మోదుగుల రాజకీయం ఎటు వైపు .. హామీ దక్కిందా ?
గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. ఆయనకు రాజకీయ అవకాశాలు తెలుగుదేశం పార్టీ నుంచే దక్కాయి.
By: Satya P | 12 Oct 2025 9:02 AM ISTగుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. ఆయనకు రాజకీయ అవకాశాలు తెలుగుదేశం పార్టీ నుంచే దక్కాయి. 2009లో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. అప్పట్లో ఉమ్మడి ఏపీ విభజన సమయంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు బాగా వినిపించింది ఆయన సమైక్యవాదం స్టాండ్ తీసుకుని గట్టిగా పోరాడేవారు. ఇక విభజన తరువాత 2014 ఎన్నికల్లో నరసారావుపేట టికెట్ ని రాయపాటి సాంబశివరావుకు టీడీపీ ఇచ్చింది. మోదుగులకు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. టీడీపీ ఊపులో ఎమ్మెల్యేగా అయ్య్యారు మోదుగుల. అయితే ఆయన అంత హ్యాపీగా మాత్రం లేరని అప్పట్లోనే ప్రచారం సాగింది.
ఎంపీ కావాలనే :
మరో మారు ఎంపీ కావాలని ఆయన అనుకుంటే 2019 ఎన్నికలలో ఆయనకు ఏ సీటూ ఇవ్వలేదు, దాంతో ఆయన వైసీపీ వైపుగా వచ్చారు వైసీపీ అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్నా మోదుగులకు మాత్రం అధికార పదవులు ఏవీ దక్కలేదు కానీ మోదుగుల నరసరావుపేట లోక్ సభ సీటు మీదనే పెద్ద ఆశలు పెట్టుకుని ఫ్యాన్ పార్టీలో కొనసాగారు తీరా 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆ సీటు కాస్తా ఎక్కడో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చి మోదుగులకు దెబ్బేశారు. దాంతో ఆయన విసిగి వేసారి తనకీ రాజకీయాలు వద్దు అని దండం పెట్టేశారని అంటారు.
వ్యవసాయం చేసుకుంటూ :
ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమి తరువాత మోదుగుల పార్టీ పెద్దలకు టచ్ లోకి వెళ్లడం లేదు. ఆయన రాజకీయంగా కూడా అంత యాక్టివ్ గా లేరని అంటున్నారు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారుట. ఒక విధంగా చెప్పాలీ అంటే బలమైన సామాజిక వర్గం అనుచర గణం అన్నీ ఉండి కూడా మోదుగుల రాజకీయంగా వెనకబడిపోయారని ఆయన అనుచరులు అంటూంటారు.
గ్రీన్ సిగ్నల్ దక్కిందా :
ఈ నేపథ్యంలో మోదుగులకు అధినాయకత్వం నుంచి తాజాగా పిలుపు వచ్చిందని అంటున్నారు. మోదుగులను జగన్ పిలిపించుకుని యాక్టివ్ కమ్మని కోరారని అంటున్నారు అంతే కాదు ఆయన కోరుకున్న విధంగా వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీ సీటు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు అని అంటున్నారు. దాంతో మోదుగుల ఫుల్ హుషార్ అయ్యారని అంటున్నారు. ఆయన తిరిగి రాజకీయంగా జోరు చేస్తున్నారు. ఆయన తాజాగా గుంటూరు జిల్లాలోని వైసీపీ కార్యకర్తలతో నాయకులతో భేటీ అవుతున్నారు. పార్టీ అభివృద్ధి గురించి చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారని అంటున్నారు. విషయం ఏమిటి అంటే 2009 ఎన్నికల్లో తొలిసారి ఎంపీ అయిన మోదుగుల మళ్ళీ 20 ఏళ్ళ తరువాత అదే సీటు నుంచి పోటీ చేసి ఎంపీ అవుతారా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా మరోసారి గెలిచి పార్లమెంట్ కి వెళ్ళాలని ఆ తరువాతనే తన రాజకీయ విరమణ చేయాలని పట్టుబట్టిన పెద్దాయన ఆశలు ఏ మేరకు తీరుతాయన్నది వేచి చూడాల్సిందే.
