జాతివివక్షనే అమెరికాలో తెలంగాణ టెకీని చంపేసిందా?

ఈ ఘటనపై కుటుంబ సభ్యుల వాదన వేరుగా ఉంది. నిజాముద్దీనే మొదట సహాయం కోసం పోలీసులకు కాల్ చేశాడని వారు చెబుతున్నారు.

By:  A.N.Kumar   |   19 Sept 2025 8:15 PM IST
జాతివివక్షనే అమెరికాలో తెలంగాణ టెకీని చంపేసిందా?
X

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన పోలీసు కాల్పుల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక యువ టెకీ మృతి చెందాడు. ఈ సంఘటనను పోలీసులు 'అధికారి ప్రమేయం ఉన్న కాల్పులు'గా పేర్కొనగా, మృతుడి కుటుంబం మాత్రం ఇది జాతివివక్ష కారణంగానే జరిగిందని తీవ్రంగా ఆరోపిస్తోంది.

మృతుడు మహమ్మద్ నిజాముద్దీన్ (30) సాంటా క్లారా నగరంలోని ఒక టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. స్థానిక మీడియా ప్రకారం.. తన రూమ్‌మేట్‌తో ఘర్షణ జరిగిన తర్వాత పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. సాంటా క్లారా పోలీస్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం.. నిజాముద్దీన్ కత్తి పట్టుకుని తన రూమ్‌మేట్‌ను గాయపరిచాడనే ఫిర్యాదు రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించగా అక్కడ నిజాముద్దీన్ మరణించాడు.

* కుటుంబ సభ్యుల ఆరోపణలు

ఈ ఘటనపై కుటుంబ సభ్యుల వాదన వేరుగా ఉంది. నిజాముద్దీనే మొదట సహాయం కోసం పోలీసులకు కాల్ చేశాడని వారు చెబుతున్నారు. అంతేకాకుండా నిజాముద్దీన్ అమెరికాలో చాలా కాలంగా జాతివివక్షకు గురవుతున్నాడని పలుమార్లు తన కుటుంబ సభ్యులతో చెప్పాడని వారు పేర్కొన్నారు.

జాతి వివక్షపై నిజాముద్దీన్ పోస్ట్‌లు

నిజాముద్దీన్ తన లింక్డిన్ ఖాతాలో తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి బహిరంగంగా రాశాడు. "నేను జాతివివక్ష, జాతిద్వేషం, వేతన మోసం, తప్పుదోవ పట్టించడం, చట్టానికి అడ్డంకులు సృష్టించడం వంటి అన్యాయాలకు గురయ్యాను. ఇక చాలు. అమెరికాలోని శ్వేత జాతి ఆధిపత్యం, జాతి వివక్షత ఆగిపోవాలి" అని అతను ఒక పోస్ట్‌లో పేర్కొన్నాడు. అతను ఫుడ్ పాయిజనింగ్, బలవంతపు గృహనిర్వాసం, డిటెక్టివ్ ద్వారా నిఘా వంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నట్లు తెలిపాడు.

ప్రభుత్వ జోక్యం కోసం విజ్ఞప్తి

ఈ ఘటనపై మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్, నిజాముద్దీన్ తండ్రిని కలసి, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌కు లేఖ రాశారు. భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడంలో సాయం చేయాలని కుటుంబం డిమాండ్ చేసింది. అయితే ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.