Begin typing your search above and press return to search.

అమెరికాకు 'పీడకల' కాబోతుందా? భారత్‌లో ఒకే వేదికపై జిన్‌పింగ్, పుతిన్, మోదీ

వచ్చే నెల భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు హాజరుకానుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

By:  A.N.Kumar   |   2 Aug 2026 7:00 PM IST
అమెరికాకు పీడకల కాబోతుందా? భారత్‌లో ఒకే వేదికపై జిన్‌పింగ్, పుతిన్, మోదీ
X

అంతర్జాతీయ రాజకీయాల్లో మరో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఘట్టానికి కాలం ఆసన్నమవుతోంది. వచ్చే నెల భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు హాజరుకానుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యంలో ఈ ముగ్గురు శక్తివంతమైన అగ్రనేతలు ఒకే వేదిక పంచుకోబోతుండటం గ్లోబల్ పాలిటిక్స్‌లో సరికొత్త చర్చకు తెరలేపింది.

భౌగోళిక రాజకీయాల్లో మారనున్న సమీకరణాలు

సోషల్ మీడియాలోని కొందరు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు ఈ పరిణామాన్ని "అమెరికాకు బిగ్గెస్ట్ పీడకల " గా అభివర్ణిస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి చెక్ పెడుతూ గ్లోబల్ సౌత్ దేశాల బలాన్ని చాటిచెప్పే దిశగా ఈ భేటీ ఉండబోతోందని భావిస్తున్నారు.

ఆర్థిక రంగంలో తిరుగులేని శక్తి

ఆర్థిక ప్రాధాన్యత కోణంలో చూస్తే ఈ మూడు దేశాల కలయిక అత్యంత బలమైనది. కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా చైనా, భారత్, రష్యాల ఆర్థిక వ్యవస్థ విలువ ఏకంగా 70.7 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రపంచ మొత్తం ఆర్థిక వ్యవస్థలో దాదాపు మూడో వంతు కావడం విశేషం. తయారీ , సాంకేతికత, ఇంధన వనరులు, వ్యవసాయం, అరుదైన ఖనిజాల వంటి అత్యంత కీలకమైన రంగాల్లో ఈ మూడు దేశాలదే పైచేయి.

సదస్సు ప్రధాన అజెండా ఏమిటి?

ఈ బ్రిక్స్ సదస్సులో పలు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు సభ్య దేశాల మధ్య స్థానిక కరెన్సీలలోనే వ్యాపార లావాదేవీలు నిర్వహించడం. గ్లోబల్ సప్లై చైన్‌ను మరింత బలోపేతం చేసి, పరస్పర ఆర్థిక సహకారాన్ని పెంచడం... ఐక్యరాజ్యసమితి వంటి గ్లోబల్ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ప్రాధాన్యం కల్పించడం ధ్యేయంగా పెట్టుకున్నారు.

ఈ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, భారత్ తన బహుముఖ దౌత్య విధానాన్ని చాకచక్యంగా కొనసాగిస్తోంది. ఒకవైపు అమెరికా, ఐరోపా దేశాలతో సన్నిహితంగా ఉంటూనే, మరోవైపు రష్యా, చైనాలతో వ్యూహాత్మక బంధాన్ని కాపాడుకుంటూ 'గ్లోబల్ సౌత్' దేశాల గొంతుకగా నిలుస్తోంది.

ప్రపంచ దృష్టి అంతా భారత్ వైపే

ఇటీవలే బ్రిక్స్ కూటమి విస్తరణ జరగడంతో దీని ప్రభావం పరిధి ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మందికి విస్తరించాయి. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జిన్‌పింగ్, పుతిన్, మోదీల భేటీ కేవలం ఒక దౌత్యపరమైన సమావేశంగా మిగిలిపోతుందా? లేక ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త ధ్రువీకరణకు నాంది పలుకుతుందా? అన్నది వేచి చూడాల్సిందే..