మినిస్టర్ అజహరుద్దీన్.. వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా?
సామన్య కుటుంబానికి చెందిన అజీదుద్దీన్, యూసుఫ్ సుల్తానా దంపతులకు 1963 ఫిబ్రవరి 8న జన్మించిన అజహర్.. హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో చదివారు.
By: Tupaki Political Desk | 30 Oct 2025 4:00 AM ISTఅది 1980ల ప్రారంభ సమయం... హైదరాబాద్ లోని ఓ క్రికెట్ మైదానం.. బౌలర్ బంతిని ఎంత అద్భుతంగా వేసినా ఓ కుర్రాడు మాత్రం ఔట్ కావడం లేదు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ ప్రత్యర్థి కెప్టెన్ ను ఠారెత్తిస్తున్నాడు... వందల కొద్దీ పరుగులు చేస్తున్నాడు..! విసుగెత్తిన ప్రత్యర్థి కెప్టెన్.. ఏం ఆడుతున్నాడ్రా వీడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఆ కెప్టెన్ పేరు అర్షద్ అయూబ్ అయితే.. ఆ కుర్రాడు మొహమ్మద్ అజహరుద్దీన్..! ఇది జరిగిన కొద్ది కాలానికే ఆ కుర్రాడు టీమ్ ఇండియాలోకి వచ్చేశాడు. ఆ తర్వాత చరిత్రను తిరగరాశాడు. ఇక క్యా మియా కెప్టెన్ బనోగే (ఓ కుర్రాడా.. కెప్టెన్ అవుతావా)... భారత క్రికెట్ ఉన్నంత కాలం వినిపించే మాట ఇది..! అంత ప్రభావం చూపిన ఈ మాట 35 ఏళ్ల కిందట భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌సింగ్ దుంగార్పూర్ నోటి నుంచి వచ్చింది.
అది.. హైదరాబాదీ బ్యాట్స్ మన్ అజహరుద్దీన్ గురించి. దుంగార్పూర్ ప్రోత్సాహంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన ఐదేళ్లకు... 1989లో క్రిష్ణమాచారి శ్రీకాంత్ నుంచి కెప్టెన్సీ స్వీకరించాడు అజహర్. దుంగార్పూర్ కు అజహర్ అంటే ప్రత్యేక అభిమానం. అందుకే, క్యా మియా కెప్టెన్ బనోగే అంటూ ఏరికోరి సారథ్యం అప్పగించారు. ఆయనను అజహర్ తన గురువుగా చూసేవాడు. అలా 1989లో మొదలైన అజహర్ కెప్టెన్సీ ప్రస్థానం దాదాపు పదేళ్లు సాగింది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచేలా చేసింది. అజ్జూ, అజ్జూ భాయ్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే స్థాయికి చేర్చింది. హైదరాబాదీ గల్లీల నుంచి అంతర్జాతీయ స్థాయికి అజహర్ ప్రస్థానం సాగిన వైనం చూస్తే ఔరా అని ఆశ్చర్యపోవాల్సిందే.
హైదరాబాద్ గల్లీల్లో..
సామన్య కుటుంబానికి చెందిన అజీదుద్దీన్, యూసుఫ్ సుల్తానా దంపతులకు 1963 ఫిబ్రవరి 8న జన్మించిన అజహర్.. హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో చదివారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. కుర్రాడిగా ఉన్నప్పటి నుంచే క్రికెట్ లో విశేష ప్రతిభ చూపారు. కాలేజీ రోజుల్లో... ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిలతో కలిసి ఆడారు. 1981లో 18 ఏళ్ల వయసులో హైదరాబాద్ రంజీ జట్టు తరఫున అరంగేట్రం చేశారు. 1984లో టీమ్ ఇండియాలోకి వచ్చారు. ఆ ఏడాది డిసెంబరు 31న ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అదే మ్యాచ్‌లో సెంచరీ కొట్టారు. ఈ సిరీస్ లో తర్వాతి రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలు కొట్టి హ్యాట్రిక్ శతకాలు సాధించారు. ఇలా అరంగేట్రంలోనే మూడు వరుస సెంచరీలు చెరగని రికార్డు.
