మొహమ్మద్ అజహరుద్దీన్.. తెలంగాణ కేబినెట్ లోకి మరో కెప్టెన్
అజహరుద్దీన్ టీమ్ ఇండియాకు విజయవంతమైన కెప్టెన్. వరుసగా మూడు వన్డే ప్రపంచ కప్ లలో (1992, 1996, 1999) అతడు జాతీయ జట్టును నడిపించాడు.
By: Tupaki Political Desk | 29 Oct 2025 5:57 PM ISTసరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంది, దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.20 లక్షల వరకు ఉన్న మైనారిటీ ఓట్లను మూకుమ్మడిగా దండుకునే ఎత్తుగడ వేసింది. భారత జట్టుకు దాదాపు పదేళ్లు కెప్టెన్ గా పనిచేసిన అజహరుద్దీన్ పక్కా హైదరాబాదీ. ఆయన మంత్రి పదవి ఇవ్వడం ద్వారా హైదరాబాద్ జిల్లాకు మంత్రి వర్గంలో చోటు కల్పించినట్లు అయింది.
క్రికెట్ కెప్టెన్.. మాజీ ఎంపీ
అజహరుద్దీన్ టీమ్ ఇండియాకు విజయవంతమైన కెప్టెన్. వరుసగా మూడు వన్డే ప్రపంచ కప్ లలో (1992, 1996, 1999) అతడు జాతీయ జట్టును నడిపించాడు. ఒక్కసారి కూడా కప్ గెలవనప్పటికీ.. టెస్టుల్లో, వన్డేల్లో రికార్డు స్థాయిలో విజయాలు అందించాడు. బ్యాట్స్ మన్ గానూ అజహర్ మేటి ఆటగాడు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో అజహర్ పేరు రావడంతో ఆయన కెరీర్ అర్థంతరంగా ముగిసింది. లేదంటే రిటైర్మెంట్ అనంతరం బీసీసీఐలో అజహర్ చాలా కీలక పాత్ర పోషించేవారే. కాగా, 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అజహర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఇంకా గవర్నర్ ఆమోదం రావాల్సి ఉంది.
మైనారిటీ, హైదరాబాద్ కోటా భర్తీ
తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి ఎవరూ లేరు. హైదరాబాద్ నుంచి కూడా మంత్రి లేరు. అజహర్ నియామకంతో ఈ రెండు స్థానాలూ భర్తీ కానున్నాయి. మరోవైపు అజహర్ ప్రమాణం ఎల్లుండే (శుక్రవారం) అని తెలుస్తోంది. అదే జరిగితే కెప్టెన్ (యుద్ధ విమాన పైలట్) ఉత్తమ్ కుమార్ రెడ్డికి తోడుగా తెలంగాణ ప్రభుత్వంలో మరో కెప్టెన్ (అజహర్) ఉన్నట్లవుతుంది.
119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో 15 శాతం మంత్రి పదవుల నిబంధన ప్రకారం 18 మందిని తీసుకునే చాన్సుంది. ప్రస్తుతం 15 మంది ఉన్నారు. వీరిలో అజహర్ పోగా మరో ఖాళీలు ఉంటాయి. అయితే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజహర్ నియామకానికి ఆమోదం లభించకుంటే ఏమిటి పరిస్థితి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆయనను త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల నుంచి శాసన మండలికి పంపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
-టీమ్ ఇండియా తరఫున 99 టెస్టుల్లో 6,215, 334 వన్డేల్లో 9,378 పరుగులు చేశారు అజహర్. 1984 నుంచి 2000 వరకు దేశానికి ఆడారు.
