Begin typing your search above and press return to search.

డ్రాగన్ - ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలన్న జిన్ పింగ్.. ఎందుకంటే?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య అస్థిరత నెలకొన్న వేళ మోడీ.. జిన్ పింగ్ లు భేటీ కావటం ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై ప్రత్యేకంగా చర్చించుకోవటం ప్రాధాన్యాన్ని సంతరించుకునేలా చేసింది.

By:  Garuda Media   |   1 Sept 2025 3:21 PM IST
డ్రాగన్ - ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలన్న జిన్ పింగ్.. ఎందుకంటే?
X

ఏం జరిగినా మన మంచికే అంటూ మన పెద్దోళ్లు అప్పుడెప్పుడోనే ఒక మాటను తరచూ చెప్పేటోళ్లు. ఏదైనా ఒకటి జరిగినప్పుడు మనం అందులోని నెగిటివ్ ను ఎక్కువ మంది చూస్తారు.కానీ.. అందులోని సానుకూలతను కొద్దిమందే చూస్తారు. ఈ రెండో మార్గాన్ని ఎంచుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యమా అని.. కలలో కూడా ఊహించని ఒక పరిణామం ఇప్పుడు తెర మీదకు రావటమే కాదు.. చైనా అధ్యక్షుడి నోట మేజిక్ మాట ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి మాట ఒకటి చైనా అధ్యక్షుడి నోటి నుంచి వస్తుందని ఏ భారతీయుడు మాత్రమే కాదు మరే చైనీయుడు కూడా అనుకునేవాడు కాదు. ఇందుకు కారణమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే.

అర్థం లేని విధానాలతో మొండిగా వ్యవహరిస్తూ జగమొండి తీరును గుర్తుకు తెచ్చేలా చేసిన అమెరికా అధ్యక్షుడి ట్రంప్ పుణ్యమా అని.. భారత వేసిన అడుగుకు చైనా అంతే వేగంగా స్పందించటం.. తాజాగా ఇరు దేశాల కీలక నేతలు భేటీ కావటమే కాదు.. వీరిద్దరి నుంచి వెలువడిన సందేశాల్ని చూసినప్పుడు.. కొత్త దిశగా రెండు దేశాల ప్రయాణం మొదలైందన్న విషయం అర్థమవుతుంది.

రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకునే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య కీలకంగా మారింది. రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలకు సహేతుకమైన.. పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారానికి కనుగునేందుకు కృషి చేయాలని డిసైడ్ కాగా.. అందుకు చైనా అధ్యక్షుడి నుంచి సానుకూలత వ్యక్తమైంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య అస్థిరత నెలకొన్న వేళ మోడీ.. జిన్ పింగ్ లు భేటీ కావటం ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై ప్రత్యేకంగా చర్చించుకోవటం ప్రాధాన్యాన్ని సంతరించుకునేలా చేసింది. ఇరు దేశాల అగ్రనేతల భేటీ అనంతరం చైనా విదేశీంగ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో కీలక అంశాల్ని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం.. పెట్టుబడులను మరింత పెంచేందుకు.. వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించినట్లుగా పేర్కొన్నారు

భారత్ - చైనా శత్రువులు కాదని.. అభివృద్ధి భాగస్వాములని మోదీ, జిన్‌పింగ్‌లు పేర్కొన్నట్లుగా ప్రకటనలో వెల్లడించారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారొద్దని పేర్కొనటమే కాదు.. ఇరుదేశాల ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేసేందుకు వీలుగా నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ.. వీసా ప్రక్రియ సరళతరం చేయటం.. పర్యాటక వీసాలు జారీ చేయటం లాంటివి చేపట్టాలని నిర్ణయించారు.

మానససరోవర్ యాత్ర పున ప్రారంభం లాంటి అంశాలపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇరుదేశాల సరిహద్దుల్లో సైన్యాల్ని వెనక్కి తీసుకోవటం.. ఉద్రిక్తలను తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడైంది. భారత్ - చైనా మధ్య సహకారం 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు సంబంధించిందని.. ప్రపంచ మానవాళి సంక్షేమానికి మార్గం చేస్తుందని మోడీ పేర్కొన్నారు. అంతేకాదు.. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేందుకు సరిహద్దుల్లో శాంతి.. స్థిరత్వం ఎంతో ముఖ్యమని మోడీ పేర్కొన్నారు.

పరస్పర నమ్మకం.. గౌరవం ఆధారంగా ఇరుదేశాల సంబంధాల్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పేర్కొంటే.. భారత్ - చైనా స్నేహితులుగా ఉండటమే సరైన ఎంపికగా చైనా సుప్రీం జిన్ పింగ్ పేర్కొనటం గమనార్హం. సరిహద్దు సమస్యలు ఇరుదేశాల బంధాల్ని ప్రభావితం చేయొద్దని చైనా అధినేత భారత ప్రధాని నరేంద్ర మోడీతో పేర్కొన్నట్లుగా వెల్లడైంది. ఇరుగు పొరుగు దేశాలుగా.. ఒకరి విజయానికి మరొకరు సాయం చేసుకునే భాగస్వాములుగా ఉండాలన్న ఆయన నోటి నుంచి మరో ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది.

చైనా చిహ్నమైన డ్రాగన్.. భారత చిహ్నమైన ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యాఖ్య రెండు దేశాల మధ్య మొదలైన కొత్త స్నేహానికి ప్రతీకగా చెప్పొచ్చు. భారత్ - చైనా ప్రత్యర్థులు కావని.. సహకార భాగస్వాములుగా పేర్కొన్నారు. ట్రంప్ ఒంటెద్దు విధానాల్ని పరోక్షంగా విమర్శించిన చైనా అధినేత.. ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు రెండు దేశాలు కలిసి పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటమే కాదు.. మరో ఆసక్తికర వ్యాఖ్య చేయటం ఆసక్తికరంగా మారింది.

‘‘ప్రపంచ వ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. శతాబ్దానికి ఒకసారి జరిగే మార్పులు వస్తున్నాయి’’ అని చైనా అధ్యక్షుడు వ్యాఖ్యానించటం గమనార్హం. తాజా భేటీ నేపథ్యంలో వచ్చే ఏడాది భారత్ లో జరిగే బ్రిక్స్ సదస్సుకు రావాలని జిన్ పింగ్ ను మోడీ ఆహ్వానించారు. తాజా పర్యటనలో చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యయుడు కాయ్ ఖితోనూ ప్రధాని మోడీ భేటీ కావటం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు. మొత్తంగా అనూహ్య రీతిలో తెర మీదకు వచ్చిన మోడీ చైనా టూర్.. అంచనాలకు మించిన ఫలితాల్ని అందిస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతోందని చెప్పక తప్పదు.