మూడు వరల్డ్ కప్ ల కెప్టెన్.. 99, 199
1989లో టీమ్ ఇండియా కెప్టెన్ అయిన అజహర్.. 2000 సంవత్సరం వరకు మధ్యలో కొంత కాలం తప్ప కెప్టెన్ గా కొనసాగారు. వరుసగా మూడు... 1992, 1996, 1999 వన్డే ప్రపంచ కప్ లలో సారథి ఈయనే. ఈ రికార్డు మరే భారత క్రికెటర్ కూ సాధ్యం కాకపోవడం గమనార్హం.
-అజహర్ 99 టెస్టులు ఆడాడు. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో టెస్టు చివరిది. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో 100వ టెస్టు ఆడే అవకాశం రాలేదు. దీంతో చరిత్రలో 99 టెస్టులతో ఆగిపోయిన ఏకైక (ప్రస్తుతానికి) క్రికెటర్ గా మిగిలారు. వంద టెస్టులు ఆడాలన్నది అజహర్ తన కలగా చాలాసార్లు చెప్పడం గమనార్హం. (వెస్టిండీస్ దిగ్గజ పేసర్ అంబ్రోస్ 98 టెస్టుల అనంతరం రిటైర్ అయ్యాడు.) ఇంతకూ టెస్టుల్లో అజహర్ అత్యధిక స్కోరు ఎంతో తెలుసా? 199. ఇక అప్పట్లో రికార్డు స్థాయిలో 334 వన్డేల్లో ఆడారు. 9,378 పరుగులు చేశారు.
మణికట్టుతో పరుగుల వరద
భారత క్రికెట్ లో గావస్కర్ తర్వాత సచిన్ టెండూల్కర్ కంటే ముందు యువతను విశేషంగా ఆకట్టుకున్న బ్యాట్స్ మన్ అజహర్. మణికట్టు స్పిన్నర్ల గురించి విన్నారు.. కానీ, అజహర్ మణికట్టు బ్యాటర్. బ్యాట్ ను మంత్రదండంలా తిప్పుతూ అతడు పరుగులు సాధిస్తుంటే అభిమానులు మంత్రముగ్ధులయ్యేవారు. ఇది తర్వాతి కాలంలో వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లకూ అలవడింది. పక్కా హైదరాబాదీ బ్యాటింగ్ స్టయిల్ గా పేరుతెచ్చుకుంది.
-హైదరాబాద్ కే చెందిన నౌరీన్ ను 1987లో వివాహం చేసుకున్న అజహర్ 1996లో విడాకులు ఇచ్చాడు. వీరికి అసదుద్దీన్, అయాజుద్దీన్ కుమారులు. అయాజ్ 2011లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. 1996 తర్వాత అజహర్ బాలీవుడ్ నటి సంగీతా బిజిలానీతో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్నారు. 2010లో వీరు విడిపోయారు.
-2009లో యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2023లో తెలంగాణలోని జూబ్లీహిల్స్ నుంచి బరిలో దిగి పరాజయం పాలయ్యారు. దీనికిముందు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు.
-మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2000 సంవత్సరంలో జీవిత కాల నిషేధానికి గురైన అజహర్ కోర్టు తీర్పుతో 2012లో ఆ ఆరోపణల నుంచి బయటపడ్డారు.
-తాను ఎదిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘానికి (హెచ్‌సీఏ) అజహర్ 2019 నుంచి 2022 వరకు అధ్యక్షుడిగా పని చేశారు.
-ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కాబోతున్నారు.
కొసమెరుపుః 1980ల్లో భారత క్రికెట్ లో ఒక క్రికెటర్ కు అసలు క్యాచ్ లు పట్టలేడు అన్న చెడ్డ పేరు ఉండేది. ఈ క్రికెటర్ అర్షద్ అయూబ్. మరో క్రికెటర్ కు ఎంతటి సంక్లిష్టమైన క్యాచ్ నయినా పట్టేస్తాడనే గొప్ప పేరుంది. ఈ ఆటగాడు మొహమ్మద్ అజహరుద్దీన్.